Begin typing your search above and press return to search.

'కోటి' అందుకునేవారు కార్మికుల‌ను ఆదుకోవాలి!

By:  Tupaki Desk   |   29 March 2020 2:30 PM GMT
కోటి అందుకునేవారు కార్మికుల‌ను ఆదుకోవాలి!
X
క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించ‌డానికి భార‌త్ లాక్ డౌన్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో నిరు పేద‌లు... కూలీలు...కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించే ప‌రిస్థితి తలెత్తింది. ప్ర‌భుత్వం కొన్ని వృత్తుల వారికి మిన‌హాయింపు ఇచ్చినా క‌రోనా కార‌ణంగా ఎవ‌రూ ప‌నుల్లోకి తీసుకోవ‌డం లేదు. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే ఉండాల్సిన స‌న్నివేశం ఉంది. బాలీవుడ్ న‌టి క‌త్రినా కైఫ్ త‌న ఇంట్లో తానే స్వ‌యంగా అంట్లు తోమిన దృశ్యాల్ని చూసి అవాక్క‌య్యాం. చీపుళ్లు చేత‌ప‌ట్టి ఇల్లు తుడుచుకున్నారు. బాత్రూమ్ లు క్లీన్ చేసుకున్నారు. ఇదంతా చూస్తుంటే యుద్ధ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించింది. తాజా ప‌రిస్థితి అంత‌కంత‌కు ఎంత దారుణంగా మారుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు. మిగ‌తా సెల‌బ్రిటీలు బ‌య‌టి వారిని ఎవ‌రిని ఇంట్లోకి అనుమ‌తించ‌లేదు. వైర‌స్ త‌గ్గే వ‌ర‌కూ నో ఎంట్రీ బోర్డు పెట్టి త‌లుపులు మూసేసారు.

త‌మ ప‌నులు తామే చేసుకుంటున్నారు. ఇక షూటింగ్ లు బంద్ అవ్వ‌డంతో సినీ కార్మికులకు ఇబ్బందులు త‌ప్ప‌లేదు. 24 శాఖ‌లకు చెందిన కార్మికులు ప‌నులు లేక పూట‌గ‌డ‌వ‌ని ప‌రిస్థితి ఎదురైంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మెగాస్టార్ చిరంజీవి సిసిపి (క‌రోనా క్రైసిస్ ఛారిటీ) ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఆ ఛారిటీకి భారీగా విరాళాలు అందించారు. ఇంకా వెంక‌టేష్.. బాల‌కృష్ణ‌.. మ‌హేష్‌.. ఎన్టీఆర్.. ప్ర‌భాస్.. ఇత‌ర హీరోలంతా భారీగానే విరాళాలు ప్ర‌క‌టించారు. ఇంకా కొంద‌రు స్టార్ హీరోయిన్లు.. టాప్ డైరెక్ట‌ర్లు స‌హా ప‌లువురు దాత‌లు స్పందించి త‌మ‌కు తోచిన స‌హాయం చేసారు.

అయితే ఈ స‌హాయం ఎన్ని రోజుల పాటు కార్మికుల‌కు స‌రిపోతుందో తెలియ‌దు. దీనిపై ఇంకా చాలా మంది సినిమా వాళ్లు స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కోటికి పైగా పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు.. సాంకేతిక నిపుణులు స్పందిస్తే క‌రోనా ఖ‌జానా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి కోట్లాది రూపాయలు సంపాదించిన వారంతా స్పందించాల్సిన స‌మ‌యం ఇది. అంద‌రికి సాయం చేయ‌లేక‌పోయినా క‌నీసం సినీ కార్మికులకైనా చేయూతనిస్తే క‌ళామ‌త‌ల్లి రుణం తీర్చుకున్న‌ట్లు అవుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించిన వారు చాలా త‌క్కువ మంది కావ‌డం శోచ‌నీయం.

మ‌రింత మంది ముందుకొచ్చి కార్మికుల‌ను ఆదుకోవాల‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా సామాజిక ధృక్ప‌థంతో ముందుకొచ్చి ప్ర‌జ‌ల్లో సిస‌లైన మ‌న‌సున్న‌ స్టార్లుగా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ న‌టుడిగా క‌న్నా ఇలాంటి సేవా దృక్ఫ‌థంతోనే అభిమానుల గుండెల్లో దేవుడిగా కీర్తింప‌బ‌డుతున్నారు. తెలుగువాడైన కోలీవుడ్ హీరో విశాల్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించే తీరు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ల‌ను అయినా ఆద‌ర్శంగా తీసుకుని మ‌రింత మంది ముందుకు రావాలి. స‌హాయం అంటే కోట్లు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఉన్న‌దాంట్లో ఎంతో కొంత స‌హాయం ప్ర‌క‌టిస్తే అదే కోటి రూపాయాల‌తో స‌మానమ‌ని కార్మికులు ఆశాభావం వ్య‌క్తం చేసారు. మ‌రి కార్మికుల గోడును ఎంతమంది అర్థం చేసుకుంటారో చూద్దాం.