Begin typing your search above and press return to search.

త్రిష‌ కొంప‌దీసి దిశా పోలీస్ కాదు క‌దా?

By:  Tupaki Desk   |   23 Nov 2022 4:30 PM GMT
త్రిష‌ కొంప‌దీసి దిశా పోలీస్ కాదు క‌దా?
X
మల్టీ స్టారర్ `పొన్నియిన్ సెల్వన్` థియేట్రిక‌ల్ రిలీజ్ స‌హా అన్ని ప్లాట్ ఫారమ్ లలో ప్రశంసలు అందుకోవడంతో ఇందులో న‌టించిన స్టార్ల‌కు క్రేజ్ అమాంతం పెరిగింది. ప్ర‌స్తుతం ఈ మూవీ తారాగ‌ణం అంతా ఇతర ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంలో యువరాణి కుందవై పాత్రను పోషించిన త్రిష.. మాజీ ప్రపంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ (నందిని) తో పోటీపడి మ‌రీ మెప్పించింది.

రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన త్రిష ఇప్పుడు త‌న తొలి ఓటీటీ సిరీస్ కోసం ఆస‌క్తిగా వేచి చూస్తోంది. సౌత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన త్రిష కృష్ణన్ కి ఈ సిరీస్ తో నార్త్ లోను హిందీ అనువాదంతో గుర్తింపు పెరుగుతుంద‌ని ఓ అంచ‌నా.

ఈ సిరీస్ లో క్యూట్ త్రిష‌ పవర్ ప్యాక్డ్ పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. దీనికి బృందా అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారు. తాజాగా త్రిష OTT అరంగేట్రం గురించి తన అభిమానులకు స్వ‌యంగా ఇన్ స్టా వేదిక‌గా క్లారిటీనిచ్చారు. త్రిష ఈ ఫోటోగ్రాఫ్ లో సాధారణ వస్త్రధారణలో క‌నిపిస్తున్నా నేపథ్యంలో పోలీసు జీప్ క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి పోలీసాఫీస‌ర్ బృందా మ‌ఫ్టీలో ఉన్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

బృందా సీజన్ 1 చిత్రీక‌ర‌ణ పూర్త‌యిందని టైటిల్ పాత్ర‌ధారి త్రిష‌ ప్రకటించారు. ఫోటోతో పాటు క్యాప్షన్ ఇలా ఉంది. ``చిత్రీక‌ర‌ణ పూర్తి?? #బృందా సీజన్ 1 కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు....``అని రాసారు.

ఈ వ్యాఖ్య‌ను చూడ‌గానే అభిమానుల్లో ఉల్లాసం ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. త్రిష ఫ్యాన్స్ థ్రిల్ అయ్యారు. ``మిమ్మల్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు`` అని ఓ అభిమాని వ్యాఖ్యానించారు. మరో అభిమాని అన్నివిధాలా విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ``త్రిషూ.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నాకు అత్యంత ఇష్టమైన నటి. మీ కంటే గొప్పవారు ఎవరూ లేరు. ఎల్లప్పుడూ మీకు విజయం ద‌క్కాలి. జీవితంలో ఆనందాన్ని కోరుకుంటున్నాను`` అని వ్యాఖ్య‌ను జోడించారు. మరికొందరు అభిమానులు `వెయిటింగ్` ...లుకింగ్ ఫార్వార్డ్‌ వంటి వ్యాఖ్యలు చేశారు. త్రిష‌ను యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో చూడటానికి తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఆస‌క్తిక‌రంగా ఓ అభిమాని మాత్రం ``కొంప‌దీసి దిశా పోలీస్ ఆఫీస‌ర్ కాదు క‌దా? ద‌డ పుట్టిస్తుంది బాబోయ్!`` అని సందేహం వ్య‌క్తం చేశాడు. ప్ర‌తిరోజూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దిశ పోలీస్ కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. దీంతో రిక్రూట్ మెంట్ కూడా పెరిగింది. బ‌హుశా అలాంటి క‌థ‌లో త్రిష‌ను స్ట్రిక్టు పోలీసాఫీస‌ర్ గా చూడ‌బోతున్నార‌ని కూడా అభిమానులు ఊహిస్తున్నారు.

ఈ సిరీస్ గురించి అంత‌గా వివరాలేవీ అందుబాటులో లేవు. సోనీ LIVలో ప్రీమియర్ కానుంది. ఇందులో సాయి కుమార్- ఆమని- ఇంద్రజిత్ సుకుమారన్- రవీంద్ర విజయ్- ఆనంద్ సామి కూడా కీలక పాత్రలు పోషించారు. సూర్య వంగల దర్శకత్వం వహించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.