Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నయా ట్రెండ్: టికెట్ రేట్లతో పోస్టర్లు.. ఓటీటీలో రాదంటూ ప్రకటనలు..!

By:  Tupaki Desk   |   3 Jun 2022 4:40 AM GMT
టాలీవుడ్ నయా ట్రెండ్: టికెట్ రేట్లతో పోస్టర్లు.. ఓటీటీలో రాదంటూ ప్రకటనలు..!
X
కరోనా పాండమిక్ కారణంగా ఓటీటీలు క్షేత్ర స్థాయిలో అందరికీ అలవాటైపోయాయి. దీంతో ఇప్పుడు ఎంత మంచి సినిమా వచ్చినా.. ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అనే ధోరణిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం మేకర్స్ అంతా తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లు రాబట్టేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

ఒకప్పుడు సినిమాలు వంద రోజులు.. రెండొందల రోజులు థియేటర్లలో నడిచేవి. కానీ ప్రస్తుత కాలంలో ఏ సినిమా అయినా రెండు మూడు వారాల రన్ కే పరిమితం అవుతోంది. దీంతో మొదటి వారాంతంలో ఎంత సంపాదించాలో అంత సంపాదించాలని మేకర్స్ భావిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నారు.

పాండమిక్ తర్వాత సినీ ఇండస్ట్రీ కుదేలైదంటూ.. దీన్నుంచి బయటపడటానికి టికెట్ రేట్లు పెంచడమే శరణ్యమని సినీ ప్రముఖులు రెండు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. ప్రస్తుతమున్న రేట్లతో సినిమాలు ప్రదర్శిస్తే కరెంట్ బిల్లులు కూడా రావని.. ఇలానే కొనసాగితే థియేటర్లు కల్యాణ మండపాలుగా మారడం ఖాయమని కామెంట్లు కొట్టారు.

ఎలాగైతేనేం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టిక్కెట్ ధరలు పెంచుకునేలా కొత్త జీవోలు తెచ్చుకున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ పేరు చెప్పి పెద్ద హీరోల సినిమాలకు అదనంగా రేట్లు పెంచుకోడానికి ప్రత్యేక అనుమతులు పొందుతున్నారు. ఇవి సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే మరిన్ని కలెక్షన్స్ సంపాదించడంలో సహాయపడుతున్నాయి.

'RRR' - 'KGF 2' - 'బీస్ట్' - 'ఆచార్య' - 'సర్కారు వారి పాట' వంటి భారీ చిత్రాలకు అధిక టికెట్ ధరలు వర్తింపజేస్తూ థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇవి కచ్చితంగా సామాన్యులకు అందుబాటులో ఉండే రేట్లు అయితే కాదు. అయినప్పటికీ వాటిల్లో లార్జర్ థెన్ లైఫ్ సినిమాలు చూడటానికి ఎంతైనా డబ్బు ఖర్చు చేయడానికి జనాలు ముందుకు వచ్చారు.

కానీ మిగతా చిత్రాలకు ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదని స్పష్టంగా అర్థం అవుతోంది. అధిక టికెట్ ధరల కారణంగా చాలా చోట్ల ఓపెనింగ్ డే నాడు హౌస్ ఫుల్స్ కూడా పడలేదు. కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఎంత నష్టపోయిందో.. సామాన్యులు కూడా అంతే నష్టపోయారు. పొదుపుగా ఖర్చు చేయడానికి అలవాటు పడిపోయారు.

దీనికి తోడు ఒక సినిమా టికెట్ ధరకు ఏడాది పాటు అపరితమైన వినోదాన్ని అందించే ఓటీటీలు ఉన్నాయి. ఎలాగూ ఇప్పుడు థియేటర్లలో వచ్చే సినిమాలు నెల తిరక్కుండానే డిజిటల్ వేదిక మీదకు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఆలోచించిన జనాలు థియేటర్ల వైపు చూడటం తగ్గించేశారు. ఈ విషయాన్ని గుర్తించక మేకర్స్ మరియు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ రేట్లు పెట్టి నష్టపోయే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు అధిక రేట్లు కారణంగా ఆడియన్స్ రాక థియేటర్లు కల్యాణ మండపాలు అవుతాయేమో అని భయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన ‘ఎఫ్‌3’ సినిమాను సాధారణ ధరలతో రిలీజ్ చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్పారు. వాల్ పోస్టర్స్ లో పేర్కొన్నారు. ఇదే క్రమంలో వచ్చిన ‘మేజర్‌’ సినిమాకైతే గత పెద్ద చిత్రాలతో పోలిస్తే టిక్కెట్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ప్రచారం చేశారు.

ఇలా టికెట్ రేట్లతో పబ్లిసిటీ చేయడమే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ నుండి తాజా ట్రెండ్. ఇది వర్కౌట్ అయిందనుకోండి. అది వేరే విషయం. అయితే ఇలా టికెట్ రేట్లతో పోస్టర్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అలానే 'ఎఫ్ 3' సినిమా రెండు నెలలు లేదా 8 వారాల దాకా ఓటీటీలో రాదు అంటూ దర్శక హీరోలు స్పెషల్ గా ప్రమోట్ చేస్తున్నారు.

'ఇతర సినిమాలతో పోలిస్తే మా టిక్కెట్ ధరలు చాలా తక్కువ.. కాబట్టి వచ్చి మా సినిమాని థియేటర్లలో మాత్రమే చూడండి' ప్రకటనలు చేయడం.. 'మా సినిమా ఎనిమిది తొమ్మిది వారాల వరకు డిజిటల్ రిలీజ్ ఉండదు కాబట్టి థియేటర్లకు వచ్చి మా సినిమాని చూడండి' అంటూ సినిమా టీమ్‌లు పబ్లిసిటీ ఇవ్వడం నిజంగా సిగ్గుచేటు.

టిక్కెట్‌ ధరలు గురించి.. ఇప్పుడప్పుడే ఓటీటీలోకి రాదంటూ ప్రమోషన్స్‌ చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? టాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు? అనేది ఇప్పుడు అందరూ ఆలోచించాలి. ఇదంతా చూస్తుంటే ఓటీటీ నెమ్మదిగా థియేటర్ వ్యవస్థను చంపేస్తోందనేది అర్థం అవుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఓటీటీ మార్కెట్ మరియు ఫిలిం మేకర్స్ మితిమీరిన అత్యాశతో థియేటర్ వ్యాపారం ఎలా మనుగడ సాగిస్తుందో చూడాలి.