Begin typing your search above and press return to search.

తిత్లీ: మెల్లగా కదులుతున్న టాలీవుడ్!

By:  Tupaki Desk   |   15 Oct 2018 2:37 PM GMT
తిత్లీ: మెల్లగా కదులుతున్న టాలీవుడ్!
X
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం.. విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు తిత్లీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టం జరిగింది. టాలీవుడ్ నుండి మొదటగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్పందించి తన వైపు నుండి రూ.50000 విరాళం ప్రకటించడంతో మెల్లగా ఇతర టాలీవుడ్ సెలబ్రిటీల్లో కదలిక ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే మరో యంగ్ హీరో నిఖిల్ తన టీమ్ తో పాటు ఆదివారం శ్రీకాకుళం చేరుకొని అక్కడ బాధితులకు అవసరమైన ఆహారం.. ఇతర నిత్యావసరాలు అందజేస్తున్నారట.

ఇక విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు- ఎన్టీఆర్ రూ. 15 లక్షలు - కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షల చొప్పున తిత్లీ బాధితులకు సహాయం కోసం ఏపీ సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ప్రకటించారు. మెగా హీరో వరుణ్ తేజ్ తన వైపునుండి రూ. 5 లక్షల విరాళం ప్రకటించాడు. మెల్లగా ఒక్కొక్క టాలీవుడ్ హీరో స్పందిస్తుండడంతో తిత్లీ సైక్లోన్ బాధితులకు సహాయం చేసేందుకు ఇతర టాలీవుడ్ సెలబ్రిటీ లు కూడా విరివిగా విరాళాలు ప్రకటించాలని కొంతమని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఇతర టాలీవుడ్ స్టార్ హీరో లు చాలామంది ఇంతవరకూ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళ కు ఇబ్బంది కలిగినప్పుడు టాలీవుడ్ లో అందరూ వెంటనే ముందుకొచ్చారని.. అదే సాటి తెలుగు వారికి కష్టం కలిగితే సాయం అందించేందుకు ముందుకు రాకపోవడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు నామమాత్రపు విరాళాలతో సరిపెడుతున్నారని.. సంపూర్ణేష్ బాబుని చూసి వారు సిగ్గుపడాలని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.