Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి!

By:  Tupaki Desk   |   11 Dec 2019 12:21 PM GMT
ట్రైలర్ టాక్: రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి!
X
తమిళ హీరో కార్తి.. జ్యోతిక తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'దొంగ'. రియల్ లైఫ్ లో వదిన-మరిది అయిన వీరిద్దరూ 'దొంగ' లో రీల్ అక్క-తమ్ముడు పాత్రల్లో నటిస్తున్నారు. 'దృశ్యం' ఫేమ్ జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. 'దొంగ' ట్రైలర్ ఈమధ్యే రిలీజ్ అయింది.

సత్యరాజ్ - సీత దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒకరు జ్యోతిక.. మరో అబ్బాయి శర్వా కూడా ఉంటాడు. అయితే ఆ కొడుకు చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. 15 ఏళ్లు అవుతుంది. జ్యోతిక కూడా తన తమ్ముడిని తలుచుకుంటూనే ఉంటుంది. 15 ఏళ్ళ తర్వాత ఆ శర్వా నేనేనంటూ కార్తి వస్తాడు. ఇతడేమో ఒక దొంగ. చాలా డేంజరస్.. పెద్ద ఫ్రాడ్. మరి నిజంగా ఇతను సత్యరాజ్ కొడుకేనా.. జ్యోతిక తమ్ముడేనా అనేది తెలియదు. కార్తి ఒక సీన్ లో అద్దం ముందు స్వగతం మాట్లాడుతూ "ఎలా ఉందిరా పర్ఫామెన్సు? న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి. ఎవరెవరినో పెడుతున్నారు" అంటూ తమిళ యాసతో కూడిన తెలుగులో ఫన్నీ పంచ్ వేస్తాడు. ఈ దొంగను తెలివైన అక్క జ్యోతిక నమ్మదు.. "15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయి ఇప్పుడు సడెన్ గా వచ్చి నేనే తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటావా" అంటూ సతాయిస్తుంటుంది.

టీజర్ చూస్తుంటే యాక్షన్.. సెంటిమెంట్.. కామెడీ... అన్నీ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలో ఉంది. కార్తి-జ్యోతిక అక్క తమ్ముడు కాంబినేషన్.. సత్యరాజ్ లాంటి నటుడు.. సినిమాకు ప్లస్ గా కనిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉంటుందో తర్వాత తెలుస్తుంది కానీ అంతలోపు ఈ తమిళం దొంగ ట్రైలర్ ను చూసేయండి.