Begin typing your search above and press return to search.

ఈ అసిస్టెంట్ హిట్టయితే చరిత్రే

By:  Tupaki Desk   |   11 Feb 2017 6:30 AM GMT
ఈ అసిస్టెంట్ హిట్టయితే చరిత్రే
X
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లుగా రాజమౌళి.. త్రివిక్రమ్.. వివి వినాయక్.. సుకుమార్ ల పేర్లు వినిపిస్తాయి. కొరటాల కూడా ఈ జాబితాలో చేరినా.. ఇప్పటివరకూ చేసినవి మూడు సినిమాలే కాబట్టి.. ఇంకా ఈయన అసిస్టెంట్స్ డైరెక్టర్లుగా మారే పరిస్థితి లేదు. అయితే.. వీరు బాగానే సక్సెస్ అయ్యారు కానీ.. వీరి అసిస్టెంట్స్ మాత్రం ఇండస్ట్రీలో సెటిల్ కాలేకపోతున్నారు.. హిట్ కొట్టలేకపోతున్నారు.

రాజమౌళి శిష్యులుగా కొంతమంది దర్శకులుగా మారి సినిమాలు తీసినా సక్సెస్ కాలేకపోయారు. సారాయి వీర్రాజు అనే సినిమా తీశాడు డీఎస్ కన్నన్. నితిన్ హీరోగా ద్రోణ అంటూ తెరకెక్కించాడు కరణ్ కుమార్. బాలకృష్ణతో మిత్రుడు తీసిన మహదేవ.. దిక్కులు చూడకు రామయ్యా చిత్రాన్ని తీసిన త్రికోఠి.. లచ్చిందేవికి ఓ లెక్కుంది అంటూ తీసిన జగదీష్ తలశిల.. ఇలా వీరెవరకూ విజయాన్ని రుచి చూడలేకపోయారు.

సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ప్రకాష్ తోలేటి. రానాతో నా ఇష్టం అనే సినిమా తీసి ఫ్లాప్ అందుకున్నాడు. సుమంత్ అశ్విన్ హీరోగా చక్కిలిగింత అనే మూవీ తీసిన వేమారెడ్డి కూడా సుకుమార్ అసిస్టెంటే. అశోక్.. అజయ్ వొద్దిరాల ఇంకా సినిమా తీసే ప్రయత్నాల్లోనే ఉన్నారు. వివి వినాయక్ శిష్యుడు భాస్కర్ బండి.. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అంటూ సినిమా తీసినా ఆకట్టుకోలేకపోయాడు.

పూరీ జగన్నాథ్ అసిస్టెంట్స్ లో జయ రవీంద్ర.. పూరీ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా బంపర్ ఆఫర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో దిల్లున్నోడు అనే సినిమా కూడా వచ్చింది. సచిన్ జోషి హీరోగా నీ జతగా నేనుండాలి అంటూ ఆషికి2 రీమేక్ తో మరో ఫ్లాప్ కూడా మూట కట్టుకున్నాడు ఈ దర్శకుడు. అలాగే రోమియో అంటూ పూరీ తమ్ముడితోనే సినిమా తీశాడు గోపీ గణేష్. వీళ్లెవరికీ సక్సెస్ చిక్కలేదు.

ఇప్పుడు త్రివిక్రమ్ శిష్యుడు వెంకట్.. దర్శకుడిగా మారబోతున్నాడు. యంగ్ హీరో నాగశౌర్య తనే ఓ బ్యానర్ స్టార్ట్ చేసి.. తండ్రిని నిర్మాతగా చేసి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే మాత్రం.. ఇప్పటి తరం స్టార్ డైరెక్టర్ల అసిస్టెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి.. హిట్ సాధించినవాడిగా వెంకట్ చరిత్ర సృష్టించేసినట్లే.