Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: జాతీయ సినిమా గ‌ర్వం అణిగిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 April 2022 3:20 AM GMT
ట్రెండీ టాక్‌: జాతీయ సినిమా గ‌ర్వం అణిగిన‌ట్టేనా?
X
అహం బ్ర‌హ్మ‌స్మీ.. అహంతో సాధించేది ఏదీ లేదు. కాస్త ఒదిగి ఉంటే చాలా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించివాళ్లున్నారు. అయితే అలాంటి అహాన్ని విడిచిపెట్టేందుకు బాలీవుడ్ బ‌డా నిర్మాత‌లు కానీ హిందీ అగ్ర‌ ద‌ర్శ‌కులు కానీ లేదా స్టార్ హీరోలు కానీ సిద్ధంగా ఉన్నారా? అంటే స‌సేమిరా.. !

కొంద‌రి వైఖ‌రి ఎలా ఉన్నా కానీ.. బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. ఖాన్ లు సైతం అఅ ఊఊ అంటున్నారే కానీ ఎక్క‌డా దొర‌క‌డానికి సిద్ధంగా లేరు. జాన్ అబ్ర‌హాం లాంటి హీరో బాహాటంగానే ప్రాంతీయ సినిమాని చిన్న చూపు చూస్తూ దొరికిపోయాడు. ఇక కిలాడీ అక్ష‌య్ కుమార్ అయితే మీడియా ముందు నీళ్లు న‌మిలాడు.

తాజా ప‌రిణామం హిందీ హీరోల‌కు కానీ బ‌డా హిందీ నిర్మాణ సంస్థ‌ల‌కు కానీ మింగుడు ప‌డ‌నిది. సౌత్ నుంచి వస్తున్న సినిమాలు హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. దీంతో హిందీ ప‌రిశ్ర‌మ ప‌నైపోయింది.. ఇక సౌత్ దే హ‌వా! అన్న ప్ర‌చారం ఊపందుకుంది. ముంబై మీడియా అయితే 50-50 ఛాయిస్ తో సౌత్ కి మ‌ద్ధతుగా నిలుస్తోంది. దీంతో హిందీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు సైతం ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. హిందీ సినిమానే 'జాతీయ సినిమా' అనే ఆలోచ‌న ఇప్పుడు నెమ్మ‌దిగా క‌నుమ‌రుగ‌వుతోంది.

తెలుగు సినిమాలంటే ప్రాంతీయ సినిమాలు అనే ఆలోచన కూడా ఇక మీద‌ట ఉండ‌దు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు- దర్శకులు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని ఇంత‌కుముందు ఎప్పుడూ అనుకోలేదు. ఏదో రాయి విసిరాం అనుకున్నారే కానీ ఇటువైపు సీరియ‌స్ గా చూడ‌లేదు. చివ‌రికి తెలుగు సినిమా నేర్పించిన పాఠాల్ని వంట‌ప‌ట్టించుకుని ఇప్పుడు ప్లానింగ్ లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. సౌత్ - నార్త్ టై అప్ ల‌తో సినిమాల కోసం ఉవ్విళ్లూరుతున్నారు.

కిలాడీ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'పృథ్వీరాజ్ చౌహాన్' జనవరి 2022 లోనే సినిమాల్లోకి రావాల్సి ఉన్నా సౌత్ ఎదురుదాడి ముందు ప‌లుమార్లు వాయిదా ప‌డింది. రాధే శ్యామ్ .. RRR వేవ్ కారణంగా ఈ చిత్రం వాయిదా పడుతూ ఎట్ట‌కేల‌కు రిలీజ్ కి వ‌స్తోంది. జూన్ 3ని య‌ష్ రాజ్ సంస్థ అధినేత‌లు లాక్ చేశారు. అయితే నెలల తరబడి వాయిదా వేయడంతో YRF తమ తప్పును గ్రహించి ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు -తమిళంలోకి డబ్ చేసింది. హిందీ వెర్షన్ తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో సినిమా విడుదల కానుంది. అయితే YRF గత రెండు సంవత్సరాలలో వారి సినిమాల తెలుగు డబ్బింగ్ వెర్షన్ లతో ల‌క్ చెక్ చేసుకుంటున్నా కానీ విడుదల ప్రచార ప్రణాళికల గురించి ఎన్నడూ తీవ్రంగా ఆలోచించలేదు.

స‌రైన ప్ర‌చార‌మే చేయ‌లేదు. అందుకు త‌గ్గ‌ట్టే ఇలా వ‌చ్చి వెళ్లేవి. కానీ ఈసారి అలా కాదు. అహం త‌గ్గించి అక్షయ్ కుమార్ మూవీని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మ‌వుతున్న‌ మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లార్ తో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి సీరియ‌స్ గా ప్లాన్ చేస్తున్నారు. మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఇప్పుడు తెలుగు- తమిళ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ముఖ్యంగా అక్ష‌య్ కంటే ఈ సినిమా మానుషికి చాలా ఇంపార్టెంట్. ఐదేళ్లుగా త‌న బాలీవుడ్ డెబ్యూ కోసం వేచి చూస్తున్న ఈ బ్యూటీకి ఇది ఏమేర‌కు మైలేజ్ నిస్తుందో వేచి చూడాలి.