Begin typing your search above and press return to search.

'అరవింద సమేత' లో వీరత్వానికి కొత్త అర్థం

By:  Tupaki Desk   |   9 Oct 2018 11:30 AM GMT
అరవింద సమేత లో వీరత్వానికి కొత్త అర్థం
X
‘అరవింద సమేత’ ట్రైలర్ చూస్తే ఇది ‘మిర్చి’ స్టయిల్లో సాగే సినిమాలా కనిపించింది. ముందు సాఫ్ట్‌గా కనిపించే హీరో.. ఒక దశలో తనలోని వయొలెంట్ యాంగిల్ చూపించడం.. ఆ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ సాగడం.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి శాంతి కోసం పోరాడి ఫ్యాక్షనిస్టుల్లో మార్పు తేవడం.. ఇలా ఈ ఫార్మాట్లో సాగే సినిమాలా అనిపించింది. ఐతే ఇలాంటి కథలు ‘మిర్చి’తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ చూశాం. మరి ఇప్పుడు కొత్తగా త్రివిక్రమ్ ఏం చూపిస్తాడనేది ఆసక్తికరం.

ఐతే ఈ విషయంలో ప్రేక్షకుల్ని ముందే ప్రిపేర్ చేయదలుచుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా కథ గురించి.. ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి కొన్ని విశేషాలు వెల్లడించే ప్రయత్నం చేశాడు. ఇప్పటిదాకా యుద్ధం చూపించి.. చివరగా శాంతి వచనాలు పలకడమే చూపించారని.. ఐతే ‘అరవింద సమేత’లో యుద్ధం అనంతరం పరిస్థితులు ఎలా ఉంటాయో వివరంగా చూపిస్తామని ఆయన అన్నాడు. యుద్ధంలో గెలిచిన వాడు ఏమయ్యాడు.. ఓడినవాడి పరిస్థితి ఏంటి.. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాల జీవనం ఎలా ఉంది అనేది చూపిస్తామన్నాడు.

అలాగే ‘అరవింద సమేత’లో వీరత్వానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేసినట్లు కూడా త్రివిక్రమ్ వెల్లడించాడు. మామూలుగా ఒకరిని కొట్టేవాడు.. చంపేవాడినే వీరుడు అనుకుంటామని.. ఈ ప్రయత్నంలో చనిపోతే వీర మరణంగా పేర్కొంటామని.. ఐతే నిజానికి అసలు వీరత్వం ఇది కాదని త్రివిక్రమ్ అన్నాడు. అభిమన్యుడు 16 ఏళ్లకే చనిపోయాడని.. అందరూ అతడిని వీరుడని కీర్తించాడని.. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని.. అతడి మరణం తర్వాత కుటుంబం పరిస్థితి ఏంటని ఎవరూ ఆలోచించరని చెప్పాడు. యుద్ధం చేసేవాడికంటే యుద్ధం చేసే శక్తి ఉండి కూడా యుద్ధాన్ని ఆపేవాడు గొప్ప వీరుడని.. సినిమాలో అలాంటి వీరుడి పాత్రనే చూస్తారని.. అందుకే టైటిల్లో ‘వీర రాఘవ’ అని పెట్టామని త్రివిక్రమ్ వెల్లడించాడు.