Begin typing your search above and press return to search.

ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఆ చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు?

By:  Tupaki Desk   |   20 Nov 2022 8:30 AM GMT
ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఆ చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యారు?
X
త‌మిళ క్రేజీ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ `వార‌సుడు`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా క‌లిసి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. త‌మిళంలో `వారీసు`గా, తెలుగులో `వార‌సుడు`గా రిలీజ్ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని ఈ సంక్రాంతికి త‌మిళ, తెలుగు భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఇష్యూతో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి తేనె తుట్టెని క‌దుపుతున్నారా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాలు అదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

సంక్రాంతి బ‌రిలో ఈ త‌మిళ డ‌బ్బింగ్ సినిమా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో తెలుగు చిత్ర చిత్ర నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న తెలుగు వ‌ర్సెస్ త‌మిళ‌గా మారుతోంది. సంక్రాంతికి తెలుగు సినిమాలు మాత్ర‌మే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలంటూ తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న ఇప్ప‌డు స‌రికొత్త వివాదానికి ఆజ్యం పోసింది. దీనిపై ఇప్ప‌టికే తెలుగు నిర్మాత అల్లు అర‌వింద్ ఘాటుగా స్పందించారు.

పాన్ ఇండియా వైడ్ గా సినిమాల‌కు హ‌ద్దులు చెరిగిపోయిన నేప‌థ్యంలో సినిమా రిలీజ్ ల‌ను అడ్డుకోవ‌డం సాధ్యం కాద‌ర‌ని, అది మంచి ప‌ద్ద‌తి కాదంటూ అల్లు అర‌వింద్ ఇండైరెక్ట్ గా తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లికి చుర‌క‌లంటించారు. వారి వాద‌నలో కొంత వ‌ర‌కు నిజ‌మున్నా అది ఇప్ప‌డు తెలుగు సినిమాకు అత్యంత ప్ర‌మాద‌కారిగా మార‌బోతోంద‌ని తెలుస్తోంది. `బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా దేశ వ్యాప్తంగా భాష‌తో సంబంధం లేకుండా సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి తెలుగు సినిమాల‌కే మా రాష్ట్రాల్లో తొలి ప్రాదాన్యం అనే డిమాండ్ ని వెలుగులోకి తీసుకురాడంతో అది ఇత‌ర సినిమాల కంటే తెలుగు సినిమాకే అత్య‌ధిక న‌ష్టాన్ని క‌లిగించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది. తాజాగా తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న‌పై త‌మిళ నిర్మాత‌ల సంఘం తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేయ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

ఇప్ప‌టికే తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యంపై ప‌లువురు త‌మిళ నిర్మాత‌లు మండిప‌డుతున్నారు. తాజాగా తాజాబితాలో ద‌ర్శ‌కుడు ఎన్‌. లింగుస్వామి చేరారు. తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ప‌ద్ద‌తి త‌న‌కు ఏమీ న‌చ్చ‌లేద‌న్నారు. ఒక వేళ వారు ప్ర‌క‌టించిన విధంగానే జ‌రిగితే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు. త‌మిళ సినిమాకు ఇది సువ‌ర్ణ శ‌కంగా చెప్ప‌వ‌చ్చు. పాన్ ఇండియా సినిమాలు ఇక్క‌డ ఎప్పుడో వ‌చ్చాయి. ఇక్క‌డ నిర్మించిన సినిమాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించాయి. ఓటీటీల రంగంల అభివృద్ది చెందిన త‌రువాత ఏ సినిమా అయినా ఎక్క‌డి నుంచైనా చూసే అవ‌కాశం ల‌భించిందన్నారు.

ఇక తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తే `వారీసు`కు ముందు.. `వారీసు` త‌రువాత సినిమా అనే స్థాయిలో ప‌రిస్థితులు మార‌తాయ‌ని, దీనిపై ఇండ‌స్ట్రీ పెద్ద‌లు అంతా కూర్చుని మాట్లాడి మంచి నిర్ణ‌యం తీసుకుంటే మంచిద‌ని, లేదా ఇలాంటి ప‌రిస్థితి మ‌రోసారి రిపీట్ అయితే అప్పుడు ఏం చేయాలో మేమూ ఆలోచిస్తామ‌ని తీవ్ర స్వ‌రంతో ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఫైర్ అయ్యారు. ఈ వివాదం ఎలా వుందంటే కొండ‌ నాలిక‌కు మందేస్తే ఉన్న‌నాలిక ఊడిన‌ట్టుగా వుంద‌ని ఆడియ‌న్స్ సెటైర్లు వేస్తున్నారు. త‌మిళ‌, తెలుగు సినిమాపై వున్న ప్రేమ‌తో తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి చేసిన ప్ర‌క‌ట‌న దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగించేలా వుంద‌ని ఈ చిన్న లాజిక్ ని తెలుగు చ‌ల‌న చిత్ర నిర్మాత‌ల మండ‌లి ఎలా మిస్స‌య్యార‌ని ప‌లువురు వాపోతున్నారు.