Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఎమోషనల్ టైమ్ ట్రావెల్ మూవీగా 'ఒకే ఒక జీవితం'

By:  Tupaki Desk   |   2 Sep 2022 7:45 AM GMT
ట్రైలర్ టాక్: ఎమోషనల్ టైమ్ ట్రావెల్ మూవీగా ఒకే ఒక జీవితం
X
ప్రామిసింగ్ హీరో శర్వానంద్ డిఫరెంట్ జోనర్‌లలో సినిమాలు చేయడంలో తన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు తన మైలురాయి 30వ చిత్రం ''ఒకే ఒక జీవితం'' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ బైలింగ్విల్ మూవీతో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

'ఒకే ఒక జీవితం' అనేది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాధారణంగా ఇలాంటి సినిమాలు విలక్షణమైన కథాంశాలను కలిగి ఉంటాయి. అయితే ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ కూడా వుండటం ప్రత్యేకత. తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ ను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.

'ఒకే ఒక జీవితం' సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను తెలుగు - తమిళ భాషలలో విడుదల చేసారు.

ట్రైలర్ లోకి వెళ్తే.. మ్యూజిక్ కాంపిటీషన్ లో తదుపరి రౌండ్ కు చేరుకున్న యువ సంగీతకారుడిగా శర్వానంద్ ను పరిచయం చేస్తోంది. కానీ అతనికి సపోర్ట్ గా ఉత్సాహాన్ని అందించే వ్యక్తి అతనితో లేరని దానిపై ఫోకస్ చేయలేకపోతున్నాడు. అతనికి తోడుగా ప్రేయసి (రీతూ వర్మ) ఉన్నప్పటికీ.. ఒంటరిగా ఉన్నాననే భావనలో అసమర్థంగా భావిస్తాడు.

ఇలాంటి పరిస్థితులలో, అతను కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లిని కలుసుకునే అవకాశాన్ని పొందుతాడు. ఒక సైంటిస్ట్ (నాజర్) కనుగొన్న టైమ్ మెషీన్‌ సహాయంతో.. విధిని మార్చడానికి అతనికి రెండవ అవకాశం లభిస్తుంది. అతని గతం చాలా ఉద్వేగభరితమైనదని.. విషాదకరమైనదని తెలుస్తోంది.

ఇందులో శర్వా తో పాటుగా వెన్నెల కిషోర్ - ప్రియదర్శికి గతంలో సమస్యలు ఉన్నాయి. వీరు ముగ్గురూ బాల్యంలోకి వెళ్లి ఈ రెండో అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నాడనేది కథలో కీలకాంశం. ఔత్సాహిక సంగీతకారుడిగా శర్వా తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.

శర్వా తల్లిగా అమల అక్కినేని అద్భుతంగా నటించింది. వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్‌లో చాలా బాగా నటించారు. రీతూ వర్మ తన పాత్రను సమర్ధవంతంగా పోషించింది. కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ తొలి సినిమాకే కంటెంట్‌ తో కూడిన కాన్సెప్ట్‌ ను ఎంచుకున్నాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో అతను అన్ని రకాల భావోద్వేగాలను సరిగ్గా బ్యాలెన్స్ చేసాడు.

ఈ ట్రైలర్ సినిమా కథాంశాన్ని, భావోద్వేగ సంఘర్షణను తెలియజేస్తుంది. ఇందులో నేపథ్య సంగీతం మరియు విజువల్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంది. మొత్తం మీద ఈ ఎమోషనల్ టైం ట్రావెల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించారు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో డైలాగ్స్ రాయగా.. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఎన్ సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

'ఒకే ఒక జీవితం' చిత్రాన్ని సెప్టెంబర్ 9వ తేదీన తెలుగు తమిళ భాషల్లో గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. తమిళ్ లో 'కణం' అనే పేరుతో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.