Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ నేరుగా క్రెడిట్ ఇచ్చేశాడు

By:  Tupaki Desk   |   29 May 2018 11:30 AM GMT
త్రివిక్రమ్ నేరుగా క్రెడిట్ ఇచ్చేశాడు
X
తన సినిమాలకు సంబంధించి రాత బాధ్యతలన్నీ పూర్తిగా తనే చూసుకుంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా ఉన్నపుడు కానీ.. దర్శకుడిగా మారాక కానీ త్రివిక్రమ్ వేరే రచయితలెవ్వరి సాయం తీసుకున్న దాఖలాలు లేవు. త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి ప్రతి మాటా ఆయన పెన్ను నుంచే వస్తుందని అంటారు. వేరే రచయితలు రాసిన కథల నుంచి స్ఫూర్తి పొందాడు కానీ.. రచనా సహకారం మాత్రం తీసుకోలేదు. ఐతే తొలిసారిగా ఎన్టీఆర్ తో చేస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’కు త్రివిక్రమ్.. పెంచల్ దాస్ అనే రాయలసీమ కవి.. రచయిత.. గాయకుడి సాయం తీసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. పెంచల్ దాస్ ‘కృష్ణార్జున యుద్ధం’లో దారి చూడు దమ్ము చూడు పాటను రాసి పాడిన సంగతి తెలిసిందే.

‘అరవింద సమేత..’ రాయల సీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆ ప్రాంత భాష.. యాసపై మంచి పట్టున్న పెంచల్ సహకారం త్రివిక్రమ్ తీసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా ధ్రువీకరించాడు. పెంచల్ తన సినిమాకు పని చేస్తున్నట్లు చెప్పాడు. రాయలసీమ ఫ్యాక్షనిజంపై ‘కోబలి’ సినిమా కోసం చాలా పరిశోధన చేశానని.. దాని కోసం సేకరించిన సమాచారం ‘అరవింద సమేత’కు ఉపయోగపడిందని.. అదే సమయంలో అక్కడి భాష.. యాసలో డైలాగులు రాయడానికి.. మరింత సమాచారం తెలుసుకోవడానికి పెంచల్ దాస్ సాయం తీసుకున్నానని త్రివిక్రమ్ చెప్పాడు. విశేషం ఏంటంటే.. పెంచల్ దాస్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు ట్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడట. పక్కాగా రాయలసీమ యాసలో డైలాగులు పలకడం కోసం పెంచల్ సాయం తీసుకుంటున్నాడట తారక్.