Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మిస్సింగ్..!

By:  Tupaki Desk   |   11 Jan 2022 12:30 AM GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ మిస్సింగ్..!
X
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు హిట్ సినిమా తీసాడంటే.. వెంటనే స్టార్ హీరోలు - అగ్ర నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అదే స్టార్ డైరెక్టర్ అయితే వాళ్ళకుండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది దర్శకులు క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని.. వెంటనే నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకెళ్లడమే కాదు.. వరుస సినిమాలు కమిట్ అవుతూ ఉంటారు.

అయితే కారణాలు ఏవైనా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ అందరూ మిస్సింగ్ అవుతున్నారు. హిట్ సినిమా ఇచ్చి కూడా చాలా మంది దర్శకులు తదుపరి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు. రాజమౌళి - కొరటాల శివ - త్రివిక్రమ్ శ్రీనివాస్ - పూరీ జగన్నాథ్ - వంశీ పైడిపల్లి - హరీష్ శంకర్.. ఇలా చెప్పుకుంటూపోతే దాదాపు అగ్ర దర్శకులందరూ ఈ జాబితాలోకి వస్తారు.

దర్శకధీరుడు రాజమౌళి విషయానికొస్తే.. కెరీర్ ప్రారంభం నుంచీ సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే. వెండితెర మీద విజువల్ వండర్స్ ఆవిష్కరించే మిస్టర్ పర్ఫెక్ట్ జక్కన్న.. చివరగా 2017 సమ్మర్ లో 'బాహుబలి 2' చిత్రాన్ని విడుదల చేశారు. అప్పటి నుంచి 'ఆర్.ఆర్.ఆర్' సినిమా మీదనే వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తుందనుకుంటుండగా.. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి పోస్ట్ పోన్ అయింది. అగ్ర దర్శకుడి సినిమాని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా బయటకు వస్తే మహేష్ బాబు స్క్రిప్ట్ మీద రాజమౌళి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది.

2018 వేసవిలో 'భరత్ అనే నేను' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కొరటాల శివ.. ఇప్పటి వరకు మరో చిత్రాన్ని ఆడియన్స్ కు చూపించలేకపోయారు. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి వల్ల కొంతకాలం ఖాళీగా ఉంటే.. కోవిడ్ వచ్చి కొరటాల రెండేళ్ల సమయాన్ని తినేసింది. ఫైనల్ గా 'ఆచార్య' సినిమా రెడీ అయింది.. 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అనుకుంటుండగా.. ఇప్పుడు మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ దెబ్బేసే పరిస్థితి కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాల‌తో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని ఇప్పుడే రంగంలోకి దింపాలనుకున్నా.. కొర‌టాల‌కి ఆ ఛాన్స్ కూడా లేదని టాక్ వినిపిస్తోంది. కారణం మ్యాట్నీ మూవీస్ వారు RRR టీమ్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్ర‌కారం ఆ సినిమా రిలీజ్ అయిన త‌రువాతే 'ఆచార్య‌' ను విడుద‌ల చేయాల్సి ఉంటుందట. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో తన రెండో చిత్రాన్ని ప్రారంభించాలని దర్శకుడు వేచి చూస్తున్నారు. ఇక కొరటాల నిర్మాతగా సత్యదేవ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగుపెట్టింది. మొత్తం మీదరీజన్స్ ఏవైనా హిట్టిచ్చిన తర్వాత కూడా సీనియర్ డైరెక్టర్ చాలా కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది.

'అల వైకుంఠపురములో' వంటి విజయవంతమైన సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయారు. ఆ మధ్య సితార బ్యానర్ లో ఎన్టీఆర్ తో ఓ మూవీ అనౌన్స్ చేసారు. త్వరలోనే స్టార్ట్ అవుతుందని అనుకుంటుండగా.. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అనౌన్స్ చేశారు. ఇదే క్రమంలో మహేష్ బాబుతో త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమాని ప్రకటించారు. అయినా కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా చూసుకుంటే త్రివిక్రమ్ నుంచి తదుపరి సినిమా రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది. కాకపోతే ఈ గ్యాప్ లో స్టార్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించిన 'భీమ్లా నాయక్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ 2019లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుని తిరిగి ఫార్మ్ లోకి వచ్చారు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చిన పూరీ.. తన శైలికి భిన్నంగా ఎన్ని రోజులు పట్టినా ఈ ప్రాజెక్ట్ పైనే పని చేస్తున్నారు. మధ్యలో కరోనా రావడం వల్ల కొంత సమయ, వృధాగా పోయింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంతో డేరింగ్ డైరెక్టర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరే ఛాన్స్ ఉంది. 2022 ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుడల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. మరి అప్పటి వరకు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ మీదనే కూర్చుంటారా.. లేదా ఈ గ్యాప్ లో పూరి మరో సినిమా చేస్తారా అనేది చూడాలి.

2019 సమ్మర్ లో 'మహర్షి' సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు వంశీ పైడిపల్లి.. జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. కానీ ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేయలేకపోయారు. మహేష్ బాబుతో వెంటనే ఓ సినిమా చేయాలని కొన్నాళ్ళు స్క్రిప్ట్ వర్క్ చేసారు. సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వంశీ వేచి చూడక తప్పలేదు. ఎట్టకేలకు తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ ద్విభాషా చిత్రాన్ని సెట్ చేసుకోగలిగారు. కాకపోతే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లి.. ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టైం పట్టనుంది. అంటే హిట్ సినిమా ఇచ్చిన మూడేళ్ళ తర్వాత గానీ పైడిపల్లి వంశీ నుంచి మరో మూవీ రాదన్నమాట.

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కెరీర్ ఆరంభం నుంచీ స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తున్న హరీష్.. 2019లో 'గద్దలకొండ గణేష్' చిత్రంతో సక్సెస్ అందుకున్నారు. దీని తర్వాత వెంటనే మరో సినిమా చేస్తారని సినీ అభిమానులు భావించగా.. రెండున్నర ఏళ్ళైనా మూవీ స్టార్ట్ చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు కానీ.. అది ఇంకా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతం పవన్ కమిట్ మెంట్స్ పూర్తయితే కానీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాదు. అప్పటి వరకు హరీష్ వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒకవేళ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2022 లో ప్రారంభం అయినా.. నిర్మాణం పూర్తి చేసుకొని విడుదల అవ్వడానికి టైం పట్టే అవకాశం ఉంది.