Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు అక్కడైనా కలిసొస్తుందా..?

By:  Tupaki Desk   |   2 Nov 2022 5:36 AM GMT
దిల్ రాజుకు అక్కడైనా కలిసొస్తుందా..?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు.. డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గానూ రాణిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన తొలి సినిమా 'దిల్' నే ఇంటి పేరుగా మార్చుకున్న అగ్ర నిర్మాత.. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ తెలుగు సినిమాలనే నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు ఇతర ఇండస్ట్రీల మీద దృష్టి సారిస్తున్నారు.

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించారు దిల్ రాజు. ఓవైపు చిన్న మీడియం రేంజ్ చిత్రాలు చేస్తూనే.. మరోవైపు కాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి పెద్ద సినిమాలను రూపొందించారు. ఈ క్రమంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ - సూపర్ హిట్స్ - హిట్స్ అందుకున్నాడు.. అలానే ప్లాప్స్ కూడా చవిచూశారు. అయితే ఇటీవల కాలంలో అగ్ర నిర్మాత నిర్మించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఆయన.. 'దిల్ రాజు ప్రొడక్షన్స్' పేరుతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'జెర్సీ' సినిమాని అల్లు అరవింద్ - నాగవంశీలతో కలిసి హిందీలో రీమేక్ చేసారు దిల్ రాజు. షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోతో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దీంతో నిర్మాత ఎంట్రీ సక్సెస్ ఫుల్ గా సాగలేదు.

ఈ నేపథ్యంలో తెలుగులో సక్సెస్ అయిన 'హిట్' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసారు దిల్ రాజు. రాజ్ కుమార్ రావ్ - సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. బాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న దిల్ రాజుకు రెండు రీమేక్ సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు ఎస్వీసీ బ్యానర్ లో వచ్చిన ఇటీవలి తెలుగు చిత్రాలు కూడా ఆయనకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు ఇప్పుడు కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్స్ చేసుకున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ తో ''వారసుడు'' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. 2023 సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'వారసుడు' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. తెలుగు రైట్స్ మినహాయించి మిగతా మొత్తం హక్కులు ఇప్పటికే 250 కోట్లకు చేరుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. విజయ్ కోసం భారీ బడ్జెట్ పెట్టుబడిగా పెట్టిన నిర్మాత దిల్ రాజు.. ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసారని అంటున్నారు.

ఇక 'వారసుడు' చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు సొంతంగా విడుదల చేస్తారని టాక్. ఇది విజయ్ కు తెలుగులో అతి పెద్ద రిలీజ్ అవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా రెండు భాషల్లో క్లిక్ అయితే నిర్మాతకు దిమ్మతిరిగే లాభాలు ఖాయమని అంటున్నారు. మరి హిందీలో సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇవ్వలేకపోయిన దిల్ రాజు.. తమిళ సినిమాతో కోలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.

'వారసుడు' సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 11న లేదా 13న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్ లో RC15 వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోంది. ఇది SVC సంస్థ నిర్మించే 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా రూపొందిస్తున్నారని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.