Begin typing your search above and press return to search.

కథలతో కుస్తీ పడుతున్న దర్శకులు

By:  Tupaki Desk   |   5 July 2017 5:30 PM GMT
కథలతో కుస్తీ పడుతున్న దర్శకులు
X
దేశంలో ఎక్కువ సినిమాలు నిర్మించే ఇండస్ట్రీలలో టాలీవుడ్ ది రెండవ స్థానం. ప్రతి ఏటా సుమారుగా 250 చిత్రాలు విడుదల చేస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మన తెలుగు హీరోల వైఖరిలో పూర్తి మార్పు వచ్చింది అనే చెప్పాలి. కొన్ని ఏళ్ళు కిందట మన టాప్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్న సాంకేతిక విజ్ఞానం పెరగడం.. హీరోలు స్పీడ్ పెంచడంతో.. ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా చేస్తున్నారు. దీనితో కొత్త కథలకు - కొత్తగా చెప్పే దర్శకులకు - అనుభవం ఉన్న దర్శకులకు అందరికి అనువైన కాలం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు.

విజయం ఉంటేనే అవకాశం అన్న పరిస్థితి ఇప్పుడు మారినట్లే ఉంది. కథ బాగుంటే ఫ్లాప్ డైరెక్టర్ కు కూడా అవకాశం దక్కుతోంది. అందుకే ఇప్పుడు మన డైరెక్టర్లు అందరూ కథలు సిద్దం చేసుకునే పనిలో బిజీ గా ఉన్నారు. విజయం అందుకున్న దర్శకులు రాజమౌళి - వి.వి.వినాయక్‌ కూడా వాళ్ళ తరవాత కథ కోసం తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారు. బాహుబలి లాంటి విజయం ఇచ్చిన తర్వాత ఏమి చేయాలో ఎవరితో చేయాలో ఇప్పటికీ ఒక నిర్ణయానికి రావటం లేదంటే.. ఇప్పుడు కథకు ఉన్న బలం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రాజమౌళి ఏమో మహేష్ తో చేస్తాడు అనే వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఎన్టీఆర్‌ తో ఉంటుంది అని అంటున్నా.. ఇంకా ఏమి ఖరారు కాలేదు.

అలానే మెగాస్టార్ తో సినిమా చేసిన వి.వి.వినాయక్‌ కూడా తన తర్వాత సినిమా ఖైదీ 150 కు మించి విజయం సాధించాలి అనే కసితో స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో మూవీ అని ఇప్పుడిప్పుడే వార్తలొస్తున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తో మంచి తొలి ఏడాది హిట్ ఇచ్చిన క్రిష్ కూడా వెంకటేష్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది.. కానీ కొన్ని కాపీ రైట్స్ విషయంగా అది ఒక కొలిక్కి రాలేదు. పోనీ మహేశ్ తో ఈలోపు ‘శివమ్’ అనే సినిమా చేద్దాం అంటే మహేశ్ బాబు ఇప్పటిలో ఖాళీగా దొరికేటట్లు లేడు. అందుకని హిందీలో కంగనా రనౌత్‌ తో ‘మణికర్ణిక’ మొదలుపెట్టాడు. ‘రుద్రమదేవి’తో మరోసారి తన దర్శకత్వ ప్రతిభని చాటి చెప్పిన దర్శకుడు గుణశేఖర్‌ కూడా తన తదుపరి ప్రాజెక్టు ఏమి అన్నది ఇంతవరకు ప్రకటించలేకపోయాడు.

'మనమంతా’తో ఆకట్టుకున్న చంద్రశేఖర్‌ యేలేటి, ‘కళ్యాణ వైభోగమే’ తో హిట్ కొట్టిన నందినిరెడ్డి, ‘నేను లోకల్‌’ తో మంచి జోష్ లో ఉన్న త్రినాథరావు నక్కిన , ‘ఘాజీ’లతో విజయాల్ని సొంతం చేసుకొన్న సంకల్ప్‌రెడ్డి కూడా ఇంత వరకు కొత్త చిత్రాలు వివరాలు ఖరారు కాలేదు. ఇంకా గత సినిమాలు విజయం పొందలేకపోయిన డైరెక్టర్లు బాబీ, శేఖర్‌ కమ్ముల, బి.వి.ఎస్‌.రవి ఇప్పుడు కొత్త కథలతో కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు త్వరలో మన ముందుకురాబోతున్నారు.

వరస ఫ్లాపులు తీసిన దర్శకులు సైతం స్క్రిప్ట్ పనుల్లో బాగా బిజీగా ఉన్నారు. శ్రీనువైట్ల ఒక యంగ్ హీరోతో లేదా రవితేజతో సినిమా తీయొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్‌ అడ్డాల, గోపీచంద్‌ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్‌, కిషోర్‌ పార్థసాని, వాసు వర్మ, సంతోష్‌ శ్రీనివాస్‌, వై.వి.యస్‌.చౌదరి, దశరథ్‌, వీరుపోట్ల లాంటి మంచి దర్శకులు సైతం ఇప్పుడు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు అంతా హీరోలు చుట్టూ తిరగం మానేసి కథలతో కుస్తీ పడుతున్నారు. మంచి కథ ఉంటే హిట్ రావడం తధ్యం అని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు. కథే బలం కథే మూలం అని మన తెలుగు దర్శకులు పూర్తిగా ఆ పనిలో పడ్డారు అంతా.​