Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రానా ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..!

By:  Tupaki Desk   |   8 Sep 2021 4:35 PM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: రానా ను 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..!
X
టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో బుధవారం హీరో రానా దగ్గుబాటి ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. సుమారు 7 గంటల పాటు రానా ను ఈడీ అధికారులు ప్రశ్నించారని తెలుస్తోంది. మనీలాండరింగ్ - ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘన చట్టం కింద రానా కు నోటీసులు జారీ చేసిన ఈడీ.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ తో లావాదేవీలపై ఆరాలు తీసినట్లు సమాచారం.

ఈడీ విచారణకు రానా తన బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. ఆడిటర్ - అడ్వకేట్స్ తో కలిసి రానా ఈడీ ఎంక్వైరీ ఎదుర్కొన్నారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగే ప్రయత్నం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. అలానే ఎఫ్ క్లబ్ పార్టీల్లో హీరో నవదీప్ - హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లతో కలిసి హాజరైన విషయాలను కూడా ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

నిజానికి 2017లో ఎక్సైజ్ శాఖ సిట్ జరిపిన విచారణలో రానా - రకుల్ ల పేర్లు తెరపైకి రాలేదు. అయితే ఇప్పుడు డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో వారిద్దరికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ఈడీ విచారణ ఎదుర్కోగా.. బుధవారం రానా హాజరయ్యారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ - నటి చార్మీ కౌర్ - యువ హీరో నందు లను కూడా ఈడీ ప్రశ్నించింది.

ఇకపోతే డ్రగ్స్ కేసులో నిందితులైన కెల్విన్ - ఖుధూస్ - వహీద్ ఇళ్లలో మంగళవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురు నిందితుల వద్ద లాప్ టాప్స్ - సెల్ ఫోన్స్ - ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్ లని స్వాధీనపరుచుకున్న అధికారులు.. సెప్టెంబర్ 7న సుదీర్ఘంగా విచారించారు. అలానే బుధవారం కెల్విన్ - వాహిద్ లను మరో నాలుగు గంటల పాటు ప్రశ్నించారు.

వీరి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించిన ఈడీ అధికారులకు.. విదేశాలకు భారీగా నగదు ట్రాన్సఫర్ అయినట్లు ఆధారాలు లభించాయి. అలానే సినీ ప్రముఖుల బ్యాంక్ ఖాతాల నుండి కెల్విన్ - ఖుధూస్ - వహీద్ - జీశాన్‌ లకు మధ్య లావాదేవీలు జరిగినట్టు ఈడీ గుర్తించిందని వార్తలు వస్తున్నాయి. వీరి ల్యాప్ ట్యాప్స్ నుంచి కీలకమైన సమాచారం ఈడీ అధికారులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి.