Begin typing your search above and press return to search.

అమ్మడు తెగ ఫీలైపోతోంది .. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   23 May 2022 1:30 PM GMT
అమ్మడు తెగ ఫీలైపోతోంది .. ఎందుకో తెలుసా?
X
టాలీవుడ్ అందగత్తెల్లో కొంతమంది పేర్లను రాయమని చెబితే, కుర్రాళ్లు ఎంత హడావిడిగా రాసుకొచ్చినా అందులో మెహ్రీన్ పేరు ఉంటుంది. అంతగా ఆమె తన వాలు చూపులతో .. స్కిన్ టోన్ తో వాళ్ల మనసులను హోల్ సేల్ గా కొట్టేసింది. గుండెలన్నీ గుత్తాకి తీసేసుకుంది. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెహ్రీన్, తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత చేసిన 'మహానుభావుడు' .. 'రాజా ది గ్రేట్' సినిమాలు ఆమె కెరియర్ కి మరింత బలాన్నిచ్చాయి.

అభిమానుల సంఖ్యను పెంచే అందం .. అవసరమైనంత అభినయం ఉన్న మెహ్రీన్, ఇక తెలుగులో తన జోరును చూపించడం ఖాయమని అంతా అనుకున్నారు. ఆమె హవా కొనసాగుతుందని భావించారు. కానీ అలా జరగలేదు .. అందుకు కారణం ఆ వెంటనే ఆమెకి ఆ స్థాయి హిట్లు పడకపోవడమే. ఆ తరువాత తాను ఎంచుకున్న కథలు ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోవడమే. ఆ సమయంలో తన దగ్గరికి వచ్చిన 'సరైనోడు' ఆఫర్ ను వదులుకోకపోతే తన కెరియర్ వేరేలా ఉండేదని మెహ్రీన్ బాధపడుతోంది.

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు' భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. 'సరైనోడు'లో హీరోయిన్ ఛాన్స్ ముందుగా నాకే వచ్చింది .. కానీ కొన్ని కారణాల వలన చేయలేకపోయాను.

ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఆ సినిమా పడితే నా కెరియర్ వేరేలా ఉండేది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో వరుస ఫ్లాపులు వచ్చినప్పుడు 'ఎఫ్ 2' ఆదుకుంది. అలాగే ఈ సారి వచ్చిన గ్యాప్ ను 'ఎఫ్ 3' కవర్ చేస్తుందని మెహ్రీన్ భావిస్తోంది.

ఇక తన కాలేజ్ రోజులను గురించి కూడా మెహ్రీన్ ప్రస్తావించింది. "కాలేజ్ రోజుల్లో చాలామంది అబ్బాయిలు వెంటపడేవారు. కాస్త ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పిన వాళ్లు చాలామందినే ఉన్నారు. అప్పట్లో నేను కాస్త రెబల్ గా ఉండేదానిని.

అందువలన చాలామంది నన్ను చూస్తే భయపడేవారు. నేను మాత్రం ఆ సమయంలో సల్మాన్ ను ఎక్కువగా లైక్ చేసేదానిని. ఆయన ఒప్పుకుంటే చాలు పెళ్లి చేసుకోవాలని అనుకునేదానిని" అంటూ నవ్వేసింది. ఒక రకంగా ఈ అమ్మడు సల్మాన్ కండలు చూపించి కూడా కాలేజ్ కుర్రాళ్లను భయపెట్టిందనుకోవాలేమో!