Begin typing your search above and press return to search.

పురాణ పురుషుల్ని తెర‌పై ఆవిష్క‌రించాలంటే మ‌న‌వాళ్లే క‌రెక్టా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 2:30 AM GMT
పురాణ పురుషుల్ని తెర‌పై ఆవిష్క‌రించాలంటే మ‌న‌వాళ్లే క‌రెక్టా?
X
భార‌తీయ ఇతిహాసాల్ని, పురాణ పురుషుల్ని తెర‌పై ఆవిష్క‌రించాలంటే మ‌న‌వాళ్లే క‌రెక్టా?.. ఉత్త‌రాది ద‌ర్శ‌కులు ఆ సోల్‌ని ప‌ట్టుకోలేక‌పోతున్నారా.. అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. రీసెంట్ గా బాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో రూపొంది పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌లైన `బ్ర‌హ్మాస్త్ర‌`, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ని ఆది పురుషుడు శ్రీ‌రాముడిగా చూపిస్తూ తొలి సారి తెర‌కెక్కిస్తున్న మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆది పురుష్‌` టీజ‌ర్ కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి.

అగ్ని అస్త్ర, నంద అస్త్ర‌, వాన‌రాస్త్ర‌, న‌గ ధ‌నుష్‌, గ‌జాస్త్ర అంటూ స‌క‌ల అస్త్రాల‌ని చూపిస్తూ బ్ర‌హ్మాస్త్ర ప్రాముఖ్య‌త‌.. ప‌వ‌ర్‌.. దాన్ని పొంద‌డానికి అసురులు చేసే ప్ర‌య‌త్నాల‌ని ప్ర‌ధాన ఇతివృత్తంగా తీసుకుని చేసిన `బ్ర‌హ్మ‌స్త్ర‌` గ్రాఫిక్స్ పై నెట్టింట ట్రోల్ న‌డిచిన విష‌యం తెలిసిందే. గ్రాఫిక్స్ వుండాలి కానీ అవి చూసే ప్రేక్ష‌కుడికి గ్రాఫిక్స్ అని తెలియ‌కుండా వుండాలి. కానీ బ్ర‌హ్మాస్త్ర లో క‌నిపించే ప్ర‌తీ సీన్ గ్రాఫిక్స్ అని ఇట్టే తెలిసిపోతూ వుంటుంది.

అంత నాసిర‌కంగా ఆ మూవీకి గ్రాఫిక్స్ చేశారు. ఇదే విష‌యంపై నెటిజ‌న్ లు ఈ చిత్ర బృందంపై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఇక ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తూ ప్ర‌భాస్ హీరోగా రూపొందిస్తున్న మూవీ `ఆది పురుష్‌`. రామాయ‌ణ గాధ ఆధారంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఈ మూవీ గ్రాఫిక్స్ పై చిత్ర ద‌ర్శ‌కుడు దృష్టి పెట్ట‌లేద‌ని టీజ‌ర్ తో స్ప‌ష్ట‌మైంది.

జ‌ప‌నీస్ యానిమేటెడ్ ఫిల్మ్ `రామాయ‌ణ : ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ` స్ఫూర్తితో ఓం రౌత్ `ఆది పురుష్‌`ని తెర‌పైకి తీసుకొస్తున్నాన‌ని చెప్పాడు. ఇక్క‌డే అత‌ను ప‌ప్పులో కాలేశాడ‌ని మ‌న వాళ్లు ఈ మూవీ టీజ‌ర్ గ్రాఫిక్స్ చూసి విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో బాలీవుడ్ వాళ్లు పురాణ పురుషుల్ని తెర‌పై ఆవిష్క‌రించ లేర‌నే కామెంట్ లు మొద‌ల‌య్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం రీసెంట్ గా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న `హ‌ను మాన్` టీజ‌ర్.

ఇందులో సూప‌ర్ హీరోగా హ‌ను మాన్ క్యారెక్ట‌ర్ ని మ‌లిచిన తీరు. అంజ‌నాద్రి అనే స‌రికొత్త యూనివ‌ర్స్ ని సృష్టించిన అందులో హ‌నుమంతు అనే క్యారెక్ట‌ర్ నేప‌థ్యంలో ఈ సినిమాని న‌డిపించ‌బోతున్నాడు. హ‌ను మంతు పాత్ర‌లో తేజ సజ్జ న‌టిస్తున్నాడు. టీజ‌ర్ లో చూపించిన హ‌ను మాన్ స్టాచ్యూ.. అబ్బుర ప‌రిచే విజువ‌ల్స్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో వున్నాయ‌ని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తూ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.