Begin typing your search above and press return to search.

హరితహారం.. ఒక్క మొక్క నాటని హీరోలు

By:  Tupaki Desk   |   26 July 2018 8:08 AM GMT
హరితహారం.. ఒక్క మొక్క నాటని హీరోలు
X
ఏదైనా ఓ మంచి పనిచేస్తే ప్రోత్సహించాలి..అందులో భాగస్వామ్యం కావాలి.. మన ప్రాంతం కాదు.. మన నాయకులు కాదు అని కూర్చుంటే కుదరదు.. ప్రాణవాయువునిచ్చే మొక్కను బతికించేందుకు నడుం బిగించాలి.. కనీసం ఒక్క మొక్కైనా నాటాలి. ఇక్కడే టాలీవుడ్ సైడ్ అయిపోయింది.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు పెట్టారు. వాటిల్లో కొన్ని వర్గాలకు కొన్ని కొన్ని పథకాలు మేలు చేశాయి. కానీ హరితహారం పథకం మాత్రం అందరిదీ.. తెలంగాణలో గాలిని పీల్చే ప్రతి ఒక్కరు ఈ పథకంలో పాలుపంచుకోవాలి. ఎందుకంటే ఆక్సిజన్ ను అందించే మొక్కలకు మనం రుణపడి ఉంటాం.. మనం తినే తిండి నుంచి జీవించే ఇల్లు , సౌకర్యాలు మొక్కల నుంచి వస్తాయి. మనిషికి ఎంతో మేలు చేసే ఆ మొక్కను బతికించడానికి.. మొక్కలను పెంచడానికి ముందుకు రావాలి..

హరితహారం గడిచిన నాలుగేళ్లుగా కొనసాగుతోంది. కానీ ఇప్పటివరకూ టాలీవుడ్ అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలు దీనిపై దృష్టిపెట్టింది లేదు. కేసీఆర్ - కేటీఆర్ ఎంత ప్రచారం చేసినా అది జనాల్లోకి ఎక్కడం లేదు. కానీ ఒక్క స్టార్ హీరో ముందుకొస్తే ఆయన అభిమానులు, ప్రజలు బాగా స్పందిస్తారు.. మొక్కలు నాటుతారు.. హరితహారం విషయంలో టాలీవుడ్ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంతో మంచి పథకానికి తమ వంతు సాయం చేయడంలో టాలీవుడ్ ఘోరంగా విఫలమైంది..

పోయిన సారి అల్లు అర్జున్ హరితహారంలో పాల్గొన్నారు. తన ఇంటి ఆవరణలో మొక్క నాటి తన అభిమానులందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈసారి సీఎం కేసీఆర్ కూతురు ఎంపీ కవిత మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్ అంటూ దర్శకుడు రాజమౌళికి సవాల్ విసిరారు. ఆయన మూడు మొక్కలు నాటి ప్రతి సవాల్ గా కొందరిని నామినేట్ చేశాడు. ఎవరైనా ప్రోత్సహిస్తే కానీ ఈ మంచి పథకంలో సెలెబ్రెటీలు పాల్గొనని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.. తమకు తాముగా టాలీవుడ్ అయితే కదిలిరావడం లేదు.

తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద పథకంలో టాలీవుడ్ ప్రముఖులను భాగస్వామ్యం చేయకపోవడం నివ్వెరపరుస్తోంది. హీరోలు కూడా హైదరాబాద్ అంతా సాగుతున్న ఈ హరితహారంలో కనీసం పాల్గొనడం లేదు. మొక్కలను నాటేందుకు ముందుకు రావడం లేదు. వానలు పడాలన్నా.. మనకు మంచి ఆక్సిజన్ - వాతావరణం అందాలన్న మొక్కలు కీలకం.. ఇలాంటి మంచి పథకంలో టాలీవుడ్ ప్రమేయం లేకపోవడం ఇప్పుడు అందరినీ బాధిస్తోంది.