Begin typing your search above and press return to search.

ఆడాళ్ల‌పైనా అత్త‌ల‌పైనా అందుకే గౌర‌వం

By:  Tupaki Desk   |   11 Jan 2020 5:30 PM GMT
ఆడాళ్ల‌పైనా అత్త‌ల‌పైనా అందుకే గౌర‌వం
X
ఇటీవ‌లి కాలంలో త్రివిక్ర‌మ్ సినిమాల్ని ప‌రిశీలిస్తే మ‌హిళామ‌ణుల పాత్ర‌ల‌కు ఆయ‌న పెద్ద పీట వేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌థానాయ‌కుడితో పోటీప‌డే ఒక గృహిణి పాత్ర‌ను సృష్టిస్తున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో న‌దియా పాత్ర‌ను ఆడియెన్ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రంలో స్నేహ పాత్ర ప్రాధాన్య‌త అంతే ఇదిగా ఉంటుంది. ఆడ‌ది అబ‌ల కాదు స‌బ‌ల‌.. మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ అనే మీనింగ్.. అలాగే క‌ల్చ‌ర్ కి సంబంధించిన క్లాసులు త్రివిక్ర‌మ్ సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా మారాయి. ఇప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంలోనూ ట‌బు పాత్ర‌ను అంతే ప‌వ‌ర్ ఫుల్ గా చూపిస్తున్నార‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

అస‌లింత‌కీ స్త్రీల‌పై గౌర‌వాన్ని పెంచే పాత్ర‌లు కావాల‌ని ఇరికించేవా లేక కాన్షియ‌సా? అని త్రివిక్ర‌మ్ ని ప్ర‌శ్నిస్తే...ఆయ‌న త‌న‌దైన శైలిలో జ‌వాబిచ్చారు. త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ-`` 1950-70 మ‌ధ్య ఇల్లు చూసుకునేది గృహిణి. పైకి చెప్పని ఒక మాతృస్వామ్య విధానం అది. ఇంటికి సంబంధించిన స‌మ‌స్తం వాళ్ల ద్వారానే నడిచేవి. 70ల తర్వాత ప్రయాణాలు పెరిగి.. ఉన్న చోటు నుంచి వేరే చోట్లకు వెళ్లి ఉద్యోగాలు.. వ్యాపారాలు చేయాల్సి రావడం వల్ల ఇళ్లల్లో వారి భాగస్వామ్యం తగ్గింది. తెలీకుండా మనం కూడా వేరే సంస్కృతికి ప్రభావితమవడం.. మన మూలాల్ని మనం వదిలేయడం.. దాంతో వాళ్లను అగౌరవపరిచేవిధంగా చూడటం.. మగవాళ్లే అలా చూడ్డం వల్ల ప‌ర్య‌వ‌సానాల్నిఅర్థం చేసుకోవాలి. పురుషాహంకారం ఆధిక్యం వ‌ల్ల‌నే స్త్రీలు ఒదిగి ఉన్నారు. అయితే అది గ‌తం .. ఇప్పుడ‌లా లేదు.

`అత్తారింటికి దారేది` క‌థ‌లో అత్త పాత్ర‌ను అలా రాయడానికి కారణం.. నాకు మా అత్తంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పట్నుంచీ విన్న నానుడి.. తల్లి తర్వాత పిన్ని... తండ్రి తర్వాత మేనత్త అని. అలాంటి అత్తని మనం ఎందుకు తక్కువచేసి చూపిస్తాం? అత్తతో అల్లుడు వేళాకోళమాడ్డం బేసిగ్గా మన సంస్కృతిలో లేదు. దాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టారు. పెళ్లిలో అల్లుడ్ని విష్ణువుగా చూస్తాం. అందుకే కాళ్లు కడుగుతాం. అంటే అల్లుడి బాధ్యతను పెంచడం కోసం అతని కాళ్లు కడుగుతాం. అలాంటివాడు అత్తతోటి ఎలా వేళాకోళమాడతాడు? అతను దేవుడిలాగే బిహేవ్ చెయ్యాలి. అందర్నీ బాగా చూసుకోవాలి. మంచి సమాజాన్ని నిర్మించాలి. ఇవన్నీ తెలీకుండానే నా సినిమాలో ప్రతిఫలించి ఉండొచ్చు. కాన్సియ‌స్ అని అనుకోవ‌చ్చేమో`` అని అన్నారు.

ప్ర‌పంచ‌మంతా తిరిగొచ్చాక ఇంటిద‌గ్గ‌రే సుఖం క‌నిపిస్తుంది. ఆ ఇంటికొచ్చిన ఫీలింగే వేరు. మనకు తెలీకుండానే ఇల్లు మన క‌ల్చ‌ర్ లో ఒక భాగం. అది చిన్నదే కావచ్చు. ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. బహుశా నేను ఆ ఇంట్లో ఆనందాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తానేమో. అందుకే నా సినిమాల్లో కథకి ఇల్లు కేంద్రంగా ఉంటుంది అని అస‌లు సీక్రెట్ ని చెప్పారు మాయావి. ఆయ‌న ప్ర‌తి సినిమాలో ఒక ఇల్లు .. ఫ్యామిలీ సెంటిమెంట్ల‌కు కార‌ణం ఏమిటో ఇప్ప‌టికైనా అర్థ‌మైందా?