Begin typing your search above and press return to search.

నెట్టింట మరీ ఇంత నెగెటివిటీనా..??

By:  Tupaki Desk   |   12 Sep 2022 4:32 PM GMT
నెట్టింట మరీ ఇంత నెగెటివిటీనా..??
X
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. అదే స్థాయిలో నెగెటివిటీ కూడా ఎక్కువైపోయింది. సదుద్దేశంతో ఉపయోగించేవారి కంటే.. దురుద్దేశంతో వాడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఒకరిపై ఒకరు విద్వేషాలు రగుల్చుకోడానికి.. ఇతరులను అబ్యూజ్ చేయడానికి ఇప్పుడు ఆన్ లైన్ ను వేదికగా చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి కానీ లేదా ఒక వర్గం కానీ తమకు వ్యతిరేకులైతే చాలు.. వ్యక్తిగత దూషణలు - దుష్ప్రచారాలు చేయడం మనం చూస్తున్నాం.

నెట్టింట తిట్లకున్న ప్రాధాన్యత చర్చకు ఉండటం లేదు. మంచి కోసం సోషల్ మీడియాను ఉపయోగించేవారి శాతం తక్కువగా ఉంటోంది. తరచుగా సామాజిక వేదికలు వినియోగించే వారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీల మీద సోషల్ మీడియాలో చాలా ప్రతికూలత కనిపిస్తోందని చెప్పాలి. మనకు నచ్చని హీరో మీద నెగెటివ్ ట్రెండ్ చేయడం లేదా వారు నటించిన సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపునివ్వడం వంటివి మనం రోజూ చూస్తూనే ఉంటున్నాం.

ఇక ఫ్యాన్ వార్స్ అనేవి మామూలే. ఒకప్పుడు థియేటర్ల వద్ద గొడవ పడే హీరోల అభిమానులు.. ఇప్పుడు ఆన్ లైన్ లో కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇతర హీరోలపై అసభ్యకరమైన కామెంట్స్ - అభ్యంతరమైన పోస్టులు పెడుతూ కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

నిన్న ప్రభాస్ ఫ్యాన్స్ - మహేష్ అభిమానులు మరియు బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ప్రభాస్ తో హీరోల రిలేషన్ షిప్ విషయంలో గొడవపడ్డారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంపై అల్లు అర్జున్ లేట్ గా స్పందించడం పై ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.

టాలీవుడ్ సీనియర్ నటుడు మరణిస్తే.. అల్లు అర్జున్ తనకు వచ్చిన సైమా అవార్డ్ గురించి గొప్పగా ట్వీట్ చేయడంపై యాంటీ ఫ్యాన్స్ విమర్శలు చేసారు. ట్రోలింగ్ చేయడం వల్లనే చివరకు ఒక ట్వీట్ పెట్టాడని కామెంట్స్ చేశారు.

సైమా అవార్డ్స్ కోసం శనివారం బెంగుళూరు వెళ్లిన బన్నీ.. ఆదివారం కూడా అక్కడే ఉన్నాడు. అయితే కృష్ణంరాజు మరణవార్త తెలుసుకున్న వెంటనే తిరిగి హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తన ఇంటికి కూడా వెళ్లకుండా.. నేరుగా కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు.

టాలీవుడ్ లో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ చాలా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు పెదనాన్న చనిపోయి బాధలో ఉన్న ప్రభాస్ ను ఓదార్చి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు బన్నీ. అంతేకాదు పుట్టెడు దుఃఖంలో ఉన్న తన ఫ్రెండ్ మొహంలో నవ్వు కనిపించేలా చేసాడు.

నిజానికి కృష్ణంరాజు కు నిన్న ఆదివారం చాలామంది సినీ ప్రముఖులు నివాళులు అర్పించలేదు. ఇతర కార్యక్రమాల్లో ఉండటం వల్ల కుదరకనో.. ఇతర పనులతో బిజీగా ఉండటం వల్లనో ఈరోజు సోమవారం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అయినా సరే నిన్న రాలేదని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. అలానే బన్నీ కాస్త లేట్ గా స్పందించారని విమర్శించడం కూడా సమంజసం కాదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.