Begin typing your search above and press return to search.

మాటలతో గమ్మత్తులు చేసే గడుసు మాంత్రికుడు

By:  Tupaki Desk   |   7 Nov 2021 9:30 AM GMT
మాటలతో గమ్మత్తులు చేసే గడుసు మాంత్రికుడు
X
త్రివిక్రమ్ .. తెలుగు రాష్ట్రాల్లో .. తెలుగు సినిమాతో పరిచయం ఉన్నవారిలో ఈ పేరు తెలియనివాళ్లంటూ ఉండరు. సినిమాకి కథ .. మాటలు రాసేవాళ్లు ఉంటారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. హీరో .. దర్శకుడు తరువాత రచయితను కూడా ప్రేక్షకులు గుర్తించే స్థాయికి తెలుగు సినిమాను తీసుకు వచ్చింది పరుచూరి బ్రదర్స్ అని చెప్పక తప్పదు. ఆ తరువాత వచ్చిన పోసాని కృష్ణమురళి కూడా తనదైన మార్క్ చూపించారు. పోసాని దగ్గర పనిచేసిన త్రివిక్రమ్ తన కలం పదును పెంచుతూ వెళ్లారు. మాటలు రాయడంలో సరికొత్త ట్రెండ్ ను ఆయన సృష్టించారు.

ఒకప్పుడు పాటలు బాగున్నాయని మళ్లీ మళ్లీ అదే సినిమాను చూసే ఆడియన్స్ ఉండేవారు. కానీ మాటలు బాగున్నాయని చెప్పేసి మళ్లీ మళ్లీ థియేటర్లకు రావడం త్రివిక్రమ్ విషయంలోనే జరిగింది. హీరోల .. దర్శకుల విషయంలోమాత్రమే వినిపిస్తూ వచ్చిన బిరుదులు మొదటిసారిగా ఒక డైలాగ్ రైటర్ విషయంలో వినిపించేలా చేసింది కూడా త్రివిక్రమ్ నే. అందరూ కూడా ఆయనను 'మాటల మాంత్రికుడు' అని పిలుస్తారు. అంతగా తెరపై పాత్రలను .. ఆ పాత్రల ద్వారా థియేటర్లలోని ఆడియన్స్ ను ఆయన కన్వీన్స్ చేస్తారు. ఆయన చేసే మాటకు గారడీ గమ్మత్తుగా అనిపిస్తుంది .. థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఆ మాటల్లోని పదాల అంచులు చురుక్కుమంటూ ఉంటాయి.

త్రివిక్రమ్ ను చూసినవాళ్లు ఆయన సరదాగా ఇండస్ట్రీకి వచ్చి .. రాయల్ గా రాసేస్తున్నాడని అనుకుంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా 'భీమవరం' నుంచి వచ్చిన ఆయన, సినిమాల్లో అవకాశాల కోసం గాలిస్తూ, 'పంజగుట్ట'లో అద్దెకు ఉన్న రూమ్ చూస్తే, గులకరాయి నుంచి మేరుపర్వతంగా ఆయన ఎదిగిన తీరు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన ఆ రూమ్ కి 'రెంట్' కడుతూ .. అక్కడికి వెళ్లి కాసేపు కూర్చుని వస్తుంటారు. దీనిని బట్టి ఆయనలో ఎమోషన్స్ ఎంత బలంగా ఉన్నయనేది అర్థం చేసుకోవచ్చును.

1999లో వేణు హీరోగా వచ్చిన 'స్వయంవరం' సినిమా ద్వారా త్రివిక్రమ్ రచయితగా పరిచయమయ్యారు. ఆ తరువాత 'నువ్వేకావాలి' .. ' నువ్వు నాకు నచ్చావ్' వంటి సినిమాలకి ఆయన డైలాగ్స్ రాశారు. ఈ సినిమాల్లోని డైలాగ్స్ ను జనం విపరీతంగా ఎంజాయ్ చేశారు. సహజంగానే 'ఎవరు ఈ త్రివిక్రమ్? భలేగా రాస్తున్నాడే .. డైలాగ్స్ లో కొస మెరుపులు భలేగా ఉన్నాయే' అనుకున్నారు. ఎమోషనల్ సీన్స్ రాసేటప్పుడు ఆయన అక్కడ కొన్ని కొటేషన్స్ రాసేవారు. వాటికి కూడా జనం నుంచి విశేషమైన ఆదరణ లభించింది.

రచయితలుగా వచ్చి దర్శకులుగా మారినవారు చాలా తక్కువమంది. పరుచూరి బ్రదర్స్ .. పోసాని .. తనికెళ్ల భరణి కూడా దర్శకత్వం వహించారు. వాళ్ల దారివేరు .. అడపా దడపా మాత్రమే అవకాశాన్ని బట్టి మెగాఫోన్ పట్టారు. కానీ త్రివిక్రమ్ అలా కాదు. 'నువ్వే నువ్వే'తో మెగాఫోన్ పట్టిన ఆయన, కథాకథనాల పరంగా .. మాటల పరంగా తెలుగు సినిమాను కొత్త పరుగులు తీయించారు. రికార్డులను దోసిట పట్టి వసూళ్ల దాహం తీర్చారు. 'అతడు' .. 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' .. 'అరవింద సమేత' .. 'అల వైకుంఠ పురములో' సినిమాలతో ఆయన సంచలన విజయాలను నమోదు చేశారు.

ఒక రచయితగా వచ్చి డైలాగ్స్ లో ఒక కొత్త పంథాను ప్రవేశపెట్టి .. దర్శకుడిగా ఈ స్థాయిలో సక్సెస్ అయినవారు మరొకరు లేరు. ఈ విషయంలో ఆయన తన తరువాత వచ్చిన కొరటాల .. అనిల్ రావిపూడి .. మారుతి వంటివారికి స్ఫూర్తిగా నిలిచారు. త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు. తమ హీరోతో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకోగానే ఇక వసూళ్ల రికార్డులను గురించి అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఆయనపై వాళ్లకి గల నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను సిద్ధం చేసుకుంటూ వెళుతున్న ఆయన పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని విజయాలను ఆయన అందుకోవాలని మనసారా కోరుకుందాం.