Begin typing your search above and press return to search.

ఇత‌ర భాష‌ల సినిమాల‌ని ఎవ‌రూ ఆప‌లేరు!

By:  Tupaki Desk   |   10 Dec 2022 2:30 PM GMT
ఇత‌ర భాష‌ల సినిమాల‌ని ఎవ‌రూ ఆప‌లేరు!
X
విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన `నార‌ప్ప‌` మూవీ అప్పుడున్న ప‌రిస్థితుల కార‌ణంగా థియేట‌ర్ల‌లో కాకుండా ఆమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుద‌లై విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే వెంక‌టేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న ఈ మూవీని కేవ‌లం ఒక్క రోజు మాత్ర‌మే థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత డి. సురేష్ బాబు ప్ర‌త్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలని వెల్ల‌డించారు.

వెంక‌టేష్ అభిమానుల కోరిక మేర‌కు `నార‌ప్ప‌`ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్నామ‌న్నారు. ఆ రోజే ఫ్యాన్స్ కోసం డిఫ‌రెంట్ సినిమాల్లోని పాట‌ల‌ని ఫ్యాన్స్ కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తామ‌న్నారు. ఈ మూవీ ప్ర‌ద‌ర్శ‌న ద్వారా వ‌చ్చే మొత్తాన్ని చారిటీకి వ‌చ్చేయాల‌ని ఆలోచ‌న చేస్తున్నాయ‌ని తెలిపారు.  ఇత‌ర భాష‌ల సినిమాల‌ను ఎవ‌రూ ఆప‌లేర‌ని, సంక్రాంతి సీజ‌న్ లో అన్ని సినిమాలు న‌డుస్తాయ‌న్నారు. తెలుగు సినిమాల‌కు హ‌ద్దులు లేవ‌ని, మ‌న సినిమాను ఏ భాష‌లో కూడా చుల‌క‌న‌గా చూడ‌టం లేద‌న్నారు.

చెన్నైలో `RRR`విడుద‌ల చేసినప్పుడు కూడా అక్క‌డి వారు ఇబ్బంది ప‌డ్డార‌ని, స్థానికంగా చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ని, మంచి సినిమా అయితే ఎక్కువ థియేట‌ర్ల‌లో ఆడిస్తార‌ని తెలిపారు. సినిమా బాగా లేక‌పోతే మ‌రుస‌టి రోజే తీసేస్తార‌ని, ఇదొక వ్యాపార‌మ‌న్నారు. ఎవ‌రిష్టం వారిద‌ని, ఆడుతుంద‌న్న న‌మ్మ‌కం వున్న సినిమాకు ఎక్కువ థియేట‌ర్లు ఇస్తార‌ని, అది ఏ భాష సినిమా అని చూడ‌ర‌న్నారు. మ‌న తెలుగు సినిమాలు కూడా ఇత‌ర భాష‌ల్లో విడుద‌లై విజ‌యం సాధిస్తున్నాయ‌న్నారు.  

ఇవాళ సినిమాకు స‌రిహ‌ద్దులు చెరిగిపోయాయ‌ని, అందు వ‌ల్ల ఇత‌ర భాష‌ల సినిమాల వ‌ల్ల స‌మ‌స్య‌లే స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, వాటిని త‌ట్టుకుని ముందుకు సాగిపోవాల‌న్నారు. తెలుగు సినిమాకు ఇవాళ దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని, మొన్న‌టి వ‌ర‌కు క‌న్న‌డ సినిమాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని ఇప్ప‌డు వాటిని చూస్తున్నార‌ని తెలిపారు. స్టార్ కాస్ట్ కంటే ప్రేక్ష‌కులు కంటెంట్ కె ప్రాధాన్య‌త నిస్తున్నార‌ని `అవ‌తార్ 2`లో న‌టించిన స్టార్స్ ఎవ‌రో ఎవ‌రికీ తెలియ‌ద‌ని కంటెంట్ కార‌ణంగా ఆ సినిమా కోసం కోట్లాది మంది వేచి చూస్తున్నారని వెల్ల‌డించారు.

గ‌తంలో చిన్న సినిమాల‌ని ప‌క్క‌న పెట్టి డ‌బ్బింగ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌నే వార‌ని ఇప్ప‌డు మాత్రం పెద్ద సినిమాల‌ను కూడా డ‌బ్బింగ్ సినిమాల కోసం ప‌క్క‌న పెడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌న్నారు. త్వ‌ర‌లో వెంక‌టేష్, రానాల‌తో సోలో ప్రొడ్యూస‌ర్ గా రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నాన‌ని, వెంక‌టేష్ తో సినిమా ఫిబ్ర‌వ‌రిలో మొద‌లు పెడ‌తాన‌న్నారు. ఇక అభిరామ్ న‌టిస్తున్న `అహింస‌` ఈ నెల‌లో లేదా వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతుంద‌న్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.