Begin typing your search above and press return to search.

పవన్-త్రివిక్రమ్ ‘కోబలి’ ఎప్పుడంటే..

By:  Tupaki Desk   |   27 May 2018 4:30 AM GMT
పవన్-త్రివిక్రమ్ ‘కోబలి’ ఎప్పుడంటే..
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి ‘కోబలి’ అనే రాయలసీమ నేపథ్యం ఉన్న సినిమా ఒకటి చేస్తారని చాలా ఏళ్ల కిందటే వార్తలొచ్చాయి. కానీ ఎందుకో తెలియదు.. ఆ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఒక సందర్భంగా త్రివిక్రమ్.. ఈ సినిమా త్వరలోనే మొదలవుతుందని కూడా చెప్పాడు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ వేరే ప్రాజెక్టుల్లో పడిపోయాడు. దీంతో ‘కోబలి’ కథేంటో తెలియకుండా పోయింది. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టుపై స్పష్టత ఇచ్చాడు. గతంలో ఎందుకు సినిమా ముందుకు కదల్లేదో.. భవిష్యత్తులో ఈ సినిమా తీసే అవకాశం ఉంటుందో లేదో స్పష్టత ఇచ్చాడు.

రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది.. ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలపై తాను పరిశోధన చేశానని.. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయని.. శత్రువులపై కత్తులతో దాడి చేస్తున్నపుడు ఫ్యాక్షనిస్టులు ఊపుకోసం ‘కోరు బలి.. నరుకు బలి’ అని గట్టిగా అరుస్తారని.. అదే వాడకంలో ‘కోబలి’గా మారిందని త్రివిక్రమ్ చెప్పాడు. ఒకప్పటి పత్రికల్ని కూడా తిరగేసి ఒక ఫైల్ తయారు చేశానని.. ‘కోబలి’ స్క్రిప్టు కూడా రెడీ అయిందని.. పాటలు లేకుండా గంటా 45 నిమిషాల నిడివితో సినిమా చేయాలనుకున్నానని.. పవన్ కూడా ఓకే చెప్పాడని.. ఐదేళ్ల కిందట ఈ సినిమా కోసం కెమెరామన్ ను కూడా తీసుకున్నామని.. కానీ అంతలోనే 2014 ఎన్నికలు దగ్గర పడటంతో పవన్ ఇంకో ఏడాది పాటు తాను సినిమాలు చేయలేనని చెప్పాడని.. దీంతో ఆ ప్రాజెక్టు ఆగిందని త్రివిక్రమ్ చెప్పాడు. 2019 ఎన్నికల తర్వాత పవన్ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటే ‘కోబలి’ ఉంటుందని త్రివిక్రమ్ చెప్పాడు.