Begin typing your search above and press return to search.
క్లైమ్యాక్స్ ని నిలబెట్టేవాళ్లు ఎవరు?!
By: Tupaki Desk | 6 Dec 2015 4:42 AM GMT2015 ఆరంభం అదిరింది. టెంపర్ - పటాస్ లాంటి సినిమాలు దుమ్మురేపాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తరహాలో మధ్యలో వచ్చిన బాహుబలి - శ్రీమంతుడులాంటి సినిమాలు వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీసును హోరెత్తించాయి. గోపాల గోపాల - సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని అందించాయి. అప్పుడప్పుడు చిన్న సినిమాలూ అద్భుతాలు సృష్టిస్తూ వచ్చాయి. ఇక ఇదే ఊపు యేడాది చివర్లో కూడా కొనసాగిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ గుర్తు పెట్టుకొని యేడాదిగా 2015 మిగిలిపోయేదే. అక్టోబరు - నవంబరు - డిసెంబరు మాసాలు సినిమాకి క్లైమాక్స్ లాంటివన్నమాట. ఆ సమయంలో వచ్చిన సినిమాలు బాగా ఆడితే ఆ ఉత్సాహం సంక్రాంతికి కూడా కొనసాగుతుంది. కానీ ఈసారి తెలుగు సినిమా క్లైమాక్స్ మాత్రం ఏమంత ఆశాజనంగా మొదలవ్వలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన బ్రూస్ లీ - అఖిల్ - సైజ్ జీరో - శంకరాభరణం లాంటి సినిమాలు బాక్సాఫీసుని ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. పరిశ్రమకి భారీగా నష్టాల్ని తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు క్లైమాక్స్ కి ఊపిరిపోయాల్సిన బాధ్యత ఈ నెలలో వచ్చే పెద్ద సినిమాలదే. రవితేజ బెంగాల్ టైగర్ - వరుణ్ తేజ్ లోఫర్ - గోపీచంద్ సౌఖ్యం - మోహన్ బాబు - నరేష్ లు మంచు మామ కంచు అల్లుడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాబోయే మూడు నాలుగు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే కీలకమైన సినిమాలు ఇవే. అంటే 2015 క్లైమాక్స్ ఈ సినిమాల చేతుల్లోనే ఉందన్నమాట. రాబోయే ఈసినిమాలన్నిటిపైనా ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి బజ్జే ఉంది. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో, బాక్సాఫీసు దగ్గర ఏ కథానాయకుడు విజేతగా నిలుస్తాడో, క్లైమాక్స్‌ని కళకళలాడించేదెవరో చూడాలి.