Begin typing your search above and press return to search.

ఫోక‌స్: హ‌ద్దే లేకుండా చెల‌రేగిపో!!

By:  Tupaki Desk   |   31 Oct 2015 5:30 PM GMT
ఫోక‌స్: హ‌ద్దే లేకుండా చెల‌రేగిపో!!
X
బౌండ‌రీలు దాటే వ‌య‌స్సు మాది.. అని నాడు ఎస్పీబీ ఎంతో రాగ‌యుక్తంగా ఆల‌పించాడు. అవును .. అది నిజ‌మే .. మేం యూత్. చెల‌రేగిపోవ‌డానికి స‌రిహ‌ద్దులే లేవు అని యువ‌త‌రం అంతా ముక్త‌కంఠంతో ఆ పాట‌ను ప‌దే ప‌దే పాడుకున్నారు. ఏదైతేనేం ఇన్నాళ్టికి మ‌న యంగ్ హీరోల‌కు, సీనియ‌ర్ హీరోల‌కు తెలిసొచ్చిన‌ట్టుంది. ఆ పాట‌లోని అర్థం ప‌ర‌మార్థం ఏమిటో ! అందుకే ఇక‌నుంచి ఏ సినిమాలో న‌టించిన‌.. త‌మ జీవితాల‌కు అన్వ‌యించుకుని త‌ర‌చి చూసుకుంటున్నారు. కొన్నేళ్ల త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది? అన్న సందేహం రాకుండా ఇప్ప‌ట్నుంచే చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు.

చ‌ర‌ణ్‌ - మ‌హేష్ - ప్ర‌భాస్‌ - ఎన్టీఆర్‌ - రానా - నాగ‌చైత‌న్య‌... నాని - శ‌ర్వానంద్‌ - సందీప్ కిష‌న్‌.. ఇలా హీరోలు ఎవ‌రైనా రేంజు ఎంతున్నా.. పొరుగు బాష‌ల్లో హ‌వా చాటాల్సిందేన‌ని ఫిక్స‌యిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. అందుకే ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా మ‌ల్టీ లింగువ‌ల్‌ - బైలింగువ‌ల్ సినిమాల‌పై ప్ర‌తి ఒక్క‌రూ దృష్టి సారిస్తున్నారు. ఓ వైపు తెలుగు సినిమా చేస్తూనే అదే సినిమాని త‌మిళ్‌ లోనూ రిలీజ్ చేసి ఎలా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మ‌రోవైపు త‌మిళ హీరోల్ని - ట్యాలెంటును క‌లుపుకుని తెలుగు - త‌మిళ్ రెండుచోట్లా మార్కెట్ చేసుకోవ‌డం ఎలా ? అని ఆలోచిస్తున్నారు. ప‌రాజ‌యాలు వ‌చ్చినా భ‌య‌ప‌డ‌కుండా ముంద‌డుగు వేస్తున్నారు.

ఇటీవ‌లి కాలంలో బాహుబ‌లి విజ‌యం త‌ర్వాత అంద‌రి ఆలోచ‌న‌లు మారిపోయాయి. శ్రీ‌మంతుడు - బ్రూస్ లీ సినిమాలు త‌మిళ మార్కెట్ లోనూ పోటాపోటీగా రిలీజ‌య్యాయి. ఇప్పుడు అదే బాట‌లో ఆన్‌ సెట్స్‌ లో ఉన్న ఊపిరి - సైజ్ జీరో సినిమాలు తెలుగు - త‌మిళ్‌ లో రిలీజ్ కానున్నాయి. ఇవి రెండూ ముందే ప్ర‌ణాళిక‌తో రెండు భాష‌ల న‌టీన‌టుల‌తో తెర‌కెక్కించారు. ఇక‌ముందు బాహుబ‌లి 2 - మ‌హేష్‌-మురుగ‌దాస్ సినిమా - రానా త‌దుప‌రి సినిమా (స‌బ్‌మెరైన్ సింకింగ్ బ్యాక్‌ డ్రాప్‌), సందీప్ కిష‌న్ సైన్స్ ఫిక్స‌న్ సినిమా.. ఇవ‌న్నీ బైలింగువ‌ల్ ప్లాన్‌ తోనే తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు - త‌మిళ్ రెండుచోట్లా రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాల‌న్న‌ది ప్లాన్‌.

అలాగే రానా సినిమాని ట్రై లింగువ‌ల్‌ గా ట్రై చేస్తున్నాడు. అదే బాట‌లో నాగ‌చైత‌న్య హీరోగా గౌత‌మ్‌ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సాహ‌సం శ్వాస‌గా సాగిపో సినిమా కూడా తెలుగు - త‌మిళ్ ఆడియెన్ కోసం తెర‌కెక్కిస్తున్నారు. ఇలా ఏ ప్ర‌య‌త్నం చేసినా రెండు మార్కెట్ల‌ను లేదా అంత‌కంటే ఎక్కువ మార్కెట్ల‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. రెండు, మూడు భాష‌ల్లో న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకుని యూనివ‌ర్శ‌ల్ ఫార్ములా ఉన్న క‌థ‌ల‌తో సినిమాలు తీస్తున్నారు. ఇదో న‌యా ట్రెండ్‌. అంతా మ‌న మంచికే.