Begin typing your search above and press return to search.

సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా మన హీరోలు రెడీ..!

By:  Tupaki Desk   |   16 Nov 2022 2:30 AM GMT
సినిమా కోసం ఎలాంటి రిస్క్ చేయడానికైనా మన హీరోలు రెడీ..!
X
సినిమాల కోసం హీరోలు ఎంతగా కష్టపడతారో తెలిసిందే. ప్రేక్షకులను అభిమానులను మెప్పించడానికి ఏమైనా చేయటానికి రెడీ అవుతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు లైఫ్ రిస్క్ చేసే హీరోలు కూడా మన ఇండస్ట్రీలో వున్నారు.

ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మంచి నటన కనబరిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు స్క్రీన్ పెజెన్స్ తో పాటుగా పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేయాల్సి వస్తోంది.

సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు హార్ట్ వర్కౌట్స్ చేసి శరీరాకృతిని మార్చేస్తున్నారు. ఆరు పలకల కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేయటానికి నిరంతరం జిమ్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అప్పట్లో హీరోలంతా డూప్ ని పెట్టుకొని యాక్షన్ స్టంట్స్ లాగించేస్తే.. ఇప్పుడు మాత్రం ఎవరో కొందరు తప్ప చాలా మంది టాలీవుడ్ హీరోలు తగిన జాగ్రతలు తీసుకొని రియల్ స్టంట్స్ చేయటానికి సిద్ధపడుతున్నారు.

ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల యంగ్ హీరో నాగశౌర్య షూటింగ్ స్పాట్ లో కళ్ళు తిరిగి పడిపోయి, ఆసుపత్రి పాలవ్వడం అందరినీ ఆందోళనకు గురి చేసింది.

శౌర్య తన కొత్త సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో సిక్స్ ప్యాక్ బాడీని చూపించాల్సి ఉండగా.. దీని కోసం డైట్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా గత మూడు నాలుగు రోజులుగా కనీసం నీళ్లు కూడా తీసుకోకపోవడం వల్లనే డీహైడ్రేట్ అయిపోయి సెట్స్ లో పడిపోయాడని అంటున్నారు.

గతంలో 'లక్ష్య' సినిమాలో ఆర్చరీ ఆటగాడిగా కనిపించడానికి బాగా కష్టపడ్డాడు. కొన్ని సీక్వెన్స్ కోసం సిక్స్ ప్యాక్ బాడీని సిద్దం చేసాడు. దీని కోసం పర్ఫెక్ట్ డైట్ ని ఫాలో అవ్వడమే కాదు.. కొన్ని రోజుల పాటు నీళ్లు తాగకుండా ఉన్నాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ''లైగర్'' సినిమా కోసం ఎంతలా కష్టపడ్డాడో చూశాం. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బాక్సర్ గా కనిపించడానికి రెండున్నరేళ్ల పాటు తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో షోల్డర్ కు గాయమై సుమారు ఎనిమిది నెలల పాటు జిమ్ కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న వీడీ.. ఇటీవల మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేశాడు.

యూత్ కింగ్ అఖిల్ అక్కినేని "ఏజెంట్" సినిమాలో గూఢచారి పాత్ర కోసం అదిరిపోయే ట్రాన్సఫర్మేషన్ చూపించాడు. సిక్స్ బ్యాక్ బాడీతో బీస్ట్ లుక్ లోకి మారిపోయాడు. దీని వెనుక అఖిల్ శ్రమ ఎంతో ఉంది. కొన్ని నెలలపాటు పెర్ఫెక్ట్ డైట్ చేయడమే కాదు.. కఠినమైన కసరత్తులు చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ప్రారంభం నుంచీ రిస్కీ స్టంట్స్ చేస్తూనే వస్తున్నారు. 'టక్కరి దొంగ' - '1 నేనొక్కడినే' వంటి పలు చిత్రాల్లో ఆయన చేసిన రియల్ యాక్షన్ గురించి ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలపాలయ్యారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం 'బిల్లా' - బాహుబలి - సాహో వంటి చిత్రాల్లో డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. ఇందులో ప్రమాదానికి గురై చాన్నాళ్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. గతంలో జరిగిన మోకాలి గాయం తిరగదోడటంతో ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.

స్వతహాగా భోజన ప్రియుడైన ప్రభాస్..'రాధే శ్యామ్' సినిమాలో లీన్ లుక్ కోసం 4-5 నెలల పాటు జ్యూస్ డైట్ ఫాలో అయ్యారు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా మూడు పూట్లా కేవలం జ్యూస్ తాగి ఉండేవాడని దర్శకడు రాధాకృష్ణ కుమార్ ఓ ఇంటర్వూలో తెలిపాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం ఎంత కష్టపడతారో మనం చూశాం. పవన్ కల్యాణ్ ఇప్పుడంటే డూప్ ని పెట్టుకొని నటిస్తున్నాడు కానీ.. ఒకప్పుడు ఆయన ఎన్నో రిస్కీ స్టంట్స్ చేసి ఆశ్చర్య పరిచాడు.

కింగ్ అక్కినేని నాగార్జున ఆరు పదులు దాటిన వయసులో కూడా యంగ్ గా కనిపించడానికి చాలా కష్టపడతారు. ఇటీవల "ది ఘోస్ట్" సినిమాలోని యాక్షన్ సీన్ల కోసం శిక్షణ తీసుకున్నారు. స్టార్ హీరోలే కాదు.. సందీప్ కిషన్ లాంటి మరికొందరు కుర్ర హీరోలు కూడా సినిమాలో తమ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు.

బాడీ ఫిట్ గా ఉండి సిక్స్ ప్యాక్స్ ను చూపించడం వరకు బాగానే ఉంది కానీ.. ఈ క్రమంలో హద్దులు దాటి మరీ కష్టపడుతుండడం ఆందోళన కలిగించే విషయం. సినిమా పట్ల డెడికేషన్ ఉండొచ్చు కానీ.. పరిమితికి మించి కష్టపడటం కూడా ప్రమాదానికి దారి తీస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.