Begin typing your search above and press return to search.

మన హీరోలకు ‘ఖాకీ’ మైకం పట్టింది

By:  Tupaki Desk   |   26 July 2016 4:30 AM GMT
మన హీరోలకు ‘ఖాకీ’ మైకం పట్టింది
X
పోలీస్ స్టోరీలు ఎప్పటికీ ఔట్ డేటెడ్ అయిపోవు. మాస్ హీరోయిజాన్ని పండించడానికి పోలీస్ క్యారెక్టర్ కు మించిన పాత్ర ఇంకోటి ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త తరహా పోలీస్ తెరమీదికి వచ్చేస్తుంటాడు. సరికొత్త క్యారెక్టరైజేషన్‌ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు రచయితలు.. దర్శకులు. పోలీస్ పాత్రల విషయంలో దశాబ్దానికి ఒకసారైనా ట్రెండు మారిపోతుంటుంది. కానీ పోలీస్ కథలు మాత్రం ఆగిపోవు. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్-మీడియం రేంజి హీరోలు చాలామంది పోలీస్ కథలతో ట్రావెల్ చేస్తుండటం విశేషం. ఆల్రెడీ ఈ సమ్మర్ లో పవన్ పోలీస్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ‘బాబు బంగారం’ రాబోతోంది. ఇందులో వెంకీ పోలీసే అన్న సంగతి టీజర్ చూశాకే అర్థమైంది.

మరోవైపు రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమాలో పోలీస్ గానే కనిపిస్తున్నాడు. ‘తుఫాన్’ సినిమాలో పోలీస్ గా కనిపించి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న చరణ్.. ఈసారి ఆ జ్నాపకాల్ని చెరిపేయాలని చూస్తున్నాడు. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘తనీ ఒరువన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటిదాకా పోలీస్ పాత్రల్లో కనిపించని హీరోలు సైతం ఖాకీ డ్రెస్ వేసేస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో రామ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అది పూర్తి స్థాయి పాత్రా లేక.. కాసేపు ఖాకీలో కనిపిస్తాడా అన్నది తెలియదు కానీ.. అతనైతే ఇందులో పోలీసుగా కనిపిస్తడట. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ సైతం కెరీర్లో తొలిసారి పోలీస్ అవతారం ఎత్తుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో అతను చేస్తున్న ‘మిస్టర్’ పోలీస్ స్టోరీనే అని సమాచారం. మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా తొలిసారి ఖాకీ తొడుక్కుంటున్నాడు. చంద్రమోహన్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాలో శర్వా పోలీసుగా కనిపిస్తాడని ఇప్పటికే వెల్లడైంది. సందీప్ కిషన్ సైతం తెలుగులోకి అనువాదం కాబోతున్న తమిళ సినిమా ‘మాయవన్’లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మరి వీళ్లందరిలో ఖాకీ ఎంతమందికి విజయాన్నందిస్తుందో చూడాలి.