Begin typing your search above and press return to search.

సైరా చూసిన ఆరుగురు ఎస్ ఐలపై బదిలీ వేటు

By:  Tupaki Desk   |   2 Oct 2019 11:58 AM GMT
సైరా చూసిన ఆరుగురు ఎస్ ఐలపై బదిలీ వేటు
X
సైరా సినిమా చూసిన కారణంగా ఆరుగురు ఎస్ఐలపై బదిలీకి గురి కావటం కలకలం రేపుతోంది. అందరిలానే చిరు సినిమా తొలి షోను చూడాలనుకోవటం తప్పేం కాదుగా? ఆ మాత్రానికే బదిలీ వేటు వేస్తారా? పోలీసులు మాత్రం మనుషులు కాదా? వారికి అభిమానం ఉండదా? అందునా.. సీమ స్వాతంత్య్ర చరిత్రను చెప్పే సైరా సినిమా చూస్తే.. పాపం చేసినట్లా? అన్న ఆగ్రహం అక్కర్లేదు.

ఎందుకంటే.. దీనికి కారణం వేరే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సైరాను మొదటి షోను చూడాలన్న ఉత్సాహం చిరు అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందులోకి సైరా లాంటి ప్రిస్టేజియస్ ప్రాజెక్టును బెనిఫిట్ షోను చూసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి.

ఇదే.. కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో ఆరుగురు ఎస్ఐలు సైరా బెనిఫిట్ షోను చూసేశారు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వారిపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు? అరే.. పోలీసులు సినిమాలు చూడకూడదన్న డౌట్ అక్కర్లేదు. ఎంచక్కా చూడొచ్చు. కానీ.. డ్యూటీలో ఉన్నప్పుడు.. పని చేయటం వదిలేసి సినిమా చూడటంతో ఆరుగురు ఎస్ ఐలపై చర్యలు తీసుకున్నారు కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప.
విధుల పట్ల నిర్లక్ష్యం ఏమిటన్న ఆగ్రహానికి గురైన ఆయన.. సైరా బెనిఫిట్ షో చూసిన ఆరుగురు ఎస్ ఐలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వారిని వీఆర్ కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అభిమానం ఉండటం తప్పు కాదు.

సినిమాను బెనిఫిట్ షోను చూడటం అసలే తప్పు కాదు. కానీ.. డ్యూటీని వదిలేసి మరీ సినిమా చూడటమే అసలు తప్పు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విధులు పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే తిప్పలు తప్పవు మరి.