Begin typing your search above and press return to search.

ఫోకస్‌: ఫస్ట్‌ హాఫ్‌ ఇలా సాగిందండీ!!

By:  Tupaki Desk   |   25 Jun 2015 11:30 AM GMT
ఫోకస్‌: ఫస్ట్‌ హాఫ్‌ ఇలా సాగిందండీ!!
X
సినిమాలు తీయడానికి డబ్బులెక్కడున్నాయ్‌? అంటూనే ఈ ఆర్నెళ్లలో టాలీవుడ్‌ సుమారు 600 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇది నమ్మబుల్‌గా లేకపోయినా నమ్మాల్సిన నిజం. ప్రథమార్థం 42 సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 16 అనువాద చిత్రాలున్నాయి. మిగిలినవన్నీ స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు. ఒకే ఒక్క సినిమా 50కోట్ల క్లబ్‌లో చేరింది. బన్ని హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్‌ సత్యమూర్తి ఈ రికార్డును సృష్టించింది. అలాగే విక్రమ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఐ' సంచలనాత్మక చిత్రంగా చర్చల్లో నిలిచింది. ఓ మారు ఏ నెలలో ఏ సినిమా రిలీజైంది? వాటి ఫలితం ఏంటి? అన్నది తరచి చూస్తే...

జనవరి:

నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. గోపాల గోపాల, ఐ, బీరువా, పటాస్‌. వీటిలో రెండు బ్లాక్‌బస్టర్‌ హిట్లు, మరో రెండు యావరేజ్‌లు. పవన్‌, వెంకీ కథానాయకులుగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గోపాల గోపాల ఊహించినదానికంటే చక్కని వసూళ్లు సాధించిందన్న టాక్‌ వచ్చింది. అలాగే భారీ అంచనాలతో వచ్చిన ఐ ఫలితం తలకిందులైంది. కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. హీరో కం నిర్మాత కళ్యాణ్‌రామ్‌కి ఊపిరి పోసిన సినిమా ఇది. అలాగే సందీప్‌ కిషన్‌ బీరువా యావరేజ్‌ చిత్రంగా నిలిచింది.

ఫిబ్రవరి:

టెంపర్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, బందిపోటు చిత్రాలు రిలీజయ్యాయి. వీటిలో టెంపర్‌ చక్కని విజయం సాధించింది. భారీగా లాభాలు రాకపోయినా ఫర్వాలేదనిపించింది. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో ఎన్నడూ లేనంతగా కొత్తలుక్‌తో అలరించాడు. పూరీకి ఇది ల్యాండ్‌మార్క్‌ సినిమా అయ్యింది. శర్వానంద్‌ -నిత్యామీనన్‌ జంటగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫీల్‌గుడ్‌ సినిమాగా పేరు తెచ్చుకుంది. అల్లరినరేష్‌ హీరోగా ఆర్యన్‌ రాజేష్‌ నిర్మించిన బందిపోటు అట్టర్‌ఫ్లాపైంది. ఆశలపై నీళ్లు చల్లింది.

మార్చి :

మండే ఎండల సీజన్‌ ఇది. అయినా సూర్య వర్సెస్‌ సూర్య అంటూ నిఖిల్‌ ఓ హిట్‌ కొట్టాడు. కొత్త కాన్సెప్టు ఉన్న సినిమా ఇదని పేరొచ్చింది. నాని ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ ఎవడే సుబ్రహ్మణ్యం తో హిట్‌ కొట్టి రేసులోకి వచ్చాడు. అదే టైమ్‌లో రిలీజైన జెండా పైకపిరాజు ఫర్వాలేదనిపించింది. వైవియస్‌ రేయ్‌ ఎట్టకేలకు రిలీజై యథావిధిగా పరాజయం పాలైంది. ఎగ్రెస్సివ్‌ హీరో గోపిచంద్‌ జిల్‌ చిత్రంతో పెద్ద హిట్‌ కొట్టాడు. ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడికి కొత్త లైఫ్‌ మొదలైంది.

ఏప్రిల్‌ :

బన్ని హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్‌ సత్యమూర్తి 50కోట్ల క్లబ్‌ సినిమాగా నిలిచింది. ఆరంభం సమీక్షకులు చెరిగేసినా, రివ్యూలతో పనిలేకుండా విజయం సాధించింది. రవిబాబు అవును 2 పరమ రొటీన్‌ సినిమాగా నిలిచింది. దాంతో పరాజయం తప్పలేదు. నాగచైతన్య దోచెయ్‌ బిలో యావరేజ్‌ చిత్రంగా నిలిచింది.

మే :

లయన్‌, పండగ చేస్కో, దాగుడు మూతల దండాకోర్‌, దొంగాట.. ఇన్ని సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో రామ్‌ పండగ చేస్కో రొటీన్‌ సినిమా అయినా పెద్ద విజయమే అందుకుంది. లయన్‌ అట్టర్‌ఫ్లాప్‌ సినిమాగా మిగిలిపోయింది. దాగుడు మూతల దండాకోర్‌ మంచి కంటెంట్‌ ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది. దొంగాట చెత్త సినిమా అన్న టాక్‌ వచ్చినా బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

జూన్‌ :

సింగం 123, అసుర, కేరింత, జ్యోతిలక్ష్మి, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, టిప్పు, వినవయ్యా రామయ్యా.. వరుస పెట్టి రిలీజైన సినిమాలివి. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ చిత్రాలు రాకముందే వచ్చేయాలన్న తొందరలో ఇవన్నీ రిలీజైపోయాయి. అయితే వీటిలో సింగం పరమ రొటీన్‌ స్ఫూఫ్‌తో తీసిన చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది. నారా రోహిత్‌ అసుర ఓ చక్కని కమర్షియల్‌ హిట్‌ సాధించింది. మంచి విషయం ఉన్న సినిమాగా పేరు తెచ్చుకుంది. జ్యోతిలక్ష్మికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. యథావిధిగానే బాక్సాఫీస్‌ వద్ద పరాజయం తప్పలేదు. ఇక మిగిలిన సినిమాల గురించి పెద్దగా ప్రస్థావనే లేదు. ఈ నెల చివరి వారంలో టైగర్‌, వేరీజ్‌ విద్యాబాలన్‌ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. సందీప్‌ కిషన్‌కి నిరూపించుకోవాల్సిన సందర్భమిది. ఏం చేస్తాడో వేచి చడాల్సిందే.

ద్వితీయార్థం మొదలవుతోంది. భారీ సినిమాల సందడి వరుసగా. బాహుబలి, రుద్రమదేవి, కిక్‌ 2 .. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు పండుగే పండుగ.