Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: నిర్మాత‌ల‌కు కొత్త నొప్పి

By:  Tupaki Desk   |   19 Nov 2019 1:30 AM GMT
ట్రెండింగ్: నిర్మాత‌ల‌కు కొత్త నొప్పి
X
నిర్మాత‌ల్ని వేధిస్తున్న‌ ర‌క‌ర‌కాల త‌ల‌నొప్పులేమిటో ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఉన్న‌వ‌న్నీ తాక‌ట్టు పెట్టి.. ఇండ్లు పొలాలు అమ్మి.. ఫైనాన్సులు తెచ్చి నానా తంటాలు ప‌డే నిర్మాత‌కు ర‌క‌ర‌కాల కోణాల్లో త‌ల‌నొప్పులు తప్ప‌డం లేదు. ఇక ఇందులో హీరోల వైపు నుంచి వ‌చ్చే నొప్పి అసాధార‌ణ‌మైన‌ది.

ఇప్పుడు మ‌న హీరోలు నిర్మాత‌ల్ని లాజిక్ తో కొడుతున్నారు. వీళ్లు వేస్తున్న ర‌క‌ర‌కాల మెలిక‌లు నిర్మాత మెడ‌కు ఉచ్చులా త‌గులుకుంటున్నాయ‌న్న భావ‌న నెల‌కొంది. ఒక చేత్తో ఇచ్చిన‌ట్టే ఇచ్చి వేరొక చేత్తో లాక్కున్న చందంగా ఉంది హీరోల వ్య‌వ‌హార శైలి. అస‌లింత‌కీ మ్యాట‌రేమిటి? అంటే.. ఇటీవ‌లి కాలంలో మ‌న హీరోలంతా ఎంతో ఉదారంగా అస‌లు త‌మ‌కు పారితోషికాలు మొత్తం సినిమా రిలీజ్ ముందే నిర్మాత‌లు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటూనే .. మ‌రోవైపు నుంచి తెలివిగా లాగేస్తున్నారు. మొత్తం పారితోషికం ఇవ్వ‌కుండా ప‌దో ప‌ర‌కో విసిరేయండి. ఆ త‌ర్వాత ఫ‌లానా ఏరియా రిలీజ్ హ‌క్కులు మాకు ఇచ్చేయండి అంటూ మెలిక పెట్టేస్తున్నారు.

దీంతో లాభాలు తెస్తుంద‌నుకునే ఆ ఏరియాను ఆయాచితంగా హీరోగారికే క‌ట్ట‌బెట్టాల్సి వ‌స్తోంద‌ట‌. ఇక మ‌న స్టార్ హీరోలంతా 20-30కోట్లు అంత‌కుమించిన రేంజులోనే ఉన్నారు కాబ‌ట్టి 10-15 కోట్ల మ‌ధ్య ముందే వ‌సూల్ చేసుకుంటూనే నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు త‌మ‌కే కావాల‌ని అడుగుతున్నార‌ట‌. దీంతో నిర్మాత‌కు చివ‌రికి మిగిలేది బోడిగుండేన‌ని విశ్లేషిస్తున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసాన‌ని చెప్పుకున్న బండ్ల గ‌ణేష్ అంత‌టి వాడికే అస‌లు ఆ సినిమా వ‌ల్ల ద‌క్కింది ఏదీ లేద‌ని చెబుతుంటారు. అంటే ఆల్మోస్ట్ స్టార్ హీరో ఖాతాలోకే ఎక్కువ వెళ్లిపోయేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. అందుకే నిర్మాత ఇటీవ‌ల ఫైనాన్షియ‌ర్ గా మాత్ర‌మే మారిపోయాడు. ఫైనాన్షియ‌ర్ గా మారి దానిపై వ‌డ్డీలు గుంజేవాడిగా మారిపోయాడ‌ని విశ్లేషిస్తున్నారు.

ఇక‌పోతే మ‌హేష్ - చ‌ర‌ణ్‌- తార‌క్- బ‌న్ని లాంటి స్టార్లు పారితోషికం ముందే తీసుకోక‌పోయినా. నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు ఇచ్చేయండి అని అడిగారు అంటే .. దాదాపు 30-50 కోట్ల మ‌ధ్య హీరోల‌కే ద‌క్కే ఛాన్సుంద‌ని విశ్లేషిస్తున్నారు. అంటే సినిమా విజయం సాధించి 60 కోట్ల షేర్ వ‌సూలైంది 100 కోట్ల గ్రాస్ వ‌సూలైంద‌ని లెక్క‌లు చెప్పినా మెజారిటీ పార్ట్ హీరో ఖాతాలోకే ప‌డిపోతుంద‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అస‌లు టిక్కెట్టు తెగేదే మ‌మ్మ‌ల్ని చూసి అన్న భావ‌న హీరోల్లో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది కాబ‌ట్టి ఆమాత్రం వ‌దిలించుకునేందుకు నిర్మాత‌లు సిద్ధంగా ఉండ‌డ‌మే ఇక్క‌డ ట్విస్టు. ఇక మ‌న స్టార్ హీరోల్ని కాద‌ని మ‌న‌గ‌లిగే నిర్మాత‌లు ఇక్క‌డ ఎవ‌రూ లేనే లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. క్రౌడ్ పుల్ల‌ర్స్ కోసం అంత భారీ పెట్టుబ‌డులు పెట్టే నిర్మాత‌లు సినిమా అటో ఇటో అయితే ఇక గ‌ల్లంతే. అలా ఎంద‌రో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అడ్రెస్ గ‌ల్లంత‌యిన సంగ‌తిని చూస్తూనే ఉన్నాం. ప్ర‌స్తుతం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ మెలిక నిర్మాత‌ల‌కు కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంద‌ట‌.