Begin typing your search above and press return to search.

రిలీజ్ ప్లానింగ్ లో టాలీవుడ్ వీకేనబ్బా.. !

By:  Tupaki Desk   |   22 Oct 2019 8:45 AM GMT
రిలీజ్ ప్లానింగ్ లో టాలీవుడ్ వీకేనబ్బా.. !
X
బాలీవుడ్ లో రిలీజ్ డేట్ ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. వచ్చే ఏడాది సమ్మర్.. ఈద్.. దీపావళి.. క్రిస్మస్ సీజన్లలో రిలీజ్ అయ్యే స్టార్ హీరోల సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయి ఉంటాయి. అనివార్య కారణాలు ఉంటే తప్ప డేట్స్ మారవు. కానీ ఈ విషయంలో టాలీవుడ్ ఫిలింమేకర్లు వెనకబడి ఉన్నారని చెప్పకతప్పదు. రెండు నెలల్లో క్రిస్మస్ సీజన్ రానుంది. ఈ సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు ఇంకా ఫైనలైజ్ కాలేదంటే మనం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నిన్నమొన్నటివరకూ క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేస్తారని అనుకున్న సినిమాలలో మెజారిటీ ఇప్పుడు ఫిబ్రవరికి వెళ్ళిపోయాయి. ఇక సంక్రాంతి విషయంలో కూడా కొంత తికమక నెలకొని ఉంది. సంక్రాంతి సినిమాల విడుదల తేదీలలో చివరి నిముషంలో మార్పుచేర్పులు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇది ఒక సమస్య అయితే మన ఫిలింమేకర్లు ఎదుర్కొనే సమస్య లాస్ట్ మినిట్ రిలీజ్ టెన్షన్. బాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ కు నెల రోజుల ముందే ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. దీంతో రిలీజుకు ముందు ఫుల్ గా ప్రమోషన్స్ పై దృష్టిసారిస్తారు. కానీ తెలుగు సినిమాలు ఎంత పెద్ద హీరోలవి అయినా సరే చివరి నిముషం వరకూ షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సినిమాలకు ప్రమోషన్ చేసుకునే టైమ్ కూడా ఉండదు. ఇక లాస్ట్ మినిట్ లో ఇబ్బందులు తలెత్తితే ముందుగా ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్లను కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. డిసెంబర్ రిలీజుల్లో కొన్ని వాయిదా పడడానికి కారణం వర్క్ పూర్తి కాకపోవడమేనట.

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్.. అనిల్ రావిపూడి లాంటి దర్శకులు మాత్రమే అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ చెప్పి సినిమాను అదే డేట్ కు రిలీజ్ చేయగలరు. ఇలా అతి కొద్దిమంది తప్ప మిగతా డైరెక్టర్లకు చెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయగలిగే టైం మ్యానేజ్ మెంట్ లేదన్నది ఓపెన్ సీక్రెట్. బడా స్టార్ డైరెక్టర్లు కూడా ఈ విషయంలో ప్రతి సినిమా రిలీజుకు ముందు ఇబ్బందులు పడుతున్నవారే. వారిని కనుక నిర్మాతలు రిలీజ్ డేట్ విషయంలో ఒత్తిడి చేస్తే అవుట్ పుట్ దెబ్బ తింటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం ఉంది... అదే ప్రాపర్ ప్లానింగ్. స్ట్రిక్ట్ గా ఆ ప్రణాళికకు తగ్గట్టు నడుచుకోవడం. ఆ క్రమశిక్షణ లేకపోతే ఈ రిలీజ్ డేట్ ఇబ్బందులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. దీనివల్ల ఇతర సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పవు.