Begin typing your search above and press return to search.

వామ్మో.. డబ్బింగ్ సినిమానా?

By:  Tupaki Desk   |   11 April 2017 12:30 PM GMT
వామ్మో.. డబ్బింగ్ సినిమానా?
X
డబ్బింగ్ సినిమా అంటే ఒకప్పుడు బంగారు బాతే. ఒక దశలో తెలుగు సినిమాను కూడా పక్కకు నెట్టేసి వసూళ్ల వర్షం కురిపించుకున్నాయి అనువాదాలు. చంద్రముఖి.. శివాజీ.. రోబో.. గజిని.. అపరిచితుడు.. ఆయా సమయాల్లో ఎలాంటి వసూళ్లు సాధించాయో గుర్తుండే ఉంటుంది. కానీ ఈ మధ్య డబ్బింగ్ సినిమాల జోరు బాగా తగ్గిపోయింది. ఏడాదికి ఒకటీ అరా మినహాయిస్తే తెలుగులో పెద్దగా ప్రభావం చూపుతున్న అనువాద చిత్రాలు కనిపించడం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలకు గుబులు పుట్టించిన తమిళ డబ్బింగ్ సినిమాలకు ఇప్పుడు అంతగా ఆదరణ కనిపించట్లేదు. వాటి ప్రభావం క్రమ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన తమిళ అనువాద చిత్రం ‘చెలియా’ పరిస్థితి దయనీయంగా ఉంది. మణిరత్నం ‘ఓకే బంగారం’ ఇచ్చిన ఊపులో ‘చెలియా’పై పెద్ద పెట్టుబడే పెట్టిన రాజుకు.. ఈ సినిమా చేదు అనుభవం మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ ‘చెలియా’ కంటే ముందు ‘పోలీస్’.. ‘రెమో’ లాంటి సినిమాలతో రాజు చేతులు కాల్చుకున్నాడు. రాజు మాత్రమే కాదు.. డబ్బింగ్ సినిమాలపై పెట్టుబడి పెట్టిన చాలామందికి గత కొన్నేళ్లలో చాలా వరకు చేదు అనుభవాలే మిగిల్చాయి. తెలుగులో బ్యాంకబుల్ స్టార్‌ గా గుర్తింపు పొందిన సూర్య నుంచి వచ్చిన ‘సింగం-3’ కూడా నష్టాలే మిగిల్చింది. ‘16’ సినిమా పర్వాలేదనిపిస్తే.. ‘నగరం’ దెబ్బ తినేసింది.

గత కొన్నేళ్లలో తెలుగులో భారీ వసూళ్లు తెచ్చుకున్న తమిళ డబ్బింగ్ సినిమా ఒక్క ‘బిచ్చగాడు’ మాత్రమే. అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా నెమ్మదిగా జనాల్లోకి చొచ్చుకెళ్లిపోయింది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. కానీ ‘బిచ్చగాడు’తో మంచి ఫాలోయింగ్ సంపాదించిన విజయ్ ఆంటోనీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అతడి తర్వాతి రెండు సినిమాలు బేతాళుడు - యమన్ నిరాశ పరిచాయి. మంచి అంచనాల మధ్య రిలీజై రెండూ ఫ్లాపులుగా తేలాయి. గత ఏడాది ‘బిచ్చగాడు’ కాకుండా ‘మలుపు’ - ‘మన్యంపులి’ లాంటి సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీ ‘జంగిల్ బుక్’ కూడా మంచి వసూళ్లు సాధించింది. గత కొన్నేళ్లలో తెలుగులో ఇంకే ఇంగ్లిష్ సినిమా కూడా ఇలా ప్రభావం చూపలేదు. ఆల్రెడీ ‘జంగిల్ బుక్’తో మన ప్రేక్షకులకున్న ఎమోషనల్ బాండింగే ఆ సినిమా విజయవంతమవ్వడానికి కారణం. ఒకప్పట్లా హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల్ని మన వాళ్లు ఎగబడి చూసే పరిస్థితి ఇప్పుడెంతమాత్రం లేదు. ‘జంగిల్ బుక్’ కాకుండా ఈ మధ్య కాలంలో ఓ మోస్తరుగా ప్రభావం చూపిన ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాలు ఇంకేవీ కనిపించవు. గత ఏడాది కన్నడ కుర్రాడు నిఖిల్ కథానాయకుడిగా పరిచయమైన ‘జాగ్వార్’ తుస్సుమంది. కోడిరామకృష్ణ కన్నడ డబ్బింగ్ సినిమా ‘నాగభరణం’ కూడా నిరాశ పరిచింది. సూర్య మూవీ ‘మేము’ - విక్రమ్ ‘ఇంకొక్కడు’ - విశాల్ చిత్రాలు ‘కథకలి’ - ‘రాయుడు’ - ‘ఒక్కడొచ్చాడు’ ఆకట్టుకోలేదు.

ఒకప్పుడు తమిళ అనువాద చిత్రాల తాకిడికి తెలుగు సినిమా ఎలా షేక్ అయిందో తెలిసిందే. రజినీకాంత్ - కమల్ హాసన్‌ లతో పాటు సూర్య - కార్తి - విశాల్ - జీవా లాంటి హీరోలు చాలామంది అనువాదాలతో కాసుల పంట పండించుకున్నారు. కానీ ఇప్పుడు కథ మారింది. వీరిలో చాలామంది ఫాలోయింగ్ పడిపోయింది. రజినీకాంత్ - సూర్య మాత్రమే తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌తో కొనసాగుతున్నారు. కానీ వాళ్ల సినిమాలకు కూడా తెలుగులో ఆశించిన వసూళ్లు రావట్లేదు. రజినీ ‘రోబో’ తర్వాత నటించిన ప్రతి సినిమా ఇక్కడ చేదు అనుభవాన్నే మిగిల్చింది. ‘కథానాయకుడు’ - ‘విక్రమసింహా’ - ‘లింగా’తో పాటు గత ఏడాది వచ్చిన ‘కబాలి’ బయ్యర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. ఇప్పుడు రజినీ సినిమా అంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఇక ‘గజిని’, ‘యముడు’ లాంటి సినిమాలతో తెలుగులో అనూహ్యమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న సూర్య.. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో వెనుకబడిపోయాడు. అతడి తాజా సినిమా ‘సింగం-3’ నిరాశపరిచింది. దాదాపు రూ.20 కోట్లకు హక్కులు తీసుకుంటే.. ఫుల్ రన్లో వచ్చిన షేర్ రూ.10 కోట్లకు పైచిలుకు మాత్రమే. ఇక కమల్ హాసన్ జోరు గత కొన్నేళ్లలో ఎలా తగ్గిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కార్తి ఒకప్పుడు రైజింగ్‌ లో ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో బాగా వెనుకబడ్డాడు. గత ఏడాది ద్విభాషా చిత్రం ‘ఊపిరి’తో ఆకట్టుకున్నా.. ‘కాష్మోరా’తో నిరాశ పరిచాడు. తాజాగా ‘చెలియా’ సినిమా అతడికి చేదు అనుభవం మిగిల్చింది. ఇక విశాల్ - జీవా లాంటి హీరోల గురించి చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమాల్ని పట్టించుకోవడమే మానేశారు మన ప్రేక్షకులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/