Begin typing your search above and press return to search.

నిజమే.. 'బాహుబలి' కంటే RRR పెద్దది..!

By:  Tupaki Desk   |   20 March 2022 11:30 AM GMT
నిజమే.. బాహుబలి కంటే RRR పెద్దది..!
X
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

2021 నవంబర్ 26వ తేదీన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. మూడు కటింగ్స్ తో 186 నిమిషాల 54 సెకన్లు (3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు) నిడివితో బోర్డు సభ్యులు 'U/A' సర్టిఫికేట్ జారీ చేశారు.

తెలుగు వెర్షన్ లో 'F***ing' మరియు 'B***h' అనే అభ్యంతరకర పదాలకు సెన్సార్ బోర్డ్ కత్తెర వేసింది. అలానే CBFC అభ్యంతరం వ్యక్తం చేసిన నిర్దిష్ట సందర్భంలో ఓ డైలాగ్ నుండి 'ఇండియన్' అనే పదం తొలగించబడింది. హిందీ వెర్షన్‌ లో మాత్రం ఎలాంటి కటింగ్స్ లేవు.

అయితే, 2021 డిసెంబర్ 24న RRR మేకర్స్ స్వచ్ఛందంగా సినిమాలో కొన్ని కట్స్ చేసారని తెలుస్తోంది. 1 నిమిషం 35 సెకన్ల నిడివిగల ఓ సన్నివేశం కత్తిరించబడింది. అలానే ఎండ్ క్రెడిట్స్ కూడా 3 నిమిషాల 26 సెకన్ల వరకు తగ్గించబడ్డాయి.

'ఆర్.ఆర్.ఆర్' లో ఈ కటింగ్స్ చేసిన తర్వాత ఫైనల్ గా సినిమా నిడివి ఇప్పుడు 3 గంటల 1 నిమిషం 53 సెకన్లు (181 నిమిషాల 53 సెకన్లు) వచ్చింది. ఇది రాజమౌళి గత చిత్రాలతో పోల్చుకుంటే ఎక్కువ.

'బాహుబలి: ది బిగినింగ్' సినిమా రన్ టైం 2 గంటల 39 నిమిషాలు ఉండగా.. 'బాహుబలి: ది కన్క్లూజన్' నిడివి 2 గంటల 47 నిమిషాలుగా ఉంది. వీటితో పోల్చుకుంటే "ఆర్.ఆర్.ఆర్" కాస్త పెద్ద సినిమా అనే చెప్పాలి.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు నిజ జీవిత విప్లవ వీరుల పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తెరకెక్కింది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ - అజయ్ దేవగన్ మరియు శ్రియా శరణ్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూర్చారు.

డీవీవీ దానయ్య దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని నిర్మించారు. దీనికి రెండింతల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ టాక్. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్ళు నమోదు చేస్తుందో చూడాలి.