Begin typing your search above and press return to search.

​రాజకీయ నాయకులే మన హీరోలు

By:  Tupaki Desk   |   15 July 2017 5:30 PM GMT
​రాజకీయ నాయకులే మన హీరోలు
X
తెలుగు సినిమా ఎప్పటికప్పుడు మన హీరోని కొత్తగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఒక టైమ్ లో మన హీరో చదువుకోవడానికి చాలా కష్టపడి డిగ్రీ సంపాదించి ఊరికి ఏదో ఉపకారం చేస్తాడు. అలా ఇంకా కాస్త ముందు వచ్చేస్తే మన హీరో ఒక కుటంబాన్ని కాపాడే కొడుకులా మారిపోయాడు, ఇంకా ముందుకు వస్తే మన హీరో ఒక ప్రేమికుడుగా అతని జీవిత గమ్యం కూడా అదే అన్నంతాగా కనిపిస్తాడు. అలా మనం ఇప్పటి సినిమాలకు వచ్చినట్లు అయితే హీరో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అతను ఒక నాయకుడు అతనే అక్కడ అధినేత, ప్రశ్ననించే మనిషి - పోరాడే మనిషి అవసరమైతే పాలించేవాడు కూడాను.

ఒకప్పుడు హీరోలు విలన్లకు ఎదురు నిలిచి మంచి కోసం పోరాడేవారు. ఇప్పుడు మనోళ్ళు ఆ చెడు లోనే ఉంటూ మంచి కోసం పోరాడుతున్నాడు. మన హీరోలు ఇప్పుడు రాజకీయ కథలు చుట్టూ భ్రమణం చేస్తున్నారు. కొన్నేళ్ళ కిందట ఒక మీడియా జోర్నలిస్ట్ సి‌ఎం ఇంటర్వ్యూలో సవాలు విసిరి అతనే ఒక సవాలుకి బదులు చెప్పే పరిస్థితి వస్తుంది. అదే శంకర్ ఒకేఒక్కడు సినిమా. సమాజంలో అవినీతి ఎక్కడ ఉంది అంటే అందరూ కళ్లుమూసుకొని తడుముకోకుండా చూపేది, తడబడకుండా చెప్పేది రాజకీయమే. కాబట్టి అటువంటి వ్యవస్థ గురించి ఎన్ని కథలైన చెప్పవచ్చు ఎంత అరాచకమైన చూపించవచ్చు. అటువంటి క్లిష్ట పరిస్థితిలలో మన హీరో వాటి పై పోరాడితే మనకు వచ్చే కిక్ చాలా బాగుంటుంది కదా. అందుకే ఇప్పుడు వస్తున్న సినిమాలు - రాబోతున్న సినిమాలు అన్నీ మన రాజకీయం చుట్టూనే తిరుగుతుంది.

ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మహేశ్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్ సి‌ఎం గా కనిపించబోతున్నాడు. మహేశ్ ఇప్పటికే రాజకీయ గెటప్ లో కనిపించి అదరగొట్టాడు. ‘దూకుడు’ సినిమాలో వేసిన పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే మరో యంగ్ హీరో రానా అయితే తన మొదటి సినిమా ‘లీడర్’ లో సి‌ఎం గా చేశాడు. ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి లో కూడా పొలిటీషియన్ గానే కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ లో కూడా జై అనే పాత్ర రాజకీయ నాయకుడు పాత్రలోనే ఉండబోతుందని టాక్. ఇంకా నందమూరి బాలకృష్ణ కూడా ఒక పొలిటికల్‌ కథతో రాబోతున్నాడు అని తెలుస్తోంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగబోతోందట. మరో హీరో కల్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంఎల్ ఏ’ సినిమాలో ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి లా కనిపిస్తూనే ఒక శాసనసభ్యుడిగా మారుతాడు అని చెప్పుకుంటున్నారు. ఇంకా పోతే మంచు విష్ణు కూడా ఓటు విలువ ఏంటో చెప్పడానికి ‘ఓటర్’ సినిమాతో రాబోతున్నాడు.

ఇలా మన హీరోలు రాజకీయ నాయకులు అవతారంలో కనిపించి హిట్లు కొట్టేపనిలో పడ్డారు. ఒకప్పుడు మన హీరో ఒక పౌరుడు గా ఉంటూ సమాజపు కుళ్ళును కడిగే పనిలో ఉంటే ఇప్పుడు అదే పని పవర్లో ఉండి చేస్తే మరింత హిట్ అవుతుంది అని టేబుల్ కు అవతలి వైపు వెళ్ళి ఆట మొదలుపెట్టారులే మనోళ్లు!!