Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: 2022 స్టార్ హీరోకి ఒక పీడ‌క‌ల

By:  Tupaki Desk   |   31 Dec 2022 4:28 AM GMT
టాప్ స్టోరి: 2022 స్టార్ హీరోకి ఒక పీడ‌క‌ల
X
2022 ముగింపు కూడా బాలీవుడ్ కి ఏమాత్రం క‌లిసి రాలేదు. తోపులం అని చెప్పుకునే స్టార్ హీరోలు వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌తో డైల‌మాలో ప‌డిపోయారు. ముఖ్యంగా దివంగ‌త హీరో.. ప‌రిశ్ర‌మ ఔట్ సైడ‌ర్ సుశాంత్ సింగ్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున థ్రెట్ ని ఎదుర్కొన్న‌ బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ పై వ‌ర‌స పంచ్ లు కోలుకోలేనివి అన‌డంలో అతిశ‌యోక్తి కాదు. నెపోటిజాన్ని ప్రోత్స‌హించే క‌ర‌ణ్ జోహార్- భ‌న్సాలీ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ల‌తో అత‌డి సాన్నిహిత్యం.. #బోయ్ కాట్ మాఫియా ట్యాగ్ కి దారి తీసింది. కార‌ణం ఏదైనా ర‌ణ‌వీర్ సింగ్ న‌టించిన సినిమాల‌కు వ్య‌తిరేక క్యాంపెయినింగ్ బ‌లంగా ప‌ని చేసింద‌ని ప్ర‌ముఖ బాలీవుడ్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.

నిజానికి ర‌ణ‌వీర్ ఎన‌ర్జీ లెవ‌ల్... స్టార్ డ‌మ్ .. విల‌క్ష‌ణ క‌థల ఎంపిక‌లు.. ఇవేవీ అత‌డిని ఈ ఏడాది కాపాడ‌లేక‌పోయాయి. కంటెంట్ ఎంపిక‌లు బావున్నా కానీ దుర‌దృష్టం రాంగ్ టైమింగ్ అత‌డిని వెంటాడాయ‌ని విశ్లేషిస్తున్నారు. పైగా త‌న స్టార్ వైఫ్ దీపికా ప‌దుకొణే నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న 83 (క‌పిల్ దేవ్ బ‌యోపిక్.. 1983 వ‌రల్డ్ క‌ప్ విజ‌యంపై) మూవీ ప‌రాజ‌యం అత‌డిని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. జ‌యేష్ భాయ్ జోర్ధార్ స‌హా ఇయ‌ర్ ఎండ్ లో విడుద‌లైన స‌ర్క‌స్ తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. అందుకే 2022 ర‌ణ‌వీర్ కి ఒక పీడ‌క‌ల అంటే అతిశ‌యోక్తి కాదు! ఇది అత‌డికి బ్యాడ్ ఇయ‌ర్ గా న‌మోదైంది.

సంవ‌త్స‌రాంతంలో రిలీజైన స‌ర్క‌స్ పై ర‌ణ‌వీర్ చాలా ఆశ‌లే పెట్టుకున్నా ఫ‌లితం తారుమారైంది. రోహిత్ శెట్టి తో కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ 'స‌ర్క‌స్' వీక్షకులను ఆక‌ట్టుకోవ‌డంలో విఫలమైంది. బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారంలో కేవలం 29.25 కోట్ల నికర ఆదాయాన్ని మాత్రమే సంపాదించగలిగింది. సర్కస్ లో రణవీర్ సింగ్ -వరుణ్ శర్మ ద్విపాత్రాభినయం చేసినా అది ఆడియెన్ కి ఏమాత్రం క‌నెక్ట‌వ్వ‌లేదు.

క్రిస్మస్ వారాంతంలో విడుదలైన ర‌ణ‌వీర్- రోహిత్ శెట్టి చిత్రం తొలిరోజు రూ.6.50 కోట్ల నికర వసూళ్లు చేసింది. శనివారం రూ. 6.25 కోట్లు.. ఆదివారం రూ 8 కోట్లు క‌లుపుకుని మూడు రోజుల్లో 30 కోట్ల లోపు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గ‌లిగింది. ఇప్ప‌టికే తొలి వారం క‌లెక్ష‌న్స్ లో దారుణ‌మైన‌ డ్రాప్స్ క‌నిపించాయి. స‌మీక్ష‌లు పూర్తి నెగెటివ్ గా రాయ‌డ‌మే గాక‌ ఇది చెత్త‌ సినిమాగా క్రిటిక్స్ తేల్చేశారు. ఈ మూవీ క‌లెక్ష‌న్స్ ఎంత‌గా దిగజారాయంటే.. కేవ‌లం వారం రోజులలో సంఖ్య తగ్గుతూ గురువారం నాటికి రూ.1.75 కోట్ల నికర ఆదాయానికి ప‌డిపోయింది. ఇది రెండో వారాంతం వరకూ ఆడితే కేవ‌లం రూ.40 కోట్లకు చేరుకోవడం కూడా కష్టమవుతుందని 200 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి ఇవి ఘోర‌మైన అంకెలు అని ట్రేడ్ విశ్లేషిస్తోంది. హాలీవుడ్ సైన్స్-ఫిల్మ్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ నుండి పోటీని త‌ట్టుకోలేక 'స‌ర్క‌స్' పూర్తిగా చ‌తికిల‌బ‌డింద‌ని విశ్లేషించారు.

బాక్స్ ఆఫీస్ ఇండియా క‌థ‌నం ప్రకారం సర్కస్ వ‌ల్ల పంపిణీ వ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌వు. శాటిలైట్ - డిజిటల్.. మ్యూజిక్ రైట్స్ ద్వారా దాదాపు రూ.135 కోట్లను భ‌ర్తీ చేసారు. దీనివ‌ల్ల నిర్మాత సేఫ్ కానీ పంపిణీదారులు బ‌య్య‌ర్ల‌కు భారీ మొత్తాల‌కు రైట్స్ ని అమ్మ‌డంతో అంద‌రూ బుక్క‌య్యార‌ని ర‌ణ‌వీర్ చిత్రంతో 100 కోట్లు పైగా న‌ష్టాలు అనుభ‌వించాల్సి ఉంటుంద‌ని విమ‌ర్శిస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులు విమర్శకుల నుండి కూడా పేలవమైన సమీక్షలను అందుకోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద‌ పూర్తిగా డీలా ప‌డిపోయింది.

సర్కస్ తో పాటు రణవీర్ న‌టించిన‌ చివరి రెండు చిత్రాలు 83 (2021) -జయేష్ భాయ్ జోర్దార్ (2022) బాక్సాఫీస్ వద్ద పెద్ద ఫ్లాపుల‌య్యాయి. 83 గ‌త ఏడాది చివ‌రిలో విడుద‌లై 2022 జ‌న‌వ‌రిలోను థియేట‌ర్ల‌లో కొన‌సాగింది. కానీ ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన‌ ఈ మూవీ ఫెయిల్యూర్ తో 100 కోట్లు అంత‌కుమించి బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌లేద‌ని విశ్లేషించారు. జ‌యేష్ భాయ్ జోర్ధార్ తోను అంతే ఇదిగా పంపిణీ వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయ‌న్న‌ది బాలీవుడ్ ట్రేడ్ విశ్లేష‌ణ‌.

ప్ర‌స్తుతం కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అలియా భట్ సరసన ర‌ణ‌వీర్ నటిస్తున్నాడు. ధర్మేంద్ర- జయా బచ్చన్ -షబానా అజ్మీ త‌దిత‌రులు న‌టిస్తున్న‌ ప్రేమకథా చిత్రం 28 ఏప్రిల్ 2023న థియేటర్లలో విడుదల కానుంది. ఇది మణిరత్నం మల్టీ-స్టారర్ పొన్నియన్ సెల్వన్ 2తో బిగ్ ఫైట్ కి దిగుతుంది.

ఏది ఏమైనా కాలం మారుతూ ఉంటుంది. ఫేజ్ మారే కొద్దీ స‌క్సెస్ ని కాపాడుకోవ‌డంలో ఎలాంటి హీరోకి అయినా త‌డ‌బాటు త‌ప్ప‌దు. ఇప్పుడు ర‌ణ‌వీర్ అలాంటి ఒక బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడ‌ని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇన్ సైడర్.. ఔట్ సైడ‌ర్ క్యాంపెయిన్ లు ర‌ణ‌వీర్ పై తీవ్రంగా ప్ర‌భావం చూపాయ‌న్న‌ది ఒక సెక్ష‌న్ విశ్లేష‌ణ‌. కెరీర్ ప‌రంగా సుశాంత్ సింగ్ అవ‌కాశాల‌న్నీ ర‌ణవీర్ లాక్కున్నాడని అత‌డి అభిమానులు క‌క్ష కట్టి హ్యాష్ ట్యాగుల‌ను వైర‌ల్ చేశారు. దీని ప్ర‌భావం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ఇక సుశాంత్ సింగ్ అనూహ్య‌ ఆత్మ‌హ‌త్య‌తో హీరో ర‌ణ‌వీర్ సీన్ మారింద‌ని ఒక సెక్ష‌న్ విశ్లేషిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోల బాక్సాఫీస్ పై యాంటీ నెపోటిజం క్యాంపెయిన్ పాత్ర బ‌లంగా ఉంద‌ని ఇటీవ‌ల చ‌ర్చ సాగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.