Begin typing your search above and press return to search.

నాగ్ సినిమా.. ఆదిలోనే హంసపాదు

By:  Tupaki Desk   |   27 Jun 2016 6:33 AM GMT
నాగ్ సినిమా.. ఆదిలోనే హంసపాదు
X
ఈ మధ్య కొన్ని సినిమాలు లేనిపోని కాంట్రవర్శీల్లో చిక్కుకుంటున్నాయి. ఇంకా సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే వివాదాలు మొదలైపోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విషయంలో ఓ వివాదం ఆ యూనిట్‌ ను చాలా చికాకు పెట్టిన సంగతి తెలిసిందే. ఎలాగోలా ఆ వివాదానికి తెరదించి.. సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. ఇప్పుడు మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా తన కొత్త సినిమా విషయంలో ఓ వివాదాన్ని ఎదుర్కొంటున్నారు.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఓం నమో వెంకటేశాయ’ పేరుతో నాగ్ ఓ భక్తిరస చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వరస్వామి భక్తుడు హథీ రాం బాబా జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఐతే హథీ రాంబాబా జీవిత కథతో సినిమా తీస్తూ.. తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదని.. అనుమతి కూడా తీసుకోలేదని.. తిరుమలలోని హథీ రాం బాబా మఠం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హథీ రాం బాబా జీవితాన్ని వక్రీకరించి సినిమా తీస్తే తాను అంగీకరించే ప్రసక్తే లేదని.. ఈ సినిమా విషయంలో కోర్టుకెళ్లేందుకు కూడా తాము సిద్ధమని మఠాధిపతి కృష్ణదాస్ అన్నారు.

విశేషం ఏంటంటే రాఘవేంద్రరావు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ఉన్నారు. హథీ రాం బాబా మఠాధిపతితో మాట్లాడటం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఆయన ఎప్పుడో ఆ పని చేయాల్సింది. తిరుమలకు వస్తూ పోతూనే తమకు మాట మాత్రమైనా సినిమా గురించి చెప్పకుండా.. చర్చించకుండా సినిమా మొదలుపెట్టేయడం మఠం పెద్దల మనసుల్ని గాయపరిచినట్లుంది. అంతే కాక.. ఎంత భక్తిరస చిత్రాలు తీసినా.. అందులో రాఘవేంద్రరావు మార్కు గ్లామర్ టచ్ కూడా ఉంటుంది. అన్నమయ్య.. రామదాసు సినిమాల్లో కూడా గ్లామర్ కోణాన్ని చూడొచ్చు. హథీరాం బాబా విషయంలో కూడా అలా చేస్తారని కంగారుపడ్డట్లున్నారు మఠం పెద్దలు.