Begin typing your search above and press return to search.

ట్రెండింగ్‌: సినిమా టైటిళ్ల‌లో తెలుగు లెస్

By:  Tupaki Desk   |   1 Nov 2019 6:53 AM GMT
ట్రెండింగ్‌: సినిమా టైటిళ్ల‌లో తెలుగు లెస్
X
మ‌న వాళ్ల‌కి రాను రాను ఇంగ్లీష్ మీద ప్రేమ పెరిగిపోతోంది. ఎంతంటే తెలుగునే మ‌ర్చిపోయేటంత. ఇంత‌లా మ‌న వాళ్లు ఎందుకు మారిపోతున్నారు? ఏమైంది మ‌న తెలుగు వాళ్ల‌కి?.. ఎందుకీ ఇంగ్లీష్ పిచ్చి.. గ‌త కొన్ని నెల‌లుగా తెలుగు సినిమా టైటిల్స్ ప‌రిశీలిస్తే ఈ విడ్డూరం తెలిసొస్తోంది. ఇంగ్లీష్ మాట్లాడ‌టం ఫ్యాష‌న్ కానీ దాన్నే ఫాలో కావ‌డం అనేది మ‌రీ విడ్డూరంగా వుందనే సెటైర్లు సాంప్ర‌దాయ భాషాభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. తెలుగు సినిమాకు యూనివ‌ర్స‌ల్ అప్పీల్ తీసుకురావాల‌న్న తాప‌త్ర‌యంలో భాగంగా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలుగు సినిమాకు ఇంగ్లీష్ టైటిల్స్ ని పెట్టాలనే మోజులో ప‌డిపోయారు.

త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కులు `అత్తారింటికి దారేది`, `అఆ`. `అల వైకుంఠ‌పుర‌ములో..` అంటూ అచ్చ తెలుగు టైటిల్స్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే కుర్ర హీరోలు.. పూరీ లాంటి ద‌ర్శ‌కులు.. యంగ్ డైరెక్ట‌ర్స్ మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ మోజులో ప‌డిపోయి తెలుగు సినిమాకు ఇంగ్లీష్ పేర్లు పెట్టేస్తున్నారు. నాని లాంటి హీరో కూడా ఇంగ్లీష్ టైటిల్స్ కి అడిక్ట్ అయిపోవ‌డం మ‌న తెలుగు వాళ్ల తెగులుకు ప‌రాకాష్ట‌గా మారింది. తెలుగు సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ అనే ఒర‌వ‌డి రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` సినిమాతో మొద‌లైంది.

పేరు తెలుగే అయినా `అర్జున్‌రెడ్డి` సినిమా పోస్ట‌ర్ల‌పై ఎక్క‌డా టైటిల్ ని తెలుగులో రాయ‌లేదు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఇండ‌స్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ పిచ్చి మొద‌లైంది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌... చిరంజీవి `సైరా`(ఆంగ్ల సౌండింగ్ తో), విజ‌య్ దేవ‌ర‌కొండ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌`, రామ్ `రెడ్‌`, నాని నిర్మాత‌గా విశ్వ‌క్ సేన్ హీరోగా రాబోతున్న క్రైమ్ థ్రిల్ల‌ర్ `హిట్‌`తో పాటు రానున్న కొన్ని సినిమాలు కూడా ఇదే త‌ర‌హా ఇంగ్లీష్‌ టైటిల్స్‌తో రాబోతుండ‌టం తెలుగు సినిమా వాళ్ల‌కి ఇంగ్లీష్ టైటిల్స్‌పై పెరిగిన మోజుకు అద్దంప‌డుతోంది. త‌మిళంలో ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఆ సినిమాపై త‌మిళ సంఘాల‌తో పాటు ఇండ‌స్ట్రీలో వున్న వ‌ర్గాలు ఆందోళ‌న‌కు దిగిన సంద‌ర్భాలున్నాయి. అలా మ‌న వాళ్ల‌లో భాషాభిమానం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి అంటున్నారు భాషాభిమానులు. దేశ‌భాష‌లందు తెలుగు లెస్స అన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో తెలుగు లెస్! అయిపోతోంది. ఎంతో కీల‌క‌మైన టైటిళ్ల‌లోనే ఇది బ‌య‌టప‌డుతోంది.