Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ హీరోలు.. పీఆర్ స్ట్రాటజీలు..!

By:  Tupaki Desk   |   15 Nov 2022 3:30 AM GMT
టాలీవుడ్ స్టార్ హీరోలు.. పీఆర్ స్ట్రాటజీలు..!
X
టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరికీ డిజిటల్ టీమ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ.. ఇప్పుడు తమని తాము ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నారు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ నెట్టింట ట్రెండింగ్ లో ఉంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారు. సామాజిక మాధ్యమాలలో ఖాతాలు ఓపెన్ చేసినప్పటి నుంచీ రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు. తన సినిమాలకి ప్రచారం చేసుకోవడమే కాదు.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కూడా పంచుకుంటూ వస్తున్నారు.

మహేశ్ తో పాటుగా ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మరియు ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ - సితార ఘట్టమనేనిలకు కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం మహేశ్ టీమ్ తరచుగా వారికి సంబంధించిన ఫొటోలను వీడియోలను ఇంటర్నెట్ లో వార్తల్లో ఉండేలా చూడటమే అని చెప్పాలి.

మహేశ్ బాబు ఫోటో షూట్స్ తో పాటుగా తన ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వాటిని అభిమానులు తమ గ్రూపుల్లో షేర్ చేస్తూంటారు. ఇక అగ్ర హీరో తన ఫాలోయింగ్ తో అధిక సంఖ్యలో బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ను పొందుతుంటారు. ఇవి సినిమాలు లేకున్నా నిరంతరం మహేశ్ గురించి నెట్టింట మాట్లాడుకునేలా చేస్తున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పీఆర్ విషయంలో మహేశ్ బాబును ఫాలో అవుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. సోషల్ మీడియాలో ఎపుడూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ దూకుడుగా వెళ్తున్నారు.

బన్నీతో పాటుగా ఆయన సతీమణి అల్లు స్నేహా రెడ్డికి కూడా సోషల్ మీడియాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అలానే వారి పిల్లలు అల్లు అయాన్ - అర్హ కూడా తమ క్యూట్ వీడియోలు ఫోటోలతో సందడి చేస్తుంటారు. స్నేహా రెడ్డి ఇటీవల కాలంలో తన ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన యాక్టివిటీతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల బన్నీ దంపతులు హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆ ఫోటోలు నెట్టింట షేర్ అయ్యాయి.

RRR సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిలో పడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడు సరైన పీఆర్ స్ట్రాటజీతో వెళ్తున్నారు. చాలా రిజర్వ్‌డ్‌ గా ఉండే చెర్రీ.. ఒకప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా కనిపించేవారు కాదు. ఆయన భార్య ఉపాసన కొణిదెల ఖాతాల నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటాం.

అయితే RRR తర్వాత రామ్ చరణ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ అధిక సంఖ్యలో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ లపై సంతకం చేస్తున్నారు. రెగ్యులర్ గా చెర్రీ ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేయడం చూస్తున్నాం.

అంతేకాదు చరణ్ పర్సనల్ లైఫ్ అప్ డేట్స్ కూడా తరచూ వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా హాలిడేకి బయటకు వెళ్లినప్పుడల్లా వెంటనే ఆ ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇటీవల ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్ళినా.. లేటెస్టుగా అక్షయ్ కుమార్ తో కలిసి లీడర్‌ షిప్ సమ్మిట్‌ కు హాజరైనా అవి నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా చర్చీయాంశంగా మారుతున్నాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించరు. ఎప్పుడో సినిమాల రిలీజులప్పుడు.. ఏదైనా ఫంక్షన్ కు హజరైనప్పుడు మాత్రమే వార్తల్లో నిలుస్తుంటారు. RRR చిత్రంతో అంతర్జాతీయ ప్రశంసలు దక్కిన తర్వాత.. తారక్ సైతం తన రూట్ మార్చారు. జపాన్ లో తన ట్రెండీ ఫోటో షూట్స్.. అక్కడ లభించిన ఆదరణ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు వచ్చాయి.

ఇటీవల తన అల్ట్రా స్టైలిష్ లుక్ ని షేర్ చేయడం ద్వారా తారక్ సోషల్ మీడియాని షేక్ చేశారు. అలానే ప్రస్తుతం పలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌స్ కు స్టార్ హీరో సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు ఆయన భార్యా పిల్లల ఫోటోలు కూడా దర్శనమిస్తున్నాయి. కాకపోతే మిగతా హీరోలతో పోల్చుకుంటే.. పీఆర్ విషయంలో జూనియర్ ఎన్టీ రామారావు కాస్త వెనకున్నారని చెప్పాలి.

సినిమాలు చేయకున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. పొలిటికల్ టూర్ కి వెళ్ళినా.. పీఆర్ టీమ్ షేర్ చేసే అక్కడి వీడియో క్లిప్పింగ్స్ - ఫోటోలు సోషల్ హల్ చల్ చేస్తుంటాయి. ఇక ఈ విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా వెనకే ఉన్నారు. సోషల్ మీడియాలో అతనికి ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా ఉంది కానీ.. డార్లింగ్ పెద్దగా తన అప్డేట్స్ ను షేర్ చేయరు. అప్పుడప్పుడు సినిమాలకి సంబంధించిన విషయాలను మాత్రమే పంచుకుంటూ ఉంటారు.

ఏదేమైనా పీఆర్ స్ట్రాటజీలు స్టార్స్ ని నిత్యం జనాల్లో ఉంచడానికి సహాయం చేస్తాయి. సినిమాలతో సంబంధం లేకుండా తమ యాక్టివిటీతో వార్తల్లో నిలుపుతాయి. నిరంతరం అభిమానులకు టచ్ లో ఉండేలా చేస్తాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.