Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో త్రివిక్రమ్ .. త్వరలోనే ఎనౌన్స్ మెంట్!

By:  Tupaki Desk   |   8 Nov 2021 10:30 AM GMT
మెగాస్టార్ తో త్రివిక్రమ్ .. త్వరలోనే ఎనౌన్స్ మెంట్!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ ఒకరు. తన సినిమాలకి సంబంధించిన కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు తానే సమకూర్చుకుంటారు. హీరోలను బట్టి .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ ను బట్టి .. వాళ్ల నుంచి అభిమానులు కోరుకునే అంశాలను బట్టి ఆయన కథలను రెడీ చేసుకుంటారు. ఇక త్రివిక్రమ్ దగ్గర మరో ప్రత్యేకత ఉంది. కేవలం యూత్ కోసమో .. మాస్ కోసమో .. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమో ఆయన సినిమాలు చేయరు. అన్ని వర్గాల ప్రేక్షకులు తన సినిమాలను చూసి ఎంజాయ్ చేసేలా కథలను సిద్ధం చేసుకుంటారు. ఆయన సక్సెస్ సీక్రెట్ అదే.

త్రివిక్రమ్ ఒక హీరోతో ఒక ప్రాజెక్టును ప్రకటించగానే అది పక్కాగా హిట్ అనే అభిప్రాయానికి అభిమానులు వచ్చేస్తారు. రాజమౌళి తరువాత స్టార్ హీరోతో సమానమైన క్రేజ్ ను కలిగిన దర్శకుడిగా త్రివిక్రమ్ కనిపిస్తారు. ఆయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిట్ చేస్తుంటారు. గతంలో ఆయన కోసం వెయిట్ చేసి మరీ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మెగా హీరోల్లో త్రివిక్రమ్ ఇంతవరకూ చేసింది పవన్ .. బన్నీలతోనే.
ఇక త్వరలో ఆయన చిరంజీవితో చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

గతంలో త్రివిక్రమ్ సినిమా ఫంక్షన్ లోనే చిరంజీవి మాట్లాడుతూ, ఆయన డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని ఉందన్నారు. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్ సెట్ అవుతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ అది కార్యరూపాన్ని దాల్చలేదు. అయితే ఇటీవల త్రివిక్రమ్ .. మెగాస్టార్ కి ఒక కథ వినిపించాడనీ .. ఆ కథ ఆయనకి బాగా నచ్చిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నాడని అంటున్నారు.

అయితే ప్రస్తుతం చిరంజీవి చేతిలో వరుసగా మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' .. మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' .. 'బాబీ దర్శకత్వంలో 'వాల్తేర్ వాసు' సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా చేయనున్నారు. ఆ తరువాతనే త్రివిక్రమ్ తో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ లోగా మహేశ్ బాబుతో త్రివిక్రమ్ తన సినిమాను పూర్తిచేసేస్తాడన్న మాట. అంటే త్రివిక్రమ్ - మెగాస్టార్ ప్రాజెక్టు 2023లో పట్టాలపైకి వెళుతుందనే అనుకోవాలి. త్రివిక్రమ్ సంగతి అలా ఉంచితే మెగాస్టార్ దూకుడు మాత్రం మామూలుగా లేదనే విషయం అర్థమైపోతోంది.