Begin typing your search above and press return to search.

చైతూ ఛాన్స్ మిస్స‌య్యాడు!

By:  Tupaki Desk   |   21 July 2015 4:09 AM GMT
చైతూ ఛాన్స్ మిస్స‌య్యాడు!
X
స్టార్ క‌థానాయ‌కుల వార‌సులంతా తెర‌పైకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే మాస్ ఇమేజ్‌ ని సంపాదించేస్తుంటారు. కానీ నాగ‌చైత‌న్య మాత్రం ఇప్ప‌టికీ ల‌వ‌ర్‌బోయ్‌ గానే క‌నిపిస్తున్నాడు. రెండు మూడు మాస్ సినిమాలు చేసినా ఆయ‌న‌కి క‌లిసిరాలేదు. ఎలాగైనా స‌రే... మాస్ హీరో అనిపించుకోవాల‌ని త‌ప‌న ప‌డుతున్న స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే ఛాన్స్ వ‌చ్చేసింది. త్రివిక్రమ్ లాంటి ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తే ఇక తిరుగేముంటుంది? వెంట‌నే మాస్ హీరో అయిపోవ‌డం ఖాయం. అందుకే నాగ‌చైత‌న్య చాలా హ్యాపీగా ఫీల‌య్యాడు. తాను చేయాల్సిన ఒకట్రెండు ప్రాజెక్టుల్ని కూడా ప‌క్క‌కుపెట్టి త్రివిక్ర‌మ్‌ తో సినిమా గురించి ఎదురు చూశాడు. కానీ ల‌క్కు క‌లిసి రాలేదు. ఆ అవ‌కాశం కాస్త నితిన్ చేతికి వెళ్లిపోయింది. త్రివిక్ర‌మ్ ప్రాజెక్టు ని నిర్మించే హారిక హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌కి నితిన్ బంప‌ర్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డంతోనే చైతూ కి ఛాన్స్ మిస్స‌య్యింద‌ట‌.

స్వ‌త‌హాగా డిస్ట్రిబ్యూట‌ర్ అయిన నితిన్ తానే గ‌న‌క త్రివిక్ర‌మ్ సినిమా లో హీరో అయితే శాటిలైట్ రైట్స్‌, నైజామ్ హ‌క్కులు ముంద‌స్తుగానే కొనుక్కొని డ‌బ్బులిచ్చేస్తా అని చెప్పాడ‌ట‌. అంటే నిర్మాత‌కి ముందుగానే స‌గానికి పైగా డ‌బ్బులొచ్చిన‌ట్టే అన్న‌మాట‌. అదే స‌మ‌యంలో హారిక హాసిని సంస్థ నాగ‌చైత‌న్య‌ తో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పందం కుదుర్చుకొంది. ఆ సినిమాకి `కార్తికేయ‌` ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని మాట‌. రెండు ప్రాజెక్టులు ఒకేసారి సెట్స్‌ పైకి వెళ్లాలంటే నితిన్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి సినిమా చేయ‌డ‌మే మార్గ‌మ‌ని నిర్ణ‌యించాడట నిర్మాత‌. అంటే చందుమొండేటి తో నాగ‌చైత‌న్య‌, త్రివిక్ర‌మ్‌ తో నితిన్ సినిమా చేయ‌బోతున్నార‌న్న‌మాట‌.