Begin typing your search above and press return to search.

2022 డిజాస్ట‌ర్స్..కాంబినేష‌న్స్ కాద‌మ్మా..కంటెంట్ ముఖ్యం!

By:  Tupaki Desk   |   31 Dec 2022 1:30 AM GMT
2022 డిజాస్ట‌ర్స్..కాంబినేష‌న్స్ కాద‌మ్మా..కంటెంట్ ముఖ్యం!
X
టాలీవుడ్ లో గ‌త కొన్నేళ్లుగా క‌థ‌ని ప‌క్క‌న పెట్టి కాంబినేషన్ ల‌కే ప్రాధాన్య‌త నిస్తూ సినిమాలు చేస్తూ వ‌చ్చారు. అదే కొన్నేళ్ల పాటు ట్రెండ్ గా మారింది కూడా. అయితే కాలం మారింది. ఆడియ‌న్స్ పోస్ట‌ర్ ని చూసి క‌థ చెప్పేసే రోజులివి. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తోనే సినిమా ఆడుతుందా? ఆడ‌దా? అంచ‌నా వేస్తున్నాడు. ఏ సినిమాకు కాపీనో కూడా ఇట్టే చెప్పేస్తున్న రోజులివి. ఎంత మంది స్టార్స్ తో తీశావ‌న్న‌ది కాకుండా ఎంత మంది కంటెంట్ తో సినిమా చేశార‌న్న‌దే ఇప్ప‌డు ప్రేక్ష‌కుడు ఆలోచిస్తున్నాడు.

కంటెంట్ న‌చ్చితే స్టార్స్ లేక‌పోయినా స‌రే బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో `రాధేశ్యామ్‌`తో డిజాస్ట‌ర్ ల ప‌రంప‌ర మొద‌లైంది. కేవ‌లం క‌థ లేకుండా నేల విడిచి భారీ హంగులు, అబ్బుర ప‌రిచే స‌న్నివేశాల‌తో సినిమా చేస్తే చూస్తార‌నే భ్ర‌మ‌ల్ని ఈ సినిమాతో ప్రేక్ష‌కులు తొల‌గించారు. ఎంత పెద్ద స్టార్స్ వున్నా స‌రే కంటెంట్ లేక‌పోతే నిర్మొహ‌మాటంగా రిజెక్ట్ చేస్తామ‌ని నిరూపించారు. ఈ సినిమా టాలీవుడ్ కి బిగ్ లెస్స‌న్ అని చెప్పొచ్చు. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తే ఆ స్థాయిలో కూడా రిట‌ర్న్స్ రాక‌పోడ‌వం గ‌మ‌నార్హం.

ఇక ఏప్రిల్ లో విడుద‌లైన `గ‌ని` కూడా ఇదే ఫ‌లితాన్ని చ‌వి చూసింది. వ‌రుణ్ తేజ్ బాక్సర్ గా న‌టిస్తూ కొత్త ద‌ర్శ‌కుడితో చేసిన ఈ మూవీ ఏ విష‌యంలోనూ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. సినిమా విడుద‌లైన రెండ‌వ రోజే హీరో వరుణ్ తేజ్ ప్రేక్ష‌కుల‌కు సారీ చెబుతూ ఓపెన్ లెట‌ర్ ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశాడంటే ఈ మూవీ ప‌రిస్థితి ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక చిరంజీవి ఏరి కోరి చేసిన సినిమా `ఆచార్య‌`. కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏ స్థాయిలో డిస్ట్రిబ్యూట‌ర్ల మ‌ద్య ర‌చ్చ‌కు తెర‌లేపిందో, ద‌ర్శ‌కుడికి ఇబ్బందుల్ని క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

రియ‌లిస్టిక్ అంశాల నేప‌థ్యంలో రానా, సాయి ప‌ల్ల‌విల‌తో వేణు ఊడుగుల రూపొందించిన మూవీ `విరాట ప‌ర్వం`. ఓ యువ‌తి ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకు సినిమాటిక్ లిబ‌ర్టీస్ తో క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లో తెర‌కెక్కించి వేంటే ఫ‌లితం మ‌రోలా వుండేది. కానీ రియ‌లిస్టిక్ అప్రోచ్ తో సినిమా చేయ‌డంతో ఎక్క‌డా ఫీల్ ని క‌లిగించ‌లేక‌పోగా థియేట‌ర్ల‌కు జ‌నాన్ని ర‌ప్పించ‌లేక‌పోయింది. సాయి ప‌ల్ల‌వి లాంటి క్రౌడ్ పుల్ల‌ర్ వున్నా కూడా ఏ విధంగానూ ఉప‌యోగం లేకుండా పోయింది. కాంప్లిమెంట్స్ త‌ప్ప కాసుల వ‌ర్షం కురిపించ‌లేక ఇలాంటి క‌థ‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం నేర్పింది.

మారుతి చేసిన `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` కూడా సిల్లీ కామెడీతో జ‌నాల‌ని ఎంట‌ర్ టైన్ చేయ‌లేమ‌ని నిరూపించింది. ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ`, రామ్ `ది వారియ‌ర్‌`, నాగార్జున ది ఘోస్ట్‌, నితిన్ మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం లాంటి సినిమాలు కంటెంట్ లేకుండా యాక్ష‌న్ సీన్ ల‌తో నింపేస్తే చూడ‌టానికి ఇక్క‌డ ఎవ‌రూ ఖాలీగా లేర‌ని ప్రేక్ష‌కులు బ‌ల్ల‌గుద్ది చెప్పారు. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌` మ‌రో గుణ‌పాఠాన్ని నేర్పింది. హ‌ద్దులు దాటి కంటెంట్ లేకుండా కామెంట్ లు చేస్తూ నెట్టింట దారుణ ట్రోలింగ్ కి గురి కాక‌త‌ప్ప‌ద‌ని నిరూపించింది.

మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే ఈ ఏడాది అత్య‌ధిక స్థాయిలో ట్రోలింగ్ కి గురైన సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఓటీటీ ని దృష్టిలోపెట్టుకుని ఏది ప‌డితే అది చూస్తారు లే అని చేసిర‌న శాకిని డాకిని, దొంగ‌లున్నారు జాగ్ర‌త్త సినిమాలు కూడా టాలీవుడ్ మేక‌ర్స్ గ‌ట్టి గుణ పాఠాన్ని నేర్ప‌డం విశేషం. ఈ పాఠాల‌తో ఇక‌నైనా టాలీవుడ్ మేక‌ర్స్ కాంబినేష‌న్ ల‌ని కాకుండా కంటెంట్ ని న‌మ్ముకుని సినిమాలు చేస్తే బాగుంటుంద‌ని స‌గ‌టు ప్రేక్ష‌కులు కోరుకుంటున్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.