Begin typing your search above and press return to search.

ఈ ట్రూజెట్ గోలేంది చెర్రీ..?

By:  Tupaki Desk   |   9 Oct 2015 11:43 AM GMT
ఈ ట్రూజెట్ గోలేంది చెర్రీ..?
X
ఒక ప్రముఖ సెలబ్రిటీ ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు.. ఆతనికుండే ఇమేజ్..సదరు బ్రాండ్ కు చాలానే సాయం చేస్తుంది. మిగిలిన బ్రాండ్లకు ఆ స్థాయి ఇమేజ్ కి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ.. సెలబ్రిటీ స్టార్ట్ చేసే బిజినెస్ కు అలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే.. తన ఇమేజ్ తో వచ్చిపడే బిజినెస్ ను నిలుపుకోవటానికి చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి.

టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా పేరొంది.. చిరంజీవి తనయుడన్న పే..ద్ద పేరున్న రాంచరణ్ ఈ మధ్య విమానయాన బిజినెస్ లోకి అడుగుపెట్టటం తెలిసిందే. ట్రూజెట్ పేరిట ఎయిర్ లైన్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేయటం.. దాని గురించి పలువురు ఆసక్తి ప్రదర్శించటం తెలిసిందే. అయితే.. తన సర్వీసు స్టార్ట్ చేసిన మొదట్లోనే.. ట్రూజెట్ సేవలకు ఠారెత్తిపోయి.. సోషల్ మీడియాను ఆశ్రయించిన బాధితులు చాలామందే ఉన్నారు.

తాజాగా.. అలాంటిదే మరో ఉదంతం చోటు చేసుకుంది. గురువారం హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ట్రూజెట్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. సదరు సంస్థ నిర్లక్ష్యంతో తన సర్వీసును క్యాన్సిల్ చేసింది. దీంతో.. ఎయిర్ పోర్ట్ రన్ వే మీద ఆందోళనకు దిగారు ప్రయాణికులు.

ఉదయం 8 గంటలకు ప్రయాణం కావాల్సిన విమానాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆలస్యంగా ప్రకటించటంతో.. ప్రయాణికులకు ఎక్కడో కాలిపోయింది. దీంతో.. ఆందోళనకు దిగిన వారిని శాంతింపచేసేందుకు ట్రూజెట్ దిగి వచ్చింది. చివరకు వారిని సాయంత్రం వేళ.. మరో విమానంలో ఎక్కించారు. గాల్లోకి ఎగిరిన విమానం కాసేపటికి ఎయిర్ పోర్ట్ కి వచ్చేయటంతో.. తిరుపతికి చేరిపోయామని సంబరపడిన వారికి... శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కనిపించటంతో షాక్ తిన్నారు.

ఇదేంటి ఇలా చేశారన్న మాటకు.. వాతావరణం బాగోని కారణంగా ఫ్లైట్ వెనక్కి వచ్చేసిందని చెప్పటంతో ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజంతా కూర్చునేలా చేసి.. ఇదేం సర్వీస్ అంటూ తిట్టేశారు. పేరు ప్రఖ్యాతులున్న హీరోకి చెందిన ఎయిర్ సర్వీసు ఇలా ఉండటం బాగోదేమో చెర్రీ.. కాస్త ఆలోచించకూడదు.