Begin typing your search above and press return to search.

ఓటీటీలో 60 రోజుల త‌రువాతే : దిల్ రాజు

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 PM GMT
ఓటీటీలో 60 రోజుల త‌రువాతే : దిల్ రాజు
X
గ‌త కొంత కాలంగా ఓటీటీ రిలీజ్ ల‌పై చ‌ర్చ‌లు జ‌రుపుతున్న నిర్మాత‌ల మండ‌లి గురువారం ప్ర‌త్యేకంగా దీనిపై భేటీ అయింది. అంతే కాకుండా దీనిపై సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. భేటీ అనంత‌రం నిర్మాత దిల్ రాజు కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించారు. 8 వారాల త‌రువాతే సినిమాల‌ని ఓటీటీల్లో రిలీజ్ చేస్తామ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టుగా వెల్ల‌డించారు. అంటే 56 నుంచి 60 రోజుల్లో ఏ సినిమా అయినా ఓటీటీకి ఇవ్వాల‌ని అంతా నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ `ఇక నుంచి ప్ర‌తి సినిమా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు అగ్రిమెంట్ పూర్త‌యిన వాటిని కూడా ప‌రిశీలిస్తున్నాం. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధంగా వున్న‌, చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న సినిమాల‌న్నీ థియేట‌ర్ల‌లో విడుద‌లైన 8 వారాల త‌రువాతే అంటే 50 నుంచి 60 రోజుల త‌రువాతే ఓటీటీలోకి వ‌స్తాయి. ఈ విష‌యంలో నిర్మాత‌లం అంతా ఏకాభిప్రాయానికి వ‌చ్చాం అన్నారు.

అలాగే థియేట‌ర్ల‌లో, మ‌ల్టీప్లెక్స్ ల‌లో తినుబండారాల‌న్నీ ప్రేక్ష‌కుల‌కు అందుబాటు ధ‌ర‌ల్లోనే వుండాల‌ని కోరాం. అందుక వారు కూడా సానుకూలంగా స్పందించారు. పీపీఎఫ్ ఛార్జీల‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. శుక్ర‌వారం ఎగ్జిబిట‌ర్స్ తో జ‌రిగే స‌మావేశంలో తుది నిర్ణ‌యం తీసుకుంటాం.ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెలకొన్న ఒక్కో స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించుకుంటూ త్వ‌ర‌లోనే షూటింగ్ లు మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నాం` అన్నారు.

అలాగే నిర్మాణ వ్య‌యం త‌గ్గించేందుకు ఎలా వ్య‌వ‌హ‌రించాలో మా అసోసియేష‌న్ తో ఓ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇదొక మంచి విజ‌యం. నిర్మాత‌లు అగిడిన పాయింట్ల‌కు `మా` సానుకూలంగా స్పందించింది. ద‌ర్శ‌కులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల‌తో చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. వృధా ఖ‌ర్చులు ఎలా త‌గ్గించుకోవాలో వాళ్ల‌తో చ‌ర్చించాం. మ‌రో రెండు మూడు రోజులలో అన్నీ ఓ కొలిక్కి వ‌స్తాయి. ఫెడ‌రేష‌న్ తో కూడా చ‌ర్చలు పూర్త‌య్యాయి.

అయితే వారితో ఒక‌టి రెండు స‌మ‌స్య‌లున్నాయి. వాళ్లు అడుగుతున్న వేత‌నాల‌ని ఇవ్వ‌డానికి నిర్మాత‌లు కూడా ద‌రిదాపుల్లోనే వున్నారు. అయితే దీనిపై తుది నిర్ణ‌యం త్వ‌ర‌లోనే వ‌స్తుంది. ఈ లోగానే షూటింగ్ లు మొద‌ల‌వుతాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి వాస్త‌వం లేదు.

ఎప్పుడు షూటింగ్ లు మొద‌ల‌య్యేది విలేఖ‌రుల స‌మావేశం పెట్టి చెబుతాం అన్నారు. అంతే కాకుండా మ‌న నిర్ణ‌యాల‌ని, షూటింగ్ బంద్ ని బాలీవుడ్ నిశితంగా గ‌మ‌నిస్తోంద‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు వారు ఫోన్ లు చేసి మ‌రీ మ‌న నిర్ణ‌యాలేంట‌ని తెలుసుకుంటున్నార‌ని ఈ సంద‌ర్భంగా దిల్ రాజు స్ప‌ష్టం చేశారు.