Begin typing your search above and press return to search.

అమ్మ పాత్రలో త్రిష.. జాగ్రత్త!!

By:  Tupaki Desk   |   28 Oct 2016 4:43 PM GMT
అమ్మ పాత్రలో త్రిష.. జాగ్రత్త!!
X
అస‌లే త‌మిళ‌నాడు.. అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియంది కాదు! ముఖ్య‌మంత్రి జయ‌ల‌లితకు అనుకూలంగా ఎవ‌రైనా మాట్లాడితే... డీఎంకే వ‌ర్గాల‌కు కోపం వ‌చ్చేస్తుంది! క‌రుణానిధిని వెన‌కేసుకొస్తే... అమ్మ అనుచ‌రుల‌కు ఆగ్ర‌హం వ‌చ్చేస్తుంది. ఏదో ఒక సైడ్ తీసుకుని మాట్లాడితే... ఎక్క‌డో చోట ఎవ‌రివో ఒక‌రి మ‌నోభావాలు దెబ్బ తినేస్తాయి. అలా దెబ్బలు తినేసిన అనుభ‌వాలు కొంత‌మంది త‌మిళ సినీ ప్ర‌ముఖుల‌కు గ‌తంలో చాలా ఉన్నాయి క‌దా! మ‌రి, అలాంటి ట్రాక్ రికార్డులు ఏవీ చూసుకోకుండా ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత గురించి త్రిషా మాట్లాడేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ‘అమ్మ అభిమాని’ అనే ముద్ర వేయించుకునేందుకు త్రిషా ఆరాట‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది!

ఇంత‌కీ త్రిషా ఏమందంటే.... అమ్మ జ‌య‌లలిత చ‌దువుకున్న పాఠ‌శాల‌లోనే తానూ చ‌దువుకున్నాన‌ని చెప్పింది. అక్క‌డితో ఆగితే బాగుండేది... జ‌య‌ల‌లిత జీవితం ఆధారంగా ఒక చిత్రం రావాల‌న్న కోరిక‌ను కూడా బ‌య‌ట‌పెట్టింది. అక్క‌డితో త‌గ్గినా సంతోషించేవాళ్లం, అమ్మ జీవిత చ‌రిత్ర సినిమాగా వ‌స్తే.. అందులో తాను న‌టిస్తాన‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించుకుంది! న‌టించ‌డం అంటే... అమ్మ జ‌య‌ల‌లిత పాత్ర‌లో త్రిషా అన్న‌మాట‌!

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో రాజ‌కీయ ప‌రిస్థితులు ఏమంత బాగోలేవు. ఇంకోప‌క్క అమ్మ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో అమ్మ గురించి ఎక్క‌డ ఎవ‌రు ఏం మాట్లాడినా అంద‌రూ అటువైపే చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో... జ‌య‌ల‌లిత జీవిత చ‌రిత్ర గురించి మాట్లాడితే అమ్మ అభిమానుల‌కు కోపం వ‌చ్చినా రావొచ్చు! జ‌య ఫ్యాన్ అనే ముద్ర వేయించుకుంటే అటువైపు క‌రుణానిధి అభిమానుల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావొచ్చు. గ‌తంలో రాజ‌కీయాల గురించి కామెంట్స్ చేసిన క‌మ‌ల్ హాస‌న్ లాంటివాళ్లే ఇబ్బందులు ప‌డిన సంద‌ర్భాలున్నాయి. పంచె క‌ట్టుకున్న నాయ‌కుడు ప్ర‌ధాని కావాల‌ని క‌మ‌ల్ అంటే... అమ్మ అభిమానుల‌కు కోపం వ‌చ్చేసింది! ఎందుకంటే, అమ్మ చీర‌క‌ట్టుకుంటారు క‌దా! ఆ సంద‌ర్భంలో క‌మ‌ల్ కూడా కామ్ గా ఉండాల్సి వ‌చ్చింది. జ‌య టీవీలో ఒక కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న కుష్యూ కూడా ఇలాంటి వ్యాఖ్య‌లే చేసి అస‌లుకే ఎస‌రు పెట్టించుకుంది. ఇలాంటి అనుభ‌వాల గురించి త్రిషాకు తెలుసో తెలీదో..? ఆమె చేసిన వ్యాఖ్య‌లపై ఎవ‌రు ఎలా స్పందిస్తారో ఏంటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/