Begin typing your search above and press return to search.

‘రంగస్థలం’కే ఎందుకిలా?

By:  Tupaki Desk   |   27 Feb 2018 7:08 AM GMT
‘రంగస్థలం’కే ఎందుకిలా?
X
ఎంత పెద్ద డైరెక్టర్.. ఎంత పెద్ద హీరో జత కలిసినా.. బడ్జెట్ ఎంతైనా.. ఈ రోజుల్లో ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీసే పరిస్థితి లేదు. ‘బాహుబలి’ లాంటి సినిమాల్ని మినహాయిస్తే.. మామూలు సినిమాలు చాలా వరకు ఏడాది లోపే పూర్తయిపోతున్నాయి. షూటింగ్ డేస్ వంద లోపే ఉంటున్నాయి. కానీ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ మాత్రం షూటింగ్ మొదలై దాదాపు ఏడాది అవుతున్నా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. నిజానికి సినిమా మొదలయ్యే ముందు దీన్ని గత ఏడాది దసరాకు రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఐతే అప్పటికి హడావుడి అవుతుందని సంక్రాంతికి వాయిదా వేశారు.

‘రంగస్థలం’ టైటిల్ ప్రకటించినపుడే సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్ మీద పడిపోయింది. ఈ సంక్రాంతికి ముందుగా బెర్తు కన్ఫమ్ చేసుకున్న సినిమా కూడా అదే. ఆ సమయానికి సినిమాను రెడీ చేసే అవకాశమున్నప్పటికీ.. ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికి షెడ్యూల్ కావడంతో తమ సినిమాను వాయిదా వేసుకుంది ‘రంగస్థలం’ టీం. ఆ తర్వాత దగ్గర్లో మంచి సీజన్ లేదని సినిమాను వేసవికి తీసుకెళ్లిపోయారు. సమ్మర్లో సాధ్యమైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మార్చి నెలాఖరుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న ప్రకారం మార్చి 29న ‘రంగస్థలం’ వస్తుందా రాదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్పీలు) వ్యతిరేకంగా నిర్మాతలు చేస్తున్న సమ్మే. వాళ్లు ధరలు తగ్గించేవరకు సినిమాలు ఇవ్వొద్దని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. డీఎస్పీలు దిగొచ్చే వరకు సినిమాల రిలీజ్ కోసం రాజీకి రావద్దన్నది నిర్మాతల మాట.

కానీ డీఎస్పీలేమో అన్ సీజన్ కాబట్టి.. చెప్పుకోదగ్గ రిలీజులేవీ లేవు కాబట్టి నిర్మాతలు సమ్మెకు దిగారని.. మూడు వారాలు గడిస్తే ఆటోమేటిగ్గా వాళ్లే తలొగ్గుతారని భావిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన ఎన్నాళ్లు కొనసాగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిర్మాతలు పట్టు వదలని పక్షంలో ‘రంగస్థలం’కు ఇబ్బంది తప్పదు. విస్తృత ప్రయోజనాల కోసం ఈ చిత్రాన్ని వాయిదా వేసుకోమంటూ ఒత్తిడి రావచ్చు. నిర్మాతలు తలొగ్గితే ఈ సినిమా కోసమే పట్టు వదిలేశారన్న విమర్శలు తలెత్తుతాయి. ఈ పరిస్థితుల్లో ‘రంగస్థలం’ మరోసారి వాయిదా పడుతుందేమో చూడాలి.