Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన టాప్-10 తెలుగు సినిమాలు..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 2:30 AM GMT
బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన టాప్-10 తెలుగు సినిమాలు..!
X
తెలుగు సినిమాల మార్కెట్ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. స్టార్ హీరోల రేంజ్ కు తగ్గట్టుగా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేయడానికి మేకర్స్ ముందుకు వస్తున్నారు. అదే స్థాయిలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే వాటిలో ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.

నాన్ థియేట్రికల్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అయినా.. అధిక రేట్లకు కొన్న బయ్యర్లకు నష్టాలు తప్పవు. టాలీవుడ్ లో తీవ్ర నష్టాలు తీసుకొచ్చిన చిత్రాల జాబితా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. 2022 మొదటి నాలుగు నెలల్లోనే రెండు భారీ ప్లాప్స్ రావడంతో.. నాలుగేళ్లుగా ఈ లిస్టులో టాప్ లో ఉన్న సినిమా కూడా కిందికి వచ్చింది. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తెలుగులో ఓవరాల్ గా డిజాస్టర్ అయిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

'రాధేశ్యామ్' : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటించిన ఈ పీరియాడికల్ లవ్ డ్రామా.. ప్రేక్షకులను నిరాశ పరిచింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా 202 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి.. 90 కోట్లకు పైగా నష్టాలను చవిచూసింది. దీంతో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

'ఆచార్య' : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఇది. మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 29న రిలీజైన ఈ సినిమా అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయింది. రూ. 132.50 కోట్ల టార్గెట్ తో బరిలో దిగి రూ. 45 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో రూ. 84.14 కోట్ల నష్టాలు చూసింది. చిరు కెరీర్ లో పెద్ద పరాజయంగా నిలిచింది. మొత్తంగా తెలుగులో రెండో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నెగిటివ్ రికార్డ్ సాధించింది.

'అజ్ఞాతవాసి' : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపొందిన సినిమా ఇది. అంతేకాదు పవన్ కెరీర్ లో సిల్వర్ జూబ్లీ మూవీ. హసినీ అండ్ హారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. 2018 సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం.. భారీ నష్టాలు మిగిల్చింది. దాదాపు 66 కోట్లు నష్టం తెచ్చిపెట్టింది. అప్పటికి టాలీవుడ్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'రాదేశ్యామ్' 'ఆచార్య' ఈ చిత్రాన్ని అధిగమించి టాప్ లో నిలిచాయి.

'స్పైడర్' : సూపర్ స్టార్ మహేష్ బాబు - తమిళ దర్శకుడు మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలతో 2017లో తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఫలితంగా 59 - 60 కోట్ల వరకూ నష్టాన్ని అందుకోవాల్సి వచ్చింది.

'సాహో' : 'బాహుబలి' తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ - టీ శిరీష్ సంయుక్తంగా నిర్మించాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి దాదాపు 52 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అయితే హిందీలో ఈ మూవీ వంద కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం.

'ఎన్టీఆర్ కథానాయకుడు' : స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్ గా ఆయన తనయుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. బాలయ్య స్వీయ నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 70.5 కోట్లకు అమ్మితే.. కేవలం 20.23 కోట్ల షేర్ మాత్రమే వసూళు చేసింది. ఫలితంగా 50.27 కోట్లు నష్టంతో డిజాస్టర్ గా మిగిలింది.

'ఎన్టీఆర్ - మహానాయకుడు' : ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగమిది. ఫస్ట్ పార్ట్ ప్లాప్ అవడంతో దీనికి రూ. 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. అయితే కేవలం రూ. 5 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో ఓవరాల్ గా రూ. 46 కోట్ల నష్టపోవాల్సి వచ్చింది. విబ్రి మీడియా - NBK ప్రొడక్షన్ - వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి.

'సైరా నరసింహా రెడ్డి' : మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా ఇది. అమితాబ్ బచ్చన్ - సుదీప్ - విజయ్ సేతుపతి - నయనతార - తమన్నా వంటి స్టార్ క్యాస్ట్ ఇందులో భాగమయ్యారు. రామ్ చరణ్ హోమ్ బ్యానర్ లో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. రూ. 187.25 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా.. రూ. 143.80 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో రూ. 43.45 కోట్లు నష్టపోయారు.

అలానే మహేష్ బాబు - సుకుమార్ కాంబోలో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా వల్ల 42 కోట్లు నష్టం వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ చేసిన 'బ్రహ్మోత్సవం' మూవీ 38 కోట్లు నష్టం తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీ 37 కోట్ల నష్టాలు చవిచూసింది. మరి రాబోయే రోజుల్లో డిజాస్టర్స్ జాబితాలోకి ఏయే సినిమాలు వస్తాయో చూడాలి.