Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా డ్రీమ్స్..!

By:  Tupaki Desk   |   7 May 2022 12:30 AM GMT
టాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా డ్రీమ్స్..!
X
ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ మరియు ఫిలిం మేకర్స్ అంతా పాన్ ఇండియా మీద దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు ఎంత మంచి తెలుగు సినిమా చేసినా.. దాన్ని రీజనల్ ఫిలింగానే చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమాలకు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతోంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్స్ నటించిన హిందీ చిత్రాలు సైతం మన చిత్రాల ముందు నిలవలేకపోతున్నాయి. దీంతో ఇప్పుడు తెలుగు సినిమా అంటే పాన్ ఇండియా మూవీ అనే విధంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. క్రేజ్ - ఇమేజ్ - స్టార్ డమ్ తో సంబంధం లేకుండా బహుభాషా చిత్రాలను చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ప్రతీ హీరో తమ చిత్రాలను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేసి.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో తమ మార్కెట్ ని ఇతర ఇండస్ట్రీలలో విస్తరించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రతీ టాలీవుడ్ హీరో ఫైనల్ డెస్టినేషన్ 'పాన్ ఇండియా' అనే చెప్పాలి.

నిజానికి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి 'బాహుబలి: ది బిగినింగ్' మరియు 'బాహుబలి: ది కన్ క్లూజన్' వంటి రెండు విజువల్ వండర్స్ ను తెరకెక్కించి పాన్ ఇండియాకు మార్గం సుగమం చేసారు. ఇప్పుడు సౌత్ స్టార్స్ మరియు ఫిలిం మేకర్స్ అందరూ అదే బాటలో నడుస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

'బాహుబలి' ప్రాంఛైజీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. ఇటీవల 'రాధేశ్యామ్' సినిమా ప్లాప్ అయినా.. డార్లింగ్ స్టార్‌డమ్‌ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ భారీ పాన్ ఇండియా చిత్రాలే. వాటిల్లో 'ఆదిపురుష్' 'సలార్' సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీని తర్వాత పాన్ వరల్డ్ మూవీ 'ప్రాజెక్ట్ K' మరియు 'స్పిరిట్' వంటి భారీ చిత్రాలు రానున్నాయి.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్.. 'పుష్ప: ది రైజ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా.. నార్త్ బెల్ట్ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో పుష్పరాజ్ గా బన్నీ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. అతని మేనరిజం - డైలాగ్స్ అందరినీ ఆకట్టుకునన్నాయి. దీంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ పెర్ఫార్మన్స్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో ఇప్పుడు వీరిద్దరూ ఆ ఇమేజ్ ని కాపాడుకునేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో #RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో చెర్రీ చేయనున్న RC16 అనే బహు బాషా చిత్రంలో నటించనున్నారు. ఇదే క్రమంలో మెగా వారసుడి నుంచి మరికొన్ని పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

RRR సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న NTR30 చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. మే 20న ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించబడతాయి. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో NTR31 మూవీ చేయనున్నారు. అలానే బుచ్చిబాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో తారక్ పాన్ ఇండియా చిత్రాలు లైన్ లో పెట్టారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సైతం పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ పై కన్నేశారు. తెలుగులో క్రేజ్ ఏర్పరచుకున్న VD.. ఇప్పుడు 'లైగర్' మూవీతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ 2022 ఆగస్ట్ 25న విడుదల కానుంది. ఇక విజయ్ ప్రస్తుతం నటిస్తున్న 'జనగణమన' మరియు శివ నిర్వాణ చిత్రాలను కూడా తెలుగు - హిందీతో పాటుగా ఇతర ప్రధాన భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

ఇన్నాళ్ళూ తెలుగుకే పరిచయమైన మాస్ మహారాజా రవితేజ.. 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'శ్యామ్ సింగరాయ్' చిత్రాన్ని పాన్ సౌత్ ఇండియాగా రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు 'దసరా' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ కన్నడ బాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో బంగపడ్డ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 'హరి హర వీరమల్లు' చిత్రంతో మళ్లీ పాన్ ఇండియాను టార్గెట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకూ పాన్ ఇండియాకు దూరంగా ఉంటూ వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం త్వరలో ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. రాజమౌళితో చేసే సినిమాతో పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నటిస్తున్న 'డెవిల్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అలానే సందీప్ కిషన్ 'మైఖేల్' సినిమాతో.. నిఖిల్ 'స్పై' సినిమాలతో పాన్ ఇండియాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. యూత్ కింగ్ అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ ను ఇతర భాషల్లోనూ డబ్ చేయనున్నారని టాక్.

ఇలా చాలా మంది టాలీవుడ్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకోడానికి ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరి పాన్ ఇండియా డ్రీమ్స్ నెరవేరుతాయో.. ఎవరెవరు పాన్ ఇండియా స్టార్డమ్ ని నిలబెట్టుకుంటారో చూడాలి.