Begin typing your search above and press return to search.

పండగ చేస్కో తెలుగు ప్రేక్షకుడా!

By:  Tupaki Desk   |   22 Dec 2015 10:30 PM GMT
పండగ చేస్కో తెలుగు ప్రేక్షకుడా!
X
ఒకేవారం నాలుగైదు సినిమాలు విడుదల కావడం కొత్త విషయమేమీ కాదు. ఐతే ఇలా విడుదలైనపుడు అందులో ఒకటో రెండో మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాలుంటాయి. మిగతావి జనాల కంటికి ఆనవు. కానీ ఒకేసారి నాలుగు చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజవడం.. ఆ నాలుగూ ఆసక్తి రేపుతుండటం.. జనాల దృష్టిని ఆకర్షిస్తుండటం అరుదుగా జరిగే విషయం. ఈ వీకెండ్ తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి అనుభవమే ఎదురవబోతోంది. ఈ వారం క్రిస్మస్ సందర్భంగా రెండు రోజుల వ్యవధిలో రిలీజయ్యే నాలుగు సినిమాల మీదా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

ముందుగా క్రిస్మస్ కు ముందు రోజు విడుదలయ్యే ‘సౌఖ్యం’ నాలుగు సినిమాల్లోనూ అత్యంత ఆసక్తి రేపుతున్న సినిమా. ‘యజ్నం’ తర్వాత గోపీచంద్, ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా కావడం.. గత ఏడాది సూపర్ హిట్టయిన ‘లౌక్యం’ ఫ్లేవర్ ఇందులోనూ కనిపిస్తుండటంతో సినిమాకు మంచి హైపే ఉంది. ఇక సుధీర్ బాబు నటించిన ‘భలే మంచి రోజు’ మరుసటి రోజు ప్రేక్షకుల ముందుకొస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ డిఫరెంటుగా ఉండటంతో ఈ మూవీలో హిట్టు కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇక క్రిస్మస్ రోజే రిలీజయ్యే మల్టీస్టారర్ మూవీ ‘మామ మంచు అల్లుడు కంచు’ మీద కూడా జనాల్లో బాగానే ఆసక్తి ఉంది. మోహన్ బాబు, అల్లరి నరేష్‌ ల కాంబినేషనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. పైగా ఓ మరాఠీ సినిమాకు రీమేక్ అంటున్నారు కాబట్టి కథాకథనాల్లో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. క్రిస్మస్ రోజే విడుదలయ్యే ‘జత కలిసే’ అవ్వడానికి చిన్న సినిమానే కానీ.. దాని మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అంత చిన్న సినిమా ఇంత పోటీ మధ్య వస్తోందంటేనే దాని మీద దర్శక నిర్మాతలు ఎంత కాన్ఫిడెంటుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘రాజుగారి గది’ని రిలీజ్ చేసిన సాయి కొర్రపాటే ఈ మూవీని కూడా విడుదల చేస్తుండటం మీద సినిమా మీద ఆసక్తిని పెంచేదే. మొత్తానికి ఈ క్రిస్మస్ పండక్కి తెలుగు ప్రేక్షకుడికి కనువిందు చేయడానికి నాలుగు ఆసక్తికరమైన సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటిలో ఏది ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.