Begin typing your search above and press return to search.

సిరివెన్నెలకి టాలీవుడ్ నివాళి: ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది

By:  Tupaki Desk   |   1 Dec 2021 9:49 AM GMT
సిరివెన్నెలకి టాలీవుడ్ నివాళి: ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది
X
తేనెకంటె తీయనైనది సిరివెన్నెల పాట .. మల్లెను మించిన పరిమాళాన్ని వెదజల్లేది సిరివెన్నెల పాట. అలాంటి సిరివెన్నెల అమృత గుళికల వంటి పాటలను అభిమానులకు అందించి, స్వర్గసీమ దిశగా సాగిపోయారు. ఆయన మరణం ఎంతోమంది అభిమానులతో కన్నీళ్లు పెట్టించింది. ఈ ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న ఆయన పార్ధీవ దేహాన్ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆయనతో తమకి గల అనుబంధాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ... "తెలుగు భాషకీ .. సాహిత్యానికి సిరివెన్నెల ఒక భూషణం వంటివారు. పుట్టిన నేలకి వన్నె తెచ్చినవారాయన. నాకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ఇద్దరం కలిసి ఎన్నో విషయాలను గురించి మాట్లాడుకునేవాళ్లం. అలాంటి ఆయన లేరంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వెంకటేశ్ మాట్లాడుతూ .. "సిరివెన్నెల గారు సాహిత్య రంగంలో ఒక లెజెండ్. 'స్వర్ణ కమలం' నుంచి 'నారప్ప' సినిమా వరకూ ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి పనిచేశాను. నాతో ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన లేరనే వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అన్నారు.

నాగార్జున మాట్లాడుతూ .. "సిరివెన్నెలతో నాకు ఎంతో కాలంగా మంచి స్నేహం ఉంది. ఆయన పేరు వినగానే నాకు 'తెలుసా మనసా' అనే పాటనే గుర్తుకు వస్తుంది. మంచి పాటలు రాసిన మంచి మనసున్న వ్యక్తి ఆయన. అలాంటి ఆయనను చిత్రపరిశ్రమ కోల్పోవడం దురదృష్టకరం" అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ .. " కొన్నిసార్లు మనసులో ఉన్న బాధను వ్యక్తపరచడానికి మాటలు రావు. సిరివెన్నెల ఎన్నో పాటలు రాశారు .. అవన్నీ కూడా భావితరాలవారికి ఆదర్శవంతంగా ఉంటాయి. ఆయన పాటలు .. బంగారు బాటలు. తెలుగు జాతి బ్రతుకున్నంత కాలం ఆయన పాటలు బ్రతికే ఉంటాయి. ఆయన పాటకు మరణం లేదు" అంటూ నివాళులు అర్పించారు.

మహేశ్ బాబు మాట్లాడుతూ .. "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లేకుండా తెలుగు పాట ఎలా ఉండబోతుందనేది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇంకా సిరివెన్నెల పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించినవారిలో, జగపతిబాబు .. శ్రీకాంత్ .. అల్లు అరవింద్ .. అల్లు అర్జున్ .. జీవిత రాజశేఖర్ .. మణిశర్మ .. పరుచూరి గోపాలకృష్ణ .. ఎస్వీ కృష్ణారెడ్డి .. భరణి .. రామజోగయ్య శాస్త్రి .. మారుతి ఉన్నారు.