Begin typing your search above and press return to search.

అదృష్టాన్ని కోరి కాలదన్నుకుంటున్నాడు

By:  Tupaki Desk   |   10 April 2023 9:59 AM GMT
అదృష్టాన్ని కోరి కాలదన్నుకుంటున్నాడు
X
ఒక బ్యాగ్రౌండ్ లేని హీరో. తొలి చిత్రం థియేటర్లలోకి వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. పైగా అదేమీ మాస్ సినిమా కాదు. ఓటీటీలో వచ్చాక దాని గురించి కొంత చర్చ జరిగింది. అలా అని హీరోకేమీ పెద్దగా పేరు రాలేదు. ఆ హీరో రెండో సినిమాకు మాత్రం అనూహ్యంగా మంచి హైప్ వచ్చింది. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రోమోలు ఆకట్టుకున్నాయి. కొవిడ్ టైంలో సినిమాను రిలీజ్ చేస్తే తొలి రోజు హౌస్ ఫుల్ బోర్డులు పడిపోయాయి. సినిమాకు మంచి టాక్ ఏమీ రాలేదు.

అయినా సరే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఏ బ్యాగ్రౌండ్ లేని హీరో సినిమాకు వచ్చిన ఈ ఓపెనింగ్స్ చూసి ఇండస్ట్రీ జనాలు షాకయ్యారు. యూత్‌లో అతడి ఫాలోయింగ్ చూసి పెద్ద పెద్ద బేనర్లు అవకాశమిచ్చాయి. కానీ అతను ఉపయోగించుకుంటేనా? అనుకోకుండా వచ్చిన ఫాలోయింగ్‌ను సరైన సినిమాలు ఎంచుకోకపోవడం వల్ల తనే దెబ్బ తీసుకున్నట్లు అవుతోంది. ఇదంతా కిరణ్ అబ్బవరం గురించి ఇస్తున్న ఉపోద్ఘాతం అని అర్థమైపోయి ఉంటుంది.

'ఎస్ఆర్ కళ్యాణమండపం'తో మంచి హిట్ కొట్టిన ఈ యువ కథానాయకుడు.. కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటున్నట్లే ఉంది. కెరీర్ ఆరంభ:లో చేసిన సినిమాలతో అతడిని అభిమానించడం మొదలుపెట్టిన యూత్.. ఇప్పుడు అతడి మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు.

అవకాశాలు వస్తున్నాయి కదా అని జడ్జిమెంట్ లేకుండా ఏది పడితే అది ఓకే చేసేయడం అతడి కెరీర్‌ను గట్టి దెబ్బే తీసేలా ఉంది. గత ఏడాది సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని లాంటి సినిమాలు చూసి జనాలు షాకయ్యారు.

ఇవేం ఛాయిస్‌లు అనుకున్నారు. మధ్యలో గీతా ఆర్ట్స్ బేనర్లో చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' పర్వాలేదనిపించింది. కుర్రాడు గాడిన పడుతున్నాడులే అనుకుంటే.. తాజాగా వచ్చిన 'మీటర్' చూశాక ఆ భ్రమలన్నీ విడిపోయాయి.

ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయడం అంటే కిరణ్ జడ్జిమెంట్ పూర్తిగా దెబ్బ తిన్నట్లే. మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయిన ఈ సినిమాతో కిరణ్ మార్కెట్‌కు గట్టి దెబ్బే తగిలింది. ఇక అతడి కొత్త సినిమా 'రూల్స్ రంజన్'ను జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.